ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సూపర్ సిక్స్ పథకాలను విడతల వారీగా అమలుకు వీలుగా నిర్ణయాలు తీసుకుంటోంది. కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీ మేరకు అధికారంలోకి వచ్చిన తరువాత పెన్షన్ రూ 4 వేలకు పెంచుతూ నిర్ణయించింది.
ప్రతీ నెలా ఒకటో తేదీనే ఇంటి వద్దకు వెళ్లి పెన్షన్ పంపిణీ చేస్తోంది. కొత్త పెన్షన్లకు దరఖాస్తుల విషయంలోనూ తాజా స్పష్టత ఇచ్చింది. ఇక, డిసెంబర్ 1న పంపిణీ చేయాల్సిన పెన్షన్ల అంశం పైన ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ప్రభుత్వ యంత్రాంగానికి ఆదేశాలు ఇచ్చింది.
ప్రభుత్వ తాజా నిర్ణయం
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత అన్ని కేటగిరీల పెన్షన్ ను పెంచి అమలు చేస్తోంది. ప్రతీ నెలా ఒకటో తేదీన సీఎం చంద్రబాబు సహా, మంత్రులు..ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల్లో పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. వైసీపీ హయాంలో వాలంటీర్లు ప్రతీ నెలా ఒకటో తేదీన లబ్ది దారుల ఇంటికి వెళ్లి పెన్షన్లు పంపిణీ చేసే వారు. ఇప్పుడు కూటమి పాలన లో వాలంటీర్లను పక్కన పెట్టారు. వార్డు, గ్రామ సచివాలయాల సిబ్బందితోనే లబ్దిదారుల ఇళ్లకు పెన్షన్లు పంపిణీ చేస్తున్నారు.
30వ తేదనే పెన్షన్లు
రాష్ట్ర వ్యాప్తంగా ఒకటో తేదీన పెన్షన్ల పంపిణీ అంశాన్ని ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా భావిస్తోంది. పంపిణీ విధానాన్ని రియల్ టైం లో పరిశీలిస్తోంది. ఒకటో తేదీనే దాదాపుగా పంపిణీ పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్దేశించింది. అయితే, డిసెంబర్ 1వ తేదీన అందించాల్సిన పెన్షన్ల విషయంలో ప్రభుత్వం తాజాగా అధికార యంత్రాంగానికి కీలక సూచన చేసింది. డిసెంబర్ 1వ తేదీ ఆదివారం కావటంతో.. ఒక రోజు ముందుగానే ఈ నెల 30వ తేదీన పెన్షన్లను పంపిణీ చేయాలని ప్రభుత్వ నిర్దేశించింది.
మార్గదర్శకాలు
ఈ మేరకు సచివాలయాల సిబ్బంది .. నగదు పంపిణీ సిద్దం చేయాలని స్పష్టం చేసింది. దీంతో, రాష్ట్ర వ్యాప్తంగా 64 లక్షల కు పైగా ఉన్న పెన్షన్ లబ్ది దారులకు నవంబరు 30న శనివారం రోజున పెన్షన్లు అందనున్నాయి. వరుసగా రెండు నెలలు పెన్షన్లు తీసుకోని వారు సైతం ..మూడో నెల ఒకేసారి పెన్షన్లు తీసుకునే విధంగా ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది. దీంతో, ఈ నవంబర్ నెల తొలి రోజున..చివరి రోజున ఒకే నెల రెండు సార్లు లబ్దిదారులను పెన్షన్ అందినట్లు అవుతుందని అధికారులు చెబుతున్నారు.