ఏపీలో భారీగా పెట్టుబడులు.. వేల సంఖ్యలో ఉద్యోగావకాశాలు

www.mannamweb.com


ఏపీలో భారీగా పెట్టుబడులు.. వేల సంఖ్యలో ఉద్యోగావకాశాలు కల్పించాలన్న లక్ష్యంతో చంద్రబాబు సర్కార్ ముందుకు సాగుతోంది.. ఈ క్రమంలో.. మంగళవారం సచివాలయంలో అత్యంత కీలకమైన స్టేట్ ఇన్వెస్ట్ మెంట్ ప్రమోషన్ బోర్డ్ మీటింగ్ జరిగింది. ఈ ఎస్ఐపిబి తొలి సమావేశంలో 33,966 ఉద్యోగాలు కల్పించే రూ.85వేల కోట్ల పెట్టుబడులకు సంబంధించి 10 కంపెనీలకు ఆమోదం తెలిపింది. ఈ సందర్భంగా భారీ పరిశ్రమలకు భూముల కోసం ల్యాండ్ పూలింగ్ విధానం చేపట్టాలన్న ముఖ్యమంత్రి చంద్రబాబు పరిశ్రమలకు భూములు ఇచ్చే వారికి స్కిల్ డెవల్మెంట్ ద్వారా అదే సంస్థలో ఉద్యోగ, ఉపాధి కల్పించేలా ప్రతిపాదనలు తయారు చేయాలని కోరారు. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ను సాకారం చేసేలా ఒప్పందాలను నిత్యం ట్రాక్ చేయాలని సిఎం సూచించారు. దేశంలో పెట్టుబడుల కోసం రాష్ట్రాల మధ్య తీవ్రమైన పోటీ ఉందని.. ఆ పోటీని తట్టుకుని రాష్ట్రానికి పెట్టుబడులు సాధించేలా అధికారులు పనిచేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచించారు. గత ప్రభుత్వ విధానాల వల్ల 5 సంవత్సరాలు పెట్టుబడులు రాలేదని, ఒప్పందాలు చేసుకున్న వాళ్లు కూడా గత ప్రభుత్వ తీరుతో వెనక్కి వెళ్లిపోయారని అన్నారు. ప్రభుత్వ టెర్రిరిజంతో పారిశ్రామిక వేత్తలు పారిపోయారని సిఎం గుర్తుచేశారు. ప్రభుత్వాలు తెచ్చే పాలసీలు సమాజంపై అత్యంత ప్రభావం చూపుతాయని పరిశ్రమల వర్గాల అవసరాలు, కంపెనీల మంచి చెడులూ కూడా ప్రభుత్వాలు చూసి పాలసీలు రూపొందించాలని సిఎం అన్నారు.

పెట్టుబడులు పెట్టేవారికి గౌరవం ఇవ్వాలన్న సీఎం

రాష్ట్రానికి పెట్టుబడులు పెట్టడానికి వచ్చే వారికి గౌరవం ఇవ్వాలన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు. వారికి అన్ని రకాలుగా అధికారులు సహకరించాలని సీఎం సూచించారు. పెట్టుబడులు పెట్టేవారిని ప్రోత్సహించేలా ప్రభుత్వంలోని ప్రతి ఒక్కరూ పనిచేయాలని.. దాని వల్ల యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని అన్నారు. ఏ పాలసీ తయారు చేసినా.. ప్రజా ప్రయోజనాలతో పాటు.. పారిశ్రామిక వేత్తల గురించి ఆలోచించాలని.. అప్పుడే పోటీని తట్టుకుని పెట్టుబడులు సాధించవచ్చన్నారు. ఒక పెట్టుబడిపై చర్చ మొదలైతే దాన్ని సాకారం చేసే వరకు ట్రాక్ చేసి దాన్ని ఫలవంతం చేయాలని సూచించారు.

ఆ పది కంపెనీ లు ఇవే

సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన స్టేట్ ఇన్వెస్టిమెంట్ ప్రమోషన్ బోర్డ్ మీటింగ్ జరిగింది. ప్రభుత్వం ఏర్పడిన తరువాత జరిగిన తొలి మీటింగ్ లో పలు పెట్టుబడులు, ఒప్పందాలపై చర్చించారు. రాష్ట్రంలో గడిచిన 5 నెలల్లో వివిధ పెట్టుబడుల ప్రతిపాదనలు, ఒప్పందాలు, వాటి ప్రోగ్రెస్ పై సమీక్ష జరిపారు. మొత్తం 10 సంస్థలకు సంబంధించి రూ.85,083 కోట్ల పెట్టుబడులకు ఎస్ఐపిబి ఆమోదం తెలిపింది. ఈ పెట్టుబడుల ద్వారా 33,966 ఉద్యోగాలు రానున్నాయి.

