కేసీఆర్ వీరాభిమాని స్ఫూర్తివంతమైన ప్రయాణంరివ్యూ: కేశవ చంద్ర రమావత్ (కేసీఆర్)
తారాగణం: రాకింగ్ రాకేష్, అనన్య కృష్ణన్, లోహిత్, మైమ్ మధు, తనికెళ్ల భరణి, తాగుబోతు రమేష్, ధనరాజ్, జోర్దార్ సుజాత తదితరులు
సంగీతం: చరణ్‌అర్జున్
నిర్మాణ సంస్థ: గ్రీన్ ట్రీ ప్రొడక్షన్స్
నిర్మాత: రాకింగ్ రాకేష్
సినిమాటోగ్రఫీ, దర్శకత్వం: గరుడవేగ అంజి
KCR Movie Review | కేశవ చంద్ర రమావత్ (కేసీఆర్) సినిమా ప్రకటన వెలువడిన నాటి నుంచే ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచింది. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పేరుతో ఈ సినిమా తెరకెక్కడం, కేసీఆర్ ఆభిమాని కథగా సినిమా తీశానని ప్రధాన పాత్రధారి జబర్దస్త్ రాకింగ్ రాకేష్ ప్రచార కార్యక్రమాల్లో చెప్పడంతో ఈ సినిమాకు మరింత హైప్ వచ్చింది. ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూల్లో కూడా రాకింగ్ రాకేష్ ‘కేసీఆర్ వీరాభిమానిగా ఈ సినిమా తీశా. ఆయన పేరొక్కటి చాలు సినిమాకు ఓపెనింగ్స్ రావడానికి..’ అని ధీమా వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా ఎంత మేరకు అంచనాలను అందుకుందో తెలుసుకుందాం..
కథ గురించి..
వరంగల్ జిల్లా నర్సంపేట మండలంలోని రంగబాయి తండాకు చెందిన యువకుడే కేశవచంద్ర రమావత్ (కేసీఆర్). చిన్నతనంలో తెలంగాణ ఉద్యమం నడుస్తున్న సందర్భంలో కేసీఆర్ ప్రసంగాలు విని ఆయనపై అభిమానం పెంచుకుంటాడు. తండాలో అందరూ అతన్ని చోటా కేసీఆర్ అని పిలుస్తుంటారు. పేద గిరిజన కుటుంబం కావడం వల్ల కుటుంబాన్ని తానే వృద్ధిలోకి తీసుకురావాలని తపిస్తుంటాడు. అదే ఊరిలో ఉండే మరదలు మంజు (అనన్య కృష్ణన్) కేశవ చంద్ర రమావత్‌ను ప్రేమిస్తుంటుంది. ఇరు కుటుంబాలు కూడా వారిద్దరికి పెళ్లి చేయాలనే నిర్ణయానికి వస్తారు. అయితే బాగా చదువుకున్న పట్నం అమ్మాయిని పెళ్లాడితే జీవితం బాగుంటుందని, కుటుంబ ఆర్థిక స్థితిగతులు కూడా మెరుగుపడతాయనే స్నేహితుల తప్పుడు మాటల ప్రభావంతో మంజును పెళ్లాడటానికి నిరాకరిస్తాడు కేశవ చంద్ర రమావత్. దీంతో మామ భీమ్లానాయక్ (మైమ్ మధు) ఆగ్రహానికి గురవుతాడు. ఈలోగా తండాలో ఉండే బాగా డబ్బున్న ఆసామి కూతురుతో కేశవ చంద్ర సంబంధం కుదుర్చుకుంటాడు. అయితే ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలోనే తాను పెళ్లి చేసుకుంటానని, హైదరాబాద్‌కు వెళ్లి ఆయన్ని కలుసుకొని ఒప్పిస్తాననే లక్ష్యంతో కేశవ చంద్ర రమావత్ హైదరాబాద్‌కు చేరుకుంటాడు. అక్కడ అతనికి ఎలాంటి కష్టాలు ఎదురయ్యాయి? రింగ్ రోడ్డు వల్ల తన ఊరి ఉనికే ప్రశ్నార్థమైన తరుణంలో ఆ సమస్య పరిష్కారానికి కేశవ చంద్ర రమావత్ ఏం చేశాడు? కుటుంబానికి మాటిచ్చిన విధంగానే కేసీఆర్‌ను తన ఊరికి తీసుకురాగలిగాడా? చివరకు కేశవ చంద్ర రమావత్ ఎవరితో కలిసి పెళ్లిపీటలెక్కాడు? అనే అసక్తికరమైన ప్రశ్నలకు సమాధానంగా సినిమా కథ నడుస్తుంది.
