ఎలక్ట్రిక్ కార్ల మార్కెట్‌లో టాటా కంపెనీకి తిరుగులేదు. ఇప్పుడు మరో మోడల్ కూడా ఈ సెగ్మెంట్‌లోకి వచ్చేందుకు సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తోంది. టాటా హారియర్ ఈవీని లాంచ్ చేసేందుకు కంపెనీ చూస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి.
ఎలక్ట్రిక్ కార్లకు పెరగుతున్న డిమాండ్‌తో పెద్ద పెద్ద కంపెనీలు సైతం కొత్త కొత్త మోడళ్లను మార్కెట్లోకి వదులుతున్నాయి. ఈ సెగ్మెంట్‌లో టాటాకు మంచి పేరు ఉంది. దేశీయ మార్కెట్లో ఈ కంపెనీ విక్రయించే టియాగో ఈవీ, టిగోర్ ఈవీ, పంచ్ ఈవీ, నెక్సాన్ ఈవీ, కర్వ్ ఈవీకి మంచి డిమాండ్ ఉంది. ఇప్పుడు కంపెనీ సైలెంట్‌గా సరికొత్త హారియర్ ఈవీని లాంచ్ చేయడానికి రెడీ అవుతోంది. అతి త్వరలో ఈ కారు అమ్మకానికి రానుంది.
కొత్త టాటా హారియర్ ఈవీని మార్చి 2025లో అమ్మకానికి వచ్చే అవకాశం ఉంది. ఆ తరువాత సియెర్రా ఈవీని మార్కెట్లోకి వదలనున్నారు. కొత్త హారియర్ ఈవీపై కస్టమర్లకు అనేక అంచనాలు ఉన్నాయి. టాటా హారియర్ ఈవీకి మంచి ఎక్ట్సీరియర్ డిజైన్‌ను కలిగి ఉంటుంది. ఇందులో కొత్త గ్రిల్, మెరుగైన ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్‌లు, ఎల్ఈడీ డీఆర్‌ఎల్‌లు, అల్లాయ్ వీల్స్ లభిస్తాయని భావిస్తున్నారు. ఈ కారు మంచి కలర్ ఆప్షన్స్‌తో వస్తుందని అనుకుంటున్నారు.
కొత్త టాటా హారియర్ ఈవీ పెద్ద, శక్తివంతమైన బ్యాటరీ ప్యాక్‌ను కలిగి ఉంటుంది. ఇది డ్యూయల్ మోటార్ సెటప్‌తో వస్తుంది. ఆల్-వీల్ డ్రైవ్ టెక్నాలజీని కలిగి ఉంటుంది. ఇది పూర్తి ఛార్జింగ్‌పై 500 కిలోమీటర్ల వరకు రేంజ్ (మైలేజీ) ఇస్తుందని అంచనా వేస్తున్నారు.
టాటా హారియర్ ఎలక్ట్రిక్ కారులో ఐదుగురు ఈజీగా ప్రయాణించొచ్చు ఇది టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే, డ్యూయల్ జోన్ ఆటోమేటిక్ ఏసీ, 6 వే పవర్ డ్రైవర్ సీటు, వైర్‌లెస్ ఫోన్ ఛార్జింగ్, పనోరమిక్ సన్‌రూఫ్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు వంటి వివిధ ఫీచర్లను పొందుతుంది.
ప్రయాణికులకు సేఫ్టీపరంగానూ ఈ కారు అద్భుతంగా ఉంటుంది. ఇందులో 7 ఎయిర్‌బ్యాగ్‌లు, ఈఎస్‌పీ(ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్), టీపీఎంఎస్(టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్), ఏడీఏఎస్(అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్స్), హిల్-హోల్డ్, హిల్-డీసెంట్ కంట్రోల్, 360 డిగ్రీ కెమెరాలు కూడా రానున్నాయని అంచనా.
దీని ధర సుమారు రూ.30 లక్షలు(ఎక్స్-షోరూమ్)గా ఉండే అవకాశం ఉంది. టాటా హారియర్ ఈవీపై కస్టమర్లకు చాలా అంచనాలు ఉన్నాయి. దాని తగ్గట్టుగానే మార్కెట్‌లోకి తీసుకొచ్చేందుకు కంపెనీ ప్లాన్ చేస్తోంది. ఈ కారు ప్రీమియం ఎలక్ట్రిక్ ఎస్‌యూవీగా ఉంటుందని భావిస్తున్నారు.