ఏపీ విద్యుత్తు శాఖలో ఉద్యోగాలకు దరఖాస్తులు ఆహ్వానం.. ఎలాంటి రాత పరీక్ష లేదు

www.mannamweb.com


ఆంధ్రప్రదేశ్‌లో విద్యుత్‌ శాఖలో పలు ఉద్యోగాల భర్తీకి ఏపీ ట్రాన్స్‌కో ప్రకటన జారీ చేసింది. ఈ మేరకు విజయవాడలోని ట్రాన్స్‌మిషన్ కార్పొరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ లిమిటెడ్‌ ఉద్యోగ నోటిఫికేషన్‌ ఇచ్చింది.

ఈ నోటిఫికేషన్‌ కింద కాంట్రాక్ట్ ప్రాతిపదికన ట్రాన్‌కో, ఏపీపీసీసీలో కార్పొరేట్ లాయర్ పోస్టులను భర్తీ చేయనుంది. ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆఫ్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఆఫ్‌లైన్‌ దరఖాస్తులకు డిసెంబర్‌ 10, 2024వ తేదీని చివరి తేదీగా నిర్ణయించింది. ఈ ప్రకటన కింద మొత్తం 5 కార్పొరేట్ లాయర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. వీటిల్లో ట్రాన్‌కో పోస్టులు ఒకటి, ఏపీపీసీసీలో కార్పొరేట్ లాయర్ పోస్టులు నాలుగు ఉన్నాయి.

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు మూడేళ్ల ఎల్‌ఎల్‌బీ లేదా ఎల్‌ఎల్‌ఎం లేదా ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ లా కోర్సులో ఉత్తీర్ణత పొంది ఉండాలి. అలాగే బార్‌ కౌన్సిల్‌లో నాలుగేళ్ల ఉద్యోగానుభవం ఉండాలి. ఎలాంటి వయోపరిమితి లేదు. ఏడాది కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఈ ఉద్యోగాలు భర్తీ చేస్తారు. ఎంపికైన వారికి ప్రొఫెషనల్ ఫీజు కింద నెలకు రూ.1,20,000 వరకు చెల్లిస్తారు. ఆసక్తి కలిగిన వారు ఆఫ్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి. ప్రకటన ఇచ్చిన తేదీ నుంచి 21 రోజులలోపు దరఖాస్తులను ఈ కింది అడ్రస్‌కు పంపించాలి. నోటిఫికేషన్ నవంబర్‌ 19, 2024వ తేదీన జారీ చేశారు. ఎలాంటి రాత పరీక్ష ఉండదు. విద్యార్హతలు, ఉద్యోగానుభవం, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. పూర్తి వివరాలు అధికారిక నోటిఫికేషన్‌లో చెక్‌ చేసుకోవచ్చు.

అడ్రస్:

The Chairman and Managing Director,
APTRANSCO, Vidyut Soudha,
Gunadala, Vijayawada -520004.

(చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్, ఏపీ ట్రాన్స్‌కో, విద్యుత్ సౌధ, గుణదల, విజయవాడ-520004)