కథా విశ్లేషణ..
గోరటి వెంకన్న రాసిన ‘పదగతులు స్వరజతులు పల్లవించిన నేల’ అనే పాటతో సినిమాను మొదలుపెట్టిన విధానం ఏదో తెలియని భావోద్వేగానికి గురిచేస్తుంది. ఈ పాటలో పచ్చటి పైరుని సింగారించుకున్న తెలంగాణ పటం పై నుంచి కేసీఆర్ నడచి వచ్చే సన్నివేశంతోనే తాను ఈ సినిమా ద్వారా ఏం చెప్పాలనుకుంటాడో స్పష్టం చేశాడు రాకింగ్ రాకేష్. తెలంగాణ వైతాళికులు, తేజోమూర్తులను జ్ఞప్తికి తెస్తూ ఈ పాట ఉద్వేగాన్ని పంచింది. చిన్నతనంలోనే కేసీఆర్ ప్రసంగాల పట్ల కేశవ చంద్ర రమావత్ ఆకర్షితుడు కావడం, టీఆర్‌ఎస్ జెండా పట్టుకొని ఊరి వీధుల్లో ఊరేగే సన్నివేశాలు నాటి ఉద్యమం రోజులను స్ఫురణకు తెస్తాయి. కేశవ చంద్ర రమావత్ తన చిన్నతనంలో నాటి ఉద్యమ నాయకుడు కేసీఆర్ మీద అభిమానం పెంచుకునే సన్నివేశాలను తీర్చిదిద్దిన విధానం బాగుంది. అందుకోసం కేసీఆర్ పాల్గొన్న బహిరంగ సభను కూడా ఉపయోగించుకోవడం విశేషం.
తెలంగాణ రాష్ట్రం సిద్ధించడం, కేశవ చంద్ర రమావత్ కూడా పెద్దవాడు కావడం, స్వరాష్ట్రంలో ఊరి స్థితిగతులు మారడం…ఈ పరివర్తనను కూడా దర్శకుడు కన్విన్సింగ్‌గా తెరపై తీసుకు వచ్చారు. రింగ్‌రోడ్డు వల్ల ఊరి మొత్తం ఖాళీ చేయాల్సిన పరిస్థితులు రావడంతో అందరిలో ఆందోళన మొదలవుతుంది. అదే సమయంలో మరదలు మంజుతో పెళ్లికి నిరాకరిస్తాడు కేశవ చంద్ర. అక్కడి నుంచి కథ పూర్తిగా ఎమోషనల్ టర్న్ తీసుకుంటుంది. కూతురితో పెళ్లికి నిరాకరించి తన కుటుంబం పరువును బజారుకీడ్చాడని భీమ్లానాయక్ (మైమ్ మధు) కేశవ చంద్ర ఇంటి వద్ద ఘర్షణకు దిగడం, ఈ నేపథ్యంలో వచ్చే సన్నివేశాలు ఉద్వేగాలను పతాక స్థాయికి తీసుకెళ్తాయి. ఈ సంఘర్షణ నడుమ ఎలాగైనా సరే కేసీఆర్‌ను ఒప్పించి తన పెళ్లికి తీసుకొస్తాననే ప్రతిజ్ఞతో కేశవ చంద్ర హైదరాబాద్‌కు బయలుదేరే ఘట్టంతో ప్రథమార్థాన్ని ఆసక్తికరంగా ముగించారు.
