ఏపీ రాజధాని అమరావతి నిర్మాణంలో కీలక పరిణామం.. ఐఐటీ మద్రాస్‌తో కుదిరిన ఒప్పందం

www.mannamweb.com


ఐఐటీ మద్రాస్‌ సహకారం, ఇటు ప్రాజెక్టులను వేగవంతం చేస్తుండడంతో అమరావతిలో నిర్మాణ పనులు ఊపందుకోనున్నాయి.

ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతిని పట్టాలెక్కించే అభివృద్ధి పనులు చకచకా జరుగుతున్నాయి. దీనికోసం ఐఐటీ మద్రాస్‌తో కీలక ఒప్పందాలు చేసుకుంది ఏపీ సర్కార్‌. ఇక రాజధానిలో భూ కేటాయింపుల పునరుద్ధరణపై కేబినెట్‌ సబ్‌ కమిటీ కీలక నిర్ణయాలు తీసుకుంది.

ఏపీలో NDA కూటమి అధికారంలోకి వచ్చాక పునరుజ్జీవం పొందిన అమరావతి… అభివృద్ధి దిశగా వడివడిగా అడుగులు వేస్తోంది. దీనికోసం ఐఐటి మద్రాసుతో ఏపీ ప్రభుత్వం 8 కీలక ఒప్పందాలు కుదుర్చుకుంది. మొదట సీఎం చంద్రబాబుతో భేటీ అయిన బృందం..ఆ తర్వాత మంత్రులు లోకేష్‌, నారాయణ, రాంప్రసాద్‌ రెడ్డి, బీసీ జనార్దన్‌ రెడ్డితో భేటీ అయింది.

అమరావతిలో అంతర్జాతీయ డీప్ టెక్ పరిశోధన, డిజైన్, ఇన్నోవేషన్, ఇంక్యుబేషన్ పార్క్ ఏర్పాటులో సలహాలు ఇచ్చేందుకు ఏపీ సీఆర్డీయేతో కలిసి ఐఐటీఎం పనిచేస్తుంది. సముద్ర పరిశోధన, కమ్యూనికేషన్, కోస్టల్ ఎనర్జీ హార్వెస్టింగ్ టెక్నాలజీలకు సంబంధించి ఏపీ మారిటైమ్‌ బోర్డుతో కలిసి మద్రాస్‌ ఐఐటీ పనిచేయనుంది. స్వయం ప్లస్, ఐఐటిఎం ప్రవర్తక్ డిజిటల్ స్కిల్ అకాడమీ వంటి ప్లాట్ ఫారాల ద్వారా స్కేల్ స్కిల్లింగ్ కార్యక్రమాల్లో నాణ్యత పెంచేలా ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్‌ సంస్థతో మరో ఒప్పందం కుదిరింది. ఇక పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా ప్రాథమిక, ఉన్నత, ఇంటర్మీడియట్‌ స్టూడెంట్స్‌కు, టీచర్స్‌కు ఐఐటీంఎ ప్రవర్తక్‌ ద్వారా శిక్షణ ఇచ్చేందుకు విద్యా శాఖతో ఒప్పందం కుదుర్చుకున్నారు.

ఎయిర్‌పోర్టులను లాజిస్టిక్స్, మెయింటెనెన్స్ హబ్‌లుగా మార్చేందుకు, కుప్పం, పుట్టపర్తి విమానాశ్రయాలను అభివృద్ధి చేసేందుకు ఇన్వెస్ట్‌మెంట్‌ అండ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ సంస్థతో మరో ఒప్పందం కుదిరింది. అధునాతన సాంకేతికతో విశాఖ మహా నగరాన్ని ఇంటర్నెట్‌ గేట్‌వేగా మార్చేందుకు ఐటీ శాఖతో ఒప్పందం కుదిరింది. ఏఐ, డేటా సైన్స్ రంగాల్లో మౌలిక సదుపాయాలను మెరుగు పరచడానికి ఆర్టీజీఎస్ డిపార్ట్‌మెంట్‌తో కలిసి పనిచేస్తారు. ఇక అమరావతిలో అంతర్జాతీయ స్థాయిలో స్మార్ట్ టెక్ ఎనేబుల్డ్ స్పోర్ట్స్ సిటీ ఏర్పాటుకు సాంకేతిక సలహాలు ఇవ్వనుంది మద్రాస్‌ ఐఐటీ.

ఇక రాజధానిలో భూముల కేటాయింపులపై మంత్రి వర్గ ఉపసంఘం సమావేశం అయింది. అమరావతికి వస్తాం – నిర్మాణాలు ప్రారంభిస్తాం అని చాలామంది ముందుకొస్తున్నారని, గతంలో భూములు కేటాయించిన సంస్థలతో చర్చించాలని సీఆర్డీయే అధికారులను ఆదేశించామన్నారు మంత్రి నారాయణ. గతంలో మధ్యలో నిలిచిపోయిన పనుల టెండర్ల రద్దుపై కమిటీ నివేదికను వచ్చే కేబినెట్ లో పెడతామన్నారు మంత్రి పయ్యావుల కేశవ్‌. కేబినెట్ ఆమోదం తర్వాత రీ టెండర్లు పిలుస్తామన్నారు. గతంలో భూములు కేటాయించిన సంస్థలు త్వరగా నిర్మాణాలు ప్రారంభించేలా వారితో సంప్రదింపులు జరుపుతామన్నారు ఆయన. అటు ఐఐటీ మద్రాస్‌ సహకారం, ఇటు ప్రాజెక్టులను వేగవంతం చేస్తుండడంతో అమరావతిలో నిర్మాణ పనులు ఊపందుకోనున్నాయి.