ఎస్ఐపిబి సమావేశంలో 10 భారీ పరిశ్రమల పెట్టుబడులకు ఆమోదం తెలుపుతూ నిర్ణయం తీసుకున్నారు. ఇందులో ఆర్సెలర్స్ మిత్తల్ & నిప్పాన్ స్టీల్స్ జెవి నక్కపల్లి సమీపంలోని బంగారయ్యపేట వద్ద ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ (క్యాప్టివ్ పోర్టుతో కలిపి) తొలిదశ నిర్మాణానికి రూ.61,780 కోట్లు పెట్టుబడులతో 21 వేల మందికి ఉద్యోగాలు కల్పించనుంది. ఎల్ జి ఎలక్ట్రానిక్స్ ఇండియా ప్రైవేటు లిమిటెడ్ రూ.5,001 కోట్లు (1495 ఉద్యోగాలు), కళ్యాణి స్ట్రాటజీ సిస్టమ్స్ లిమిటెడ్ రూ.1430కోట్లు (565 ఉద్యోగాలు), టాఫే ఫరేషియా ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ రూ.76కోట్లు (250 ఉద్యోగాలు), ఫిలిప్స్ కార్బన్ బ్లాక్ లిమిటెడ్ రూ.3,798 కోట్లు (200 ఉద్యోగాలు), అజాద్ ఇండియా మొబిలిటీ లిమిటెడ్ రూ.1046కోట్లు (2,381 ఉద్యోగాలు), డల్లాస్ టెక్నాలజీ సెంటర్ ఎల్ఎల్ పి రూ.50కోట్లు (2వేల ఉద్యోగాలు), ఆస్తా గ్రీన్ ఎనర్జీ వెంచర్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ రూ.8,240 కోట్లు (4వేల ఉద్యోగాలు), గ్రీన్ కో సోలార్ ఐఆర్ఇపి ప్రైవేట్ లిమిటెడ్ రూ.2వేల కోట్లు (1725 ఉద్యోగాలు), ఎకోరెన్ ఎనర్జీ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ రూ.1662 కోట్లు (350 ఉద్యోగాలు) పెట్టుబడులు పెట్టనున్నాయి. వీటికి ఎస్ఐపిబి ఆమోదం తెలిపింది.

ఈ సందర్భంగా అధికారులు పలు అంశాలు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువచ్చారు. గత ప్రభుత్వం పరిశ్రమలకు ఇవ్వాల్సిన ప్రోత్సహాకాలను కూడా చెల్లించలేదని అధికారులు వివరించారు. గత తెలుగు దేశం హయాంలో పరిశ్రమలకు ప్రోత్సాహకాల కింద రూ.3883 కోట్లు చెల్లిస్తే.. వైసీపీ ప్రభుత్వం రూ.1961 కోట్లు మాత్రమే ఇచ్చిందని తెలిపారు. తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో 66 శాతం మేర ప్రోత్సాహకాలు చెల్లించగా.. వైసీపీ ప్రభుత్వం 34 శాతం మాత్రమే ప్రోత్సాహకాలు ఇచ్చిందని వివరించారు. దీనిపై ముఖ్యమంత్రి మాట్లాడుతూ పరిశ్రమ వర్గాల అవసరాలతో పాటు.. భూములు ఇచ్చే ప్రజల సంక్షేమం కూడా చూడాల్సి ఉందన్నారు. అర్సెలార్ మిత్తల్ స్టీల్ ప్లాంట్ కు అవసరమైన భూములు సేకరించే క్రమంలో ల్యాండ్ పూలింగ్ విధానాన్ని పాటించాలని అధికారులకు సూచించారు. పెద్ద పెద్ద పరిశ్రమలకు భూములు కావాల్సిన చోట.. మూడు రకాలుగా భూ సేకరణ చేపట్టాలని సిఎం సూచించారు. రాజధాని అమరావతిలో చేపట్టినట్లు భూ సమీకరణ విధానాన్ని ప్రజల ముందు ఉంచాలని తెలిపారు. రెండో ఆప్షన్ కింద ఏ ప్రాజెక్టు కోసం అయితే భూములు తీసుకుంటున్నారో వాటిలో భూములు ఇచ్చే వారికి అవసరమైన స్కిల్ డవల్మెంట్ ఇచ్చి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలన్నారు. లేదంటే ఉన్నంతలో బెస్ట్ ప్యాకేజ్ ద్వారా భూ సేకరణ చేపట్టాలని అన్నారు.
భూములు కోల్పోయే వారి భవిష్యత్ కు భరోసా ఇవ్వాలన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్..

పెట్టుబడులు ఎంత ముఖ్యమో.. భూములు కోల్పోయే ప్రజల భవిష్యత్ కూడా అంతే ముఖ్యం అన్న ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అభిప్రాయాన్ని సీఎం చంద్రబాబు బలపరిచారు. భారీ ప్రాజెక్టుల వద్ద హౌసింగ్ కాలనీలతో పాటు….సోషల్ లైఫ్ కు అవసరమైన అన్ని సదుపాయాలు కల్పించేలా కంపెనీలతో పనిచేయాలని అన్నారు. అర్సెలార్ మిత్తల్ స్టీల్ ఫ్యాక్టరీ ద్వారా ప్రత్యక్షంగా 61 వేల మందికి పరోక్షంగా లక్షల మందికి ఉపాధి లభిస్తుందని సీఎం అన్నారు. ఈ ప్రాజెక్టును 4 ఏళ్లలో కార్యరూపం దాల్చేలా చూడాలని మంత్రులకు సూచించారు. ఇది పూర్తి అయితే ఆ ప్రాంతంలో ఒక కొత్త నగరం ఏర్పాటు అవుతుందని సిఎం అన్నారు. అటు మూలపేట పోర్టు, ఈ స్టీల్ ప్రాజెక్టు పూర్తి అయితే ఆ ప్రాంతాల రూపురేఖలు మారిపోతాయని సిఎం అన్నారు. పెట్టుబడుల విషయంలో కంపెనీలతో నిరంతరం సంప్రదింపులు జరిపి.. అన్ని అడ్డంకులు తొలగించి త్వరగా గ్రౌండ్ అయ్యేలా చూడాలని సిఎం సూచించారు. దీని కోసం మంత్రులు, అధికారులు కంపెనీలతో చేసుకున్న ఒప్పందాలను ఎప్పటికప్పుడు ట్రాక్ చేయాలని సూచించారు.