మరింత ఆలస్యంకానున్న మెగా డీఎస్సీ.. 6 నెలల తర్వాతే నోటిఫికేషన్‌?

www.mannamweb.com


ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో షెడ్యూల్‌ ప్రకారం మెగా డీఎస్సీ 2024 నోటిఫికేషన్‌ మరికొన్ని గంటల్లో (నవంబర్‌ 6) విడుదలవుతుందనగా.. అనూహ్యంగా వాయిదా వేస్తు్న్నట్లు నవంబర్‌ 5న విద్యాశాఖ ప్రకటించింది.

టెట్‌ ఫలితాలు వచ్చిన వెంటనే మెగా డీఎస్సీ ప్రకటన ఇస్తామని నిరుద్యోగులను ఊరించి చివరి నిమిషంలో వాయిదా వేసి షాకించ్చింది. ఇక అప్పటి నుంచి రేపు.. మాపు.. అంటూ వాయిదాల పర్వం కొనసాగుతూనే ఉంది. విద్యాశాఖ తీరు చూస్తుంటే ఇప్పట్లో మెగా డీఎస్సీ ప్రకటన వచ్చే అవకాశం లేనట్లు తెలుస్తుంది. అందుకు కారణం ఎస్సీ వర్గీకరణకు సుప్రీంకోర్టు అనుకూలంగా తీర్పు ఇవ్వడమే. అవును.. ఎస్సీ, ఎస్టీ వర్గీకరణ జరిగేవరకూ ఆంధ్రప్రదేశ్‌లో మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌ వచ్చేలా కనిపించడం లేదు.

సుప్రీంకోర్టు తీర్పు మేరకు ఎస్సీ వర్గీకరణ డీఎస్సీ నుంచే అమలు చేయాలని తాజాగా సర్కార్‌ నిర్ణయించింది. రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ ఎలా చేయాలన్న దానిపై ప్రభుత్వం ఇప్పటికే ఏకసభ్య కమిషన్‌ను నియమించింది. దీనిపై 2 నెలల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. ఇక ఈ నివేదిక వచ్చిన తర్వాతే డీఎస్సీ నోటిఫికేషన్‌ వెలువడనుంది. ఈ మేరకు 2, 3 నెలల్లో నోటిఫికేషన్‌ జారీ చేసేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. అప్పటి వరకూ అభ్యర్ధులు వేచి చూడకుండా డీఎస్సీకి సిద్ధంగా ఉండాలని ప్రభుత్వం సూచించింది. నోటిఫికేషన్‌ జారీ అయ్యాక భర్తీ ప్రక్రియ వెనువెంటనే పూర్తిచేసేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. వచ్చే ఏడాది ఇవ్వనున్న వేసవి సెలవుల అనంతరం 2025-26 విద్యా సంవత్సరంలో బడులు ప్రారంభమయ్యే సమయానికి కొత్త టీచర్లు బడుల్లో ఉండడమే లక్ష్యంగా ప్రభుత్వం అడుగులు వేస్తుంది.

మరోవైపు డీఎస్సీ నోటిఫికేషన్‌ 2, 3 నెలలపాటు వాయిదా వేసినప్పటికీ అనుకున్న సమయానికి టీచర్ల భర్తీ ప్రక్రియ పూర్తవుతుందా.. లేదా.. అనేదానిపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. వర్గీకరణ ప్రక్రియ పూర్తయితేన వెంటనే ఆ మేరకు ఆర్‌వోఆర్‌లో మార్పులు చేసి, వెనువెంటనే డీఎస్సీ నోటిఫికేషన్‌ ఇవ్వాలని ప్రభుత్వం యోచిస్తుంది. ఒకవేళ వర్గీకరణకు 6 నెలల సమయం తీసుకుంటే అప్పుడు ఏం చేయాలి? అనేది ప్రశ్నార్ధకంగా మారింది. ఆరు నెలల తర్వాతే డీఎస్సీ ప్రక్రియ ప్రారంభిస్తే విద్యా సంవత్సరం మధ్యలో కొత్త టీచర్లు వచ్చే పరిస్థితి నెలకొంది. అయితే విద్యాశాఖ మాత్రం విద్యా సంవత్సరం ప్రారంభం నాటికే భర్తీ ప్రక్రియ పూర్తవుతుందని గట్టిగా చెబుతోంది. దీంతో.. అసలేం జరుగుతుందో తెలియక అభ్యర్ధులు గందరగోళ పడుతున్నారు.