ఇస్రోతో జతకట్టిన ఎలన్ మస్క్

www.mannamweb.com


ఎలెన్ మస్క్.. స్పేస్ ఎక్స్.. ప్రపంచవ్యాప్తంగా తరచూ వినపడుతున్న పేర్లు.. అంతరిక్ష ప్రయోగాల్లో నాసా తర్వాత వినూత్నమైన ప్రయోగాల్లో దూసుకుపోతున్న సంస్థ స్పేస్ ఎక్స్.

స్పేస్ ఎక్స్‌ను ఎలెన్ మస్క్ స్థాపించారు. సాధారణంగా అంతరిక్ష ప్రయోగాల కోసం ఉపయోగించే వాహక నౌకలు ఒకసారి ప్రయోగం జరిగితే ఆ తర్వాత మళ్లీ వినియోగించడం కుదరదు. అందుకోసం వందల కోట్లలో ఖర్చు వృధా అవుతూ ఉంటుంది. అయితే ఇలా మస్క్ ఈ విషయంలో ప్రపంచ దేశాల్లో జరుగుతున్న అంతరిక్ష ప్రయోగాల చరిత్రను తిరగరాశారు. రీ యూసేబుల్ రాకెట్‌ను తయారు చేసి సక్సెస్ అయ్యారు.

అనేక సందర్భాల్లో ఇలాంటి ప్రయోగాలను స్పేస్ ఎక్స్ సంస్థ విజయవంతంగా పూర్తి చేసింది. ఇక భారత్ కూడా అంతరిక్ష ప్రయోగాల్లో తనదైన ముద్ర సంపాదించుకుంది. భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ(ఇస్రో) ఇటీవల కాలంలో దేశీయ అవసరాలతో పాటు.. కమర్షియల్ పరంగానూ సక్సెస్ రేట్‌ను పెంచుకుంది. ఇతర దేశాలకు చెందిన వందలాది ఉపగ్రహాలను కక్షలోకి ప్రవేశపెట్టి భారత సత్తాను ప్రపంచస్థాయిలో నిలిపింది.

తాజాగా ఇస్రో ఎలన్ మస్క్‌కు చెందిన స్పేస్ ఎక్స్ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుని కీలక ప్రయోగానికి సిద్ధమైంది. స్పేస్ ఎక్స్‌కు చెందిన ఫాల్కన్ 9 రాకెట్ ద్వారా భారత్‌కు చెందిన జీ-శాట్ 20 ఉపగ్రహాన్ని కక్షలోకి ప్రవేశపెట్టేందుకు ఒప్పందం కుదిరింది. సోమవారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఈ ప్రయోగం అమెరికా నుంచి జరగనుంది. గతంలో ఇస్రో రెండు టన్నుల కంటే తక్కువ బరువు గల ఉపగ్రహాలను మాత్రమే నింగిలోకి పంపగలిగేది. ఆ తర్వాత జిఎస్‌ఎల్‌వి మార్క్-3 భారీ వాహక నౌకను సిద్ధం చేసి వాటి ద్వారా నాలుగు టన్నుల బరువున్న ఉపగ్రహాలను సైతం నింగిలోకి పంపగలిగే సామర్థ్యం పెంచుకుంది. కమ్యూనికేషన్ శాటిలైట్లను అంతరిక్షంలోకి పంపే సంఖ్యను ఇస్రో ఇటీవల అనూహ్యంగా పెంచింది. తాజాగా జీ-శాట్ 20 ఉపగ్రహం కూడా మారుమూల ప్రాంతాల వరకు కమ్యూనికేషన్ సామర్థ్యాన్ని మరింత మెరుగుపరిచేలా రూపొందించిన ఉపగ్రహాన్ని నింగిలోకి పంపాలని నిర్ణయించుకుంది.

అయితే ఈ ఉపగ్రహం బరువు 4700 కిలోల బరువు ఉంది. నాలుగు టన్నుల కంటే ఎక్కువ పరువు ఉన్న ఉపగ్రహాన్ని భారత్ నుంచి పంపడం సాధ్యం కాదు.. అందుకే ఎలన్ మస్క్‌కు చెందిన స్పేస్ ఎక్స్ ద్వారా ఈ ఉపగ్రహాన్ని లక్ష్యలోకి పంపేందుకు ఒప్పందం కుదుర్చుకొని ప్రయోగం చేపడుతోంది ఇస్రో. ఈ ప్రయోగం కోసం సుమారు 570 కోట్లు ఖర్చు అవుతుంది. గతంలో అత్యంత బరువైన ఉపగ్రహాలను లక్ష్యలోకి ప్రవేశపెట్టాలంటే రష్యా సహకారంతో ఇస్రో ఉపగ్రహాలను నింగిలోకి పంపేది. ఉక్రెయిన్, రష్యా మధ్య జరుగుతున్న యుద్ధం కారణంగా ఈసారి సక్సెస్ రేట్ అధికంగా ఉన్న ఎలెన్ మస్క్‌కు చెందిన స్పేస్ ఎక్స్ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుని ప్రయోగాన్ని చేపడుతోంది.