ఏపీలో ఈ 18 రోడ్లపై కొత్తగా టోల్ ట్యాక్స్-నేషనల్ హైవేల తరహాలో.

www.mannamweb.com


ఏపీలో రహదారుల దుస్థితి దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన నేపథ్యంలో వాటి రూపురేఖల్ని పూర్తి స్దాయిలో మార్చేసేందుకు చంద్రబాబు ప్రభుత్వం సిద్దమవుతోంది.

ఇందుకోసం మాస్టర్ ప్లాన్ సిద్దం చేసింది. దీని ప్రకారం ప్రస్తుతం ఉన్న జాతీయ రహదారుల తరహాలోనే రాష్ట్ర రహదారుల్ని కూడా దశల వారీగా పీపీపీ విధానంలో అభివృద్ది చేసి వాటిపై టోల్ గేట్లు పెట్టేందుకు సిద్దమవుతోంది. దీనిపై ఇప్పుడు రాష్ట్రంలో చర్చ జరుగుతోంది. ఇలా తొలి దశలో 18, రెండో దశలో 68 రోడ్లూ అభివృద్ధి చేసి టోల్ వసూలు చేస్తారు.

ఏపీలో వందల సంఖ్యలో రాష్ట్ర రహదారులు ఉన్నాయి. వాటి పరిస్ధితి గత ఐదేళ్లలో దారుణంగా మారిపోయింది. వీటిపై వెళ్లాలంటే వాహనాలతో పాటు సాధారణ ప్రజలు కూడా గగ్గోలు పెడుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతానికి వాటిపై గుంతల్ని పూడ్చే కార్యక్రమం చేస్తున్న ప్రభుత్వం త్వరలో వీటిని జాతీయ రహదారుల తరహాలోనే ప్రైవేట్ సంస్థలకు అప్పగించి వాటిని అభివృద్ధి చేయడంతో పాటు టోల్ ట్యాక్స్ కూడా వసూలు చేయాలని భావిస్తోంది. తొలి దశలో ఇలా 18 రోడ్లను అభివృద్ధి చేస్తారు.

తొలి దశలో ప్రభుత్వం పీపీపీ విధానంలో అభివృద్ధి చేసే 18 రోడ్లలో చిలకపాలెం-రామభద్రపురం-రాయగడ మధ్య (130 కి.మీ), విజయనగరం-పాలకొండ మధ్య 72.55 కిలోమీటర్లు, కళింగపట్నం-శ్రీకాకుళం-పార్వతీపురం మధ్య 113.40 కిలోమీటర్లు, భీమునిపట్నం-నర్సీపట్నం మధ్య 78.10 కిలోమీటర్లు, కాకినాడ-జొన్నాడ మధ్య 48.84 కిలోమీటర్లు, కాకినాడ-రాజమండ్రి కెనాల్ మధ్య 65.20 కిలోమీటర్లు, ఏలూరు-మేడిశెట్టివారి పాలెం మధ్య 70.93 కిలోమీటర్ల మేర అభివృద్ధి చేస్తారు.

అలాగే నరసాపురం-అశ్వారావుపేట మధ్య 100 కిలోమీటర్లు, ఏలూరు-జంగారెడ్డి గూడెం మధ్య 51.73 కిలోమీటర్లు, గుంటూరు-పర్చూరు మధ్య 41.44 కిలోమీటర్లు, గుంటూరు-బాపట్ల మధ్య 51.24 కిలోమీటర్లు, మంగళగిరి-తెనాలి-నారాకోడూరు మధ్య 40 కిలోమీటర్లు, బేస్తవారిపేట-ఒంగోలు మధ్య 113.25 కిలోమీటర్లు, రాజంపేట-గూడూరు మధ్య 95 కిలోమీటర్లు, ప్యాపిలి-బనగానపల్లి మధ్య 54.44 కిలోమీటర్లు, దామాజీ పల్లి-నాయినపల్లి క్రాస్-తాడిపత్రి మధ్య 99 కిలోమీటర్లు, జమ్మలమడుగు-కొలిమిగుండ్ల మధ్య 43 కిలోమీటర్లు, సోమందేపల్లి-హిందూపురం-తూముకుంట మధ్య 35.53 కిలోమీటర్లు కూడా ఉన్నాయి. రెండో విడతలో మరో 68 రోడ్లు ఉన్నాయి.