ఆంధ్రజ్యోతి పత్రిక ఓనర్ వేమూరి రాధాకృష్ణ మొన్నటి ఆదివారం తన కొత్త పలుకులో వైఎస్ఆర్సిపి రాజ్యసభ సభ్యుడు విజయ సాయి రెడ్డిని ఉద్దేశించి తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.
” నీది ఒక మనిషి పుట్టుకేనా. ఐతే నాతో చర్చ కు రా.. మా ఇంటికి ఎన్నిసార్లు వచ్చావు? ఎందుకు వచ్చావో చెప్పనా? ఎవరు పంపిస్తే వచ్చావో చెప్పనా? నా ముందు ఏం మాట్లాడవో చెప్పనా? బిజెపిలోకి వైఎస్ఆర్సిపి రాజ్యసభ సభ్యులను పంపిస్తానని అమిత్ షాక్ వాగ్దానం ఇచ్చింది నిజం కాదా? నమ్మలేని రాజకీయ నాయకుడు అంటూ నిన్ను బీజేపీ పెద్దలు అన్నది వాస్తవం కాదా” ఇలా సాగిపోయింది రాధాకృష్ణ వ్యాసం. ఇద్దరికీ ఎక్కడ చెడిందో, ఎందుకు ఇద్దరి మధ్య ఈ స్థాయిలో వైరం మొదలైందో తెలియదు గాని.. మొత్తానికి మొన్నటి కొత్త పలుకులో రాధాకృష్ణ కేసీఆర్, జగన్ మీది కంటే విజయసాయిరెడ్డి మీదనే ఎక్కువగా ప్రతాపం చూపించాడు. తన కొత్త పలుకులో ఒక రాజకీయ నాయకుడిని ఉద్దేశించి ఈ స్థాయిలో రాధాకృష్ణ ఇంతవరకూ విమర్శలు చేయలేదు. తనకు నచ్చని జగన్ మీద, తను ఇష్టపడని కేసీఆర్ మీద కూడా రాధాకృష్ణ ఈ స్థాయిలో ధ్వజమెత్తలేదు. రాధాకృష్ణ విమర్శించి రెండు రోజులు పూర్తయి.. మూడో రోజు మొదలైన తర్వాత విజయసాయిరెడ్డి స్పందించారు. ట్విట్టర్ వేదికగా రాధాకృష్ణ మీద విమర్శల వర్షం కురిపించారు.
విజయసాయి రెడ్డి ఏమన్నారంటే..
” శ్రీ రాధాకృష్ణ ఎమర్జెన్సీ కాలంలో ఇండియన్ ఎక్స్ప్రెస్ వ్యవస్థాపకుడు రామ్ నాథ్ గోయంకా ఇందిరా గాంధీకి వ్యతిరేకంగా పోరాటం చేశారు. నాడు ఆయన సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారు కాబట్టే కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నాయంగా రాజకీయ వ్యవస్థ ఈ దేశంలో ఏర్పాటయింది. అంతటి స్థాయి ఉన్నప్పటికీ రామ్ నాథ్ వారసులు నేటికీ మీడియానే నమ్ముకుని ఉన్నారు. అత్యంత సాధారణ జీవితాన్ని గడుపుతున్నారు. ఇండియన్ ఎక్స్ ప్రెస్ 92 సంవత్సరాల క్రితం ఏర్పాటయింది. ఆ సంస్థ ఆస్తులు… నీ నెలరోజుల సెటిల్మెంట్ సంపాదనతో సరిపోతుంది. ఈ ప్రకారం నువ్వు ఎంత అవినీతిపరుడివో వేరే చెప్పాల్సిన అవసరం లేదని” విజయసాయిరెడ్డి రాధాకృష్ణ ఉద్దేశించి విమర్శించారు. మరో ట్వీట్లో ఆంధ్రజ్యోతి పత్రిక, ఏబీఎన్ పుట్టుక గురించి సంచలన ఆరోపణలు చేశారు.
