ఏపీలో రేషన్ కార్డు లేని వారికి గుడ్ న్యూస్ – ఈ తేదీల్లో అప్లై చేసుకోవచ్చు, పూర్తి వివరాలివే!

www.mannamweb.com


ఏపీలో రేషన్ కార్డులు (Ration Cards) లేని వారికి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. కొత్త రేషన్ కార్డులు జారీ చేసేందుకు సిద్ధమైంది.

డిసెంబర్ 2 నుంచి 28 వరకూ రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు స్వీకరించనుంది. అర్హులైన వారికి రేషన్ కార్డులు అందించనున్నారు. రాష్ట్రంలో ఇప్పటికే 3.30 లక్షల దరఖాస్తులు పెండింగ్లో ఉండగా.. కొత్త రేషన్ కార్డుల కోసం 30,611 దరఖాస్తులు, కార్డుల స్ప్లిట్ కోసం 46,918 అప్లికేషన్స్, కుటుంబ సభ్యుల యాడింగ్ కోసం 2,13,007 దరఖాస్తులు, తొలగింపు కోసం 36,588, చిరునామా మార్పు కోసం 8,263, సరెండర్ కోసం 685 దరఖాస్తులు ప్రభుత్వం వద్ద పెండింగ్లో ఉన్నాయి.

అయితే, ప్రస్తుతం ఉన్న రేషన్ కార్డుల స్థానంలో కొత్త రేషన్ కార్డులను తెచ్చేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ మేరకు కొత్త డిజైన్లను ఎంపిక చేసే కసరత్తు చేస్తోంది. ఇది పూర్తయ్యాకే కార్డులను ముద్రించి పంపిణీ చేస్తారు. ప్రస్తుతం కార్డులో జగన్, వైఎస్ బొమ్మలతో సహా ఆకుపచ్చ, నీలం, తెలుపు రంగులతో రేషన్ కార్డులున్నాయి. ఈ బొమ్మలు తొలగించడం సహా రంగులు కూడా మార్చి కొత్త డిజైన్లతో రేషన్ కార్డులు తీసుకురానున్నారు. రాష్ట్రంలో అనర్హుల కార్డులను తొలగించి.. అర్హులందరికీ రేషన్ కార్డులు మంజూరు చేయాలనే లక్ష్యంతోనే ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగానే గ్రామ సభలు ఏర్పాటు చేసి చర్యలు చేపడుతోంది.

1.60 లక్షల మందికి కొత్త రేషన్ కార్డులు

పౌర సరఫరాల శాఖ లెక్కల ప్రకారం.. రాష్ట్రంలో 17,941 అంత్యోదయ అన్న యోజన కార్డుదారులు, మరో 1,36,420 పీహెచ్హెచ్ కార్డుదారులు గత 6 నెలలుగా రేషన్ తీసుకోవడం లేదు. ఈ కార్డులు తొలగిస్తే రూ.90 కోట్ల వరకూ ఆదా అవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. దాదాపు 1.60 లక్షల మందికి కొత్త రేషన్ కార్డులు జారీ చేసే వెసులుబాటు ఉంటుందని పేర్కొంటున్నారు. ఇప్పటికే 1.48 కోట్ల తెల్ల రేషన్ కార్డులుండగా.. వీటిలో 90 లక్షల కార్డులు జాతీయ ఆహార భద్రత చట్టం కింద కేంద్ర ప్రభుత్వం జారీ చేసింది. ఈ కార్డులకు మాత్రమే కేంద్ర ప్రభుత్వం ఉచితంగా బియ్యం, తక్కువ ధరకు కందిపప్పు, పంచదార, ఇతర సరుకులు అందిస్తోంది. కాగా, అన్నీ రేషన్ కార్డుదారులను జాతీయ ఆహార భద్రతా చట్టం కిందకు తీసుకు రావాలని రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటి నుంచో కేంద్రాన్ని కోరుతోంది.

5.8 కోట్ల నకిలీ రేషన్ కార్డుల ఏరివేత

మరోవైపు, ఇటీవలే కేంద్ర ప్రభుత్వం 5.8 కోట్ల నకిలీ రేషన్ కార్డులను తొలగించింది. డిజిటలైజేషన్తో ప్రజా పంపిణీ వ్యవస్థలో భారీ స్థాయిలో మార్పులు వచ్చాయని.. తద్వారా ఆహార భద్రతలో ప్రపంచానికే బెంచ్ మార్క్ నెలకొల్పినట్లయిందని కేంద్రం వెల్లడించింది. దేశంలో మొత్తంగా 80.6 కోట్ల మంది లబ్ధిదారులు ప్రయోజనం పొందుతుండగా.. ఆధార్ ధ్రువీకరణ, ఈకేవైసీ వెరిఫికేషన్ ద్వారా నకిలీ కార్డులను ఏరివేసినట్లు తెలిపింది. కేంద్ర ఆహార మంత్రిత్వ శాఖ లెక్కల ప్రకారం.. ఇప్పటివరకూ 20.4 కోట్ల రేషన్ కార్డుల డిజిటలీకరణ పూర్తైంది. దేశవ్యాప్తంగా 5.33 లక్షల చౌకధరల దుకాణాలకు ఈపోస్ పరికరాలు అందుబాటులో ఉన్నాయి. వీటి సాయంతో 99.8 శాతం కార్డులను ఆధార్తో అనుసంధానం చేయగా.. 98.7 శాతం లబ్ధిదారుల ధ్రువీకరణ పూర్తైంది. అటు, ఈ కేవైసీ ప్రక్రియతో ఇప్పటివరకూ 64 శాతం లబ్ధిదారుల వెరిఫికేషన్ పూర్తైంది.