ఇక సెకండాఫ్ మొత్తం హైదరాబాద్‌లో కేశవ చంద్ర ఎదుర్కొన్న కష్టాలు, కేసీఆర్‌ను కలుసుకునే ప్రయత్నంలో ఎదురైన అవరోధాలతో ఎమోషనల్‌గా సాగింది. అణువణువునా కేసీఆర్‌పై విధేయత, అభిమానం మూర్త్తీభవించిన కేశవ చంద్ర రమావత్ ఎవరైనా కేసీఆర్ గురించి తప్పుగా మాట్లాడితే అస్సలు సహించడు. హైదరాబాద్‌లోని అందమైన పార్క్‌లో ఓ వ్యక్తి ఉమ్మివేయడంతో అలా ఎందుకు చేశావని అతన్ని నిలదీస్తాడు కేశవ చంద్ర. ఈ క్రమంలో తెలంగాణ పదేళ్లలో సాధించిన ప్రగతి, అరవైఏండ్ల అవహేళనల నుంచి స్వాభిమానం వైపు సాగిన ప్రయాణాన్ని, వివిధ రంగాల్లో సాధించిన పురోగతిని వివరిస్తూ కేశవచంద్ర చెప్పే సంభాషణలు థియేటర్లో చప్పట్లు కొట్టిస్తాయి. ‘ఒకప్పుడు చరిత్ర మరచిన తెలంగాణ ఇప్పుడు చరిత్రనే మార్చింది..’ అనే డైలాగ్ హైలైట్‌గా నిలిచింది. ‘ఊరిని వదిలి పెట్టే మనుషులు ఉంటారు కానీ..మనుషులను వదిలిపెట్టే ఊరు ఉండదు’ అనే డైలాగ్ హార్ట్‌టచింగ్‌గా అనిపించింది.
ఓ సాధారణ లంబాడి యువకుడు తన ఊరి మీద, కేసీఆర్ మీద గుండెలనిండా అభిమానాన్ని పెంచుకొని నగరానికి వచ్చిన వైనం, తన కలను సాకారం చేసుకున్న తీరును దర్శకుడు చక్కటి భావోద్వేగాలతో ఆవిష్కరించారు. ైక్లెమాక్స్ సన్నివేశాలను ఎవరూ ఊహించని విధంగా ఇంట్రెస్టింగ్‌గా డిజైన్ చేశారు. నాటి ఉద్యమ రోజులను మొదలుకొని, పదేళ్ల ప్రగతి ప్రస్థానాన్ని ఈ సినిమా కథ ద్వారా చెప్పిన విధానం ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటుంది.
నటీనటుల పర్‌ఫార్మెన్స్, సాంకేతిక నిపుణుల పనితీరు
జబర్దస్త్ ద్వారా ఇప్పటికే ప్రేక్షకాభిమానాన్ని సొంతం చేసుకున్న రాకింగ్ రాకేష్ ఈ సినిమా ద్వారా నటుడిగా మరో మెట్టెక్కాడని చెప్పొచ్చు. కేసీఆర్ అభిమానిగా అద్భుతమైన పర్‌ఫార్మెన్స్‌తో ఆకట్టుకున్నాడు. స్వతహాగా కేసీఆర్‌పై ఉన్న అభిమానం అతని నటనలో కూడా సహజసిద్ధంగా ప్రతిఫలించింది. ఇక కేశవ చంద్ర తండ్రిగా లోహిత్, కథానాయిక తండ్రి భీమ్లానాయక్ పాత్రలో మైమ్ మధు తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. ఎమోషనల్ సన్నివేశాల్లో మైమ్ మధు నటన గుర్తుండిపోతుంది. తాగుబోతు రమేష్, జోర్దార్ సుజాత జోడీ కొద్దిసేపే కనిపించినా..వారిద్దరి ఎపిసోడ్ నవ్వుల్ని పంచింది. తనికెళ్ల భరణి, ధనరాజ్‌తో పాటు ఇతర పాత్రధారులు తమ పరిధుల మేరకు న్యాయం చేశారు.
తక్కువ బడ్జెట్ అయినా సాంకేతికంగా చక్కటి ప్రమాణాలతో సినిమాను తెరకెక్కించారు. ఎక్కడా ల్యాగ్ లేకుండా కథను ఆద్యంతం ఆసక్తికరంగా నడిపించడంలో దర్శకుడు గరుడవేగ అంజి సఫలీకృతుడయ్యారు. ఈ చిత్రానికి ఆయనే అందించిన సినిమాటోగ్రఫీ మరో ఆకర్షణగా నిలిచింది. చరణ్ అర్జున్ కంపోజ్ చేసిన పాటలన్నీ బాగున్నాయి. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సన్నివేశాల్లోని ఫీల్‌ను ఎలివేట్ చేసింది. ఓ సాధారణ యువకుడి లక్ష్యాన్ని, కేసీఆర్ అభిమానిగా ఆయన సాగించిన ప్రయాణాన్ని స్ఫూర్తివంతంగా ఆవిష్కరించిన ఈ సినిమా కేసీఆర్ అభిమానులను, తెలంగాణ ప్రేమికులను తప్పకుండా ఆకట్టుకుంటుంది.
రేటింగ్: 3.5/5