ఫీజు రీయింబర్స్‌మెంట్‌ వీరికే, చెల్లింపు ఇలా- ప్రభుత్వం ఉత్తర్వులు

www.mannamweb.com


ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ చెల్లింపు పైన స్పష్టత ఇచ్చింది. ఇప్పటి వరకు ఉన్న విధానంలో మార్పు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

విద్యార్థుల హాజరు ఆధారంగా ఫీజులు విడుదల అవుతాయని పేర్కొంది. గతంలో ఉన్న విధానం తిరిగి అమలు చేయాలని నిర్ణయించింది. ఇందుకు సంబంధించి తాజాగా సాంఘిక సంక్షేమ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. మార్గదర్శకాలను ప్రత్యేకంగా వెల్లడించనున్నారు.

ప్రభుత్వం తాజా నిర్ణయం

విద్యార్ధుల ఫీజు రీయంబర్స్ మెంట్ పైన ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఫీజు రీయంబర్స్ మెంట్ గురించి ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీ మేరకు కొత్త విధానంలో ఇక చెల్లింపులు జరిగే లా నిర్ణయం తీసుకుంది. ఈ విద్యా సంవత్సరం నుంచి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ కింద చెల్లించా ల్సిన ఫీజులను నేరుగా కాలేజీల ఖాతాలకు జమ చేసే విధానం అమల్లోకి తెస్తూ ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. 2024-25 విద్యా సంవత్సరం నుంచి విద్యార్థులకు ఇచ్చే ఫీజులు (ఎస్సీ విద్యార్థులు మినహా) కాలేజీల ఖాతాల్లో జమ చేయనున్నట్లు ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. ఇదే సమయంలో విద్యార్థుల హాజరు ఆధారంగా ఫీజులు విడుదల అవుతాయని ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది.

పాత విధానంలోనే

ఇక, ఫీజు రీయంబర్స్ మెంట్ అమలు పైన త్వరలో మార్గదర్శకాలు విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. గత ప్రభుత్వ హయాంలో అమలు చేసిన విధానం కారణంగా విద్యార్ధుల పేరెంట్స్ ఇబ్బందులు పడ్డారని కూటమి నేతలు ఆరోపిస్తున్నారు. 2019కి ముందు ఫీజులను కాలేజీలకు జమ చేసే విధానం ఉండగా వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత మార్పు చేసింది. విద్యార్థుల తల్లిదండ్రుల ఖాతాలకు ఫీజులు ఇచ్చే విధానం అమల్లోకి తెచ్చింది. దీని కారణంగా సమస్యలు తలెత్తాయని కూటమి నేతలు చెబుతున్నారు. దీంతో, కాలేజీ యాజమాన్యాలు పేరెంట్స్ పైన ఒత్తిడి తెచ్చి ముందుగానే ఫీజులు కట్టించుకున్నారు. ఇప్పుడు ప్రభుత్వం నేరుగా కాలేజీలకు జమ చేయాలని నిర్ణయంతో ఇక పేరెంట్స్ పైన ఒత్తిడి ఉండదనేది కూటమి నేతల వాదన.

హజరు తప్పనిసరి

2023-24 విద్యా సంవత్సరంలో మూడు క్వార్టర్లు ఇప్పటికీ పెండింగ్‌లో ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. ఫీజులు కట్టకపోతే సర్టిఫికెట్లు ఇవ్వబోమంటూ కాలేజీలు మెలిక పెట్టటంతో విద్యార్ధులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల సమయంలో పాత విధానం పునరుద్ధరించి ఫీజుల సమస్య పరిష్కరిస్తామని కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఈ మేరకు ఇప్పుడు పాత విధానం తీసుకొచ్చింది. అయితే, ఈ సారి హాజరు తప్పని సరి చేస్తూ ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. ఇక, పథకం అమలుకు సంబంధించిన పూర్తి విధి విధానాలను ప్రభుత్వం త్వరలో ప్రకటన చేసే అవకాశం కనిపిస్తోంది.