చాలా మంది తమ తమ ఇండ్లలో రకరకాల మొక్కలను పెంచుతుంటారు. వాటిల్లో నిమ్మ మొక్కలు కూడా ఒకటి. నిమ్మ మొక్కలను అంటు కట్టి పెంచితే అవి పెద్దగా పెరగాల్సిన పనిలేదు.
చిన్నగా ఉండగానే గుత్తులుగా కాయలను కాస్తాయి. నిమ్మకాయలను చాలా మంది ఇంట్లో కుండీల్లో లేదా పెరట్లో పెంచుతుంటారు. వాటిని తరచూ అనేక అవసరాలకు ఉపయోగిస్తుంటారు. అయితే కొన్ని సార్లు పలు కారణాల వల్ల నిమ్మ చెట్లు ఎండిపోతుంటాయి. లేదా నిమ్మచెట్లు కాయలను కాయవు. ఇందుకు అనేక కారణాలు ఉన్నప్పటికీ పలు రకాల చర్యలను తీసుకోవడం వల్ల నిమ్మ చెట్లు ఎక్కువగా కాయలు కాసేలా చేయవచ్చు.
ఈ పోషకాలు అవసరం..
మనం ఇంట్లో లేదా పెరట్లో పెంచే ఏ చెట్టుకు లేదా మొక్కకు అయినా సరే సరైన పోషణ అవసరం. అప్పుడే అవి ఏపుగా పెరుగుతాయి. ఇక నిమ్మ చెట్టును సరిగ్గా సంరక్షిస్తే పుష్కలంగా కాయలు కాసేలా చేయవచ్చు. చెట్లకు అనేక రకాల పోషకాలు అవసరం అవుతాయి. వాటిల్లో పొటాషియం, నైట్రోజన్, ఫాస్ఫరస్ తదితరాలు ముఖ్యమైనవి. అయితే నిమ్మచెట్లకు కూడా ఇలాంటి పోషకాలే అవసరం అవుతాయి. నిమ్మచెట్టును పెంచేందుకు సరైన సూర్యకాంతి కావాలి. ఇంట్లో పెంచితే సూర్య కాంతి పడే చోట కుండీలను ఉంచాలి. అప్పుడే నిమ్మ చెట్టు సరిగ్గా పెరుగుతుంది. కాయలను కాస్తుంది. సూర్యకాంతి లేని చోట, చీకటిగా ఉన్న చోట్ల ఈ చెట్లను పెంచకూడదు. నిమ్మచెట్లను సూర్యకాంతిలో పెంచడం వల్ల కాయలు గుత్తులుగా వస్తాయి. అదే నీడలో పెంచితే కాయలు తక్కువగా వస్తాయి. లేదా కొన్ని సార్లు చెట్లు కాయలను ఇవ్వకపోవచ్చు.
బోరాన్ లోపం ఉంటే..?
ఇక నిమ్మకాయలకు పువ్వులు వస్తున్నప్పుడు సరైన నీరు, పోషకాలు అందేలా చూడాలి. దీంతో పూత రాలిపోకుండా ఉంటుంది. కాయలు ఎక్కువగా కాస్తాయి. పువ్వులు వస్తున్న సమయంలో సరిగ్గా నీరు లేకపోయినా, పోషకాలు అందకపోయినా పూత రాలుతుంది. కాబట్టి ఈ జాగ్రత్తను తప్పనిసరిగా తీసుకోవాలి. అలాగే నిమ్మ చెట్లకు బోరాన్ పొడిని వేయడం వల్ల బోరాన్ లోపం రాకుండా చూసుకోవచ్చు. నిమ్మచెట్లు ఏపుగా పెరిగినప్పటికీ కాయలు కాయకపోతే అప్పుడు బోరాన్ లోపంగా భావించాలి. బోరాన్ మనకు ఆన్‌లైన్‌లో లేదా బయట కిరాణా షాపుల్లోనూ లభిస్తుంది. దీన్ని తెచ్చి ప్యాకెట్లలో పెట్టి మట్టిలో ఉంచాలి. దీంతో నిమ్మ చెట్లకు బోరాన్ లభిస్తుంది. కాయలు చక్కగా వస్తాయి.
నిమ్మ చెట్లను పెంచే కుండీలు మరీ చిన్నగా ఉండకుండా చూసుకోవాలి. కాస్త పెద్దగానే కుండీలను పెట్టాలి. అలాగే 3 రోజులకు ఒకసారి పలుచని మజ్జిగను కాస్త పోస్తుండాలి. దీంతోపాటు బయట మార్కెట్‌లో లభించే సేంద్రీయ ఎరువులను వేస్తుండాలి. ఇలా కొన్ని చిట్కాలను పాటించడం వల్ల నిమ్మ చెట్లకు కాయలు చక్కగా వస్తాయి.