“రాధాకృష్ణ గారు తన మీడియా సంస్థల్లో నష్టాలు వస్తున్నాయని అమెరికా వెళ్తారు. ఎన్నారైల వద్ద చందాలు తెచ్చుకుంటారు.. మీ కళ్ళకు కలర్ బ్లైండ్ నెస్ ఉంది. అందువల్ల కొందరే కనిపిస్తారు. మిగతావాళ్లు మొత్తం నువ్వు ఎలా విమర్శించినా పడుతూ ఉండాలి. నువ్వు సెటిల్మెంట్లు చేస్తే వారు సంపాదనకు ఉపయోగపడాలి. అలానే అనుకుని స్వార్థపూరితమైన వ్యక్తిత్వాన్ని ప్రదర్శిస్తుంటారు. నువ్వు సుదురు చెప్పడం మానేయి.. నిన్ను చూస్తే ఊసరవెల్లి కూడా సిగ్గుపడతాయని” విజయ సాయి రెడ్డి రాధాకృష్ణ ఉద్దేశించి విమర్శించారు.
వాటదారులు ఏమయ్యారు
గతంలో మూతపడిన ఆంధ్రజ్యోతి పేపర్ కొనడానికి పెట్టుబడి పెట్టిన ఇద్దరు వాటాదారుల గురించి కూడా విజయసాయిరెడ్డి ఆరోపణలు చేశారు. ” రాధాకృష్ణ.. మూతపడిన ఆంధ్రజ్యోతిని కొనుగోలు చేయడంలో ఇద్దరు సహకరించారు. ఆ ఇన్వెస్ట్మెంట్ సమకూర్చిన వాళ్ళు ఇప్పుడు ఏమయ్యారు? వారితో నువ్వు డబ్బు పెట్టుబడి పెట్టేసిన తర్వాత.. బ్లాక్ మెయిల్ చేసి బయటికి పంపించింది నిజం కాదా.. విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్లు తయారుచేసే పారిశ్రామికవేత్త ఇప్పటికి తన స్నేహితుల వద్ద నీ మోసపూరితమైన బుద్ధి గురించి చెబుతూనే ఉంటాడు. న్యాయం, ధర్మం గురించి నీలాంటి వాళ్ళు మాట్లాడద్దు.. సామాజిక స్పృహలని నీలాంటి దళారులు చిత్ర విచిత్రమైన భ్రమలలో బతుకుతుంటారు. ఎప్పుడో ఒకసారి పెనుగాలి ప్రకంపనగా వీస్తుంది. ఆ గాలికి నామరూపాలు లేకుండా నీలాంటి వాళ్ళు కొట్టుకుపోతారని” విజయసాయిరెడ్డి వ్యాఖ్యానించారు.
బహిరంగ చర్చకు సవాల్
ఇక మొన్న వేమూరి రాధాకృష్ణ కొత్త పలుకులో బహిరంగ చర్చకు సిద్ధమా అని విజయసాయిరెడ్డికి సవాల్ విసిరారు. దానికి విజయసాయిరెడ్డి కూడా ఒప్పుకున్నారు. ” రాధాకృష్ణ.. బహిరంగ చర్చకు నేను సిద్ధం. నీ సవాల్ నేను స్వీకరిస్తున్నా. ఫేస్ టు ఫేస్ కౌంటర్ కు నేను సిద్ధంగానే ఉన్నాను.. అయినా నీ పక్షపాత టీవీ ఛానల్ ఆంధ్రజ్యోతికి నేను ఎందుకు రావాలి? . నేను ఐక్యరాజ్యసమితి నుంచి తిరిగి వచ్చిన తర్వాత ఎప్పుడైనా సిద్ధమే.. ఎవరి సచ్చీలత ఏమిటో తేలిపోతుంది. గడచిన ఐదు సంవత్సరాలలో మద్యం, ఖనిజం వ్యాపారాలు సాగించే బ్రోకర్లు, ఇతర డీల్స్ లో బాస్ పేరు చెప్పలేదా? చెప్పి వసూలు చేయలేదా.. వారికి ఇవ్వకుండా ఎంత తీసుకున్నావో.. ఆ విషయాలను కూడా చర్చిద్దాం.. జర్నలిస్ట్ కాలనీ లో నువ్వుండే ప్యాలస్.. నేను ఉండే బాడుగిళ్లు కూడా చూపిద్దాం. ఫిలింనగర్ ప్రధాన రోడ్డులో నువ్వు కొన్న నూరుకోట్ల విలువచేసే స్థలం.. అందులో ఇంకో రెండు వందల కోట్లతో కాడుతున్న కార్యాలయ భవంతి కూడా పరిశీలిద్దామని” విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. మొత్తానికి విజయసాయిరెడ్డి వరసగా చేసిన ట్వీట్లు తెలుగు రాజకీయాలలో సంచలనంగా మారాయి.