వాలంటీర్లకు ఇక నో ఛాన్స్ – ప్రభుత్వ తాజా నిర్ణయంతో

www.mannamweb.com


వాలంటీర్ల అంశం పై ప్రభుత్వం క్రమేణా స్పష్టత ఇస్తోంది. వాలంటీర్ల వ్యవస్థ అసలు మనుగడలో లేదని ప్రభుత్వం తేల్చి చెప్పింది. ఎన్నికల వాలంటీర్లను కొనసాగిస్తామని..

వేతనం రూ 10 వేలు ఇస్తామని కూటమి నేతలు హామీ ఇచ్చారు. అయితే, ఇప్పుడు వాలంటీర్లను కొనసాగించే అంశం లో రోజు రోజుకీ సందేహాలు పెరిగిపోతున్నాయి. సచివాలయాల శాఖ తాజా నిర్ణయంతో వాలంటీర్లను కొనసాగించే ఉద్దేశంతో ప్రభుత్వం ఉందా లేదా అనే చర్చ మొదలైంది.

యాప్ లో తొలిగింపు

ఏపీ ప్రభుత్వం వాలంటీర్ల విషయంలో ఇస్తున్న సంకేతాలు వారికి ప్రతికూలంగా ఉన్నాయి. అదే సమయంలో ఇక వాలంటీర్ల వ్యవస్థ ఉండదనే విషయాన్ని తేల్చి చెప్పటం లేదు. కానీ, ఇప్పట్లో వారికి అవకాశం ఇచ్చే అవకాశాలు మాత్రం కనిపించటం లేదు. తాజాగా సచివాలయాల శాఖ కు సంబంధించిన యాప్ నుంచి వాలంటీర్ల హాజరు ఆప్షన్ ను తెలిగించారు. ఇప్పటి వరకు గ్రామ, వార్డు సచివాలయాల యాప్ లో వాలంటీర్ల హాజరు ఆప్షన్ కొనసాగింది. ఇప్పుడు తాజాగా యాప్ లో ఈ ఆప్షన్ తెలిగించినట్లు వాలంటీర్ల సంఘాల నేతలు వెల్లడించారు. దీంతో, ప్రభుత్వం ఇక వాలంటీర్ వ్యవస్థ కొనసాగించే ఆలోచనలో లేదనే సందేహాలు పెరుగుతున్నాయి.

ప్రభుత్వం డిసైడ్ అయిందా

తాజాగా జరిగిన అసెంబ్లీ సమావేశాల వేళ ఏపీ శాసనమండలిలో వాలంటీర్ల వేతనాల అంశం పైన చర్చకు వచ్చింది. స్పందించిన మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి అసలు ప్రస్తుతం వాలంటీర్ వ్యవస్థ అమల్లో లేదన్నారు. వైసీపీ అధికారంలో ఉన్న సమయంలోనే 2023 ఆగస్టు తరువాత వాలంటీర్లు రెన్యువల్ కాలేదని.. ఈ మేరకు ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వలేదని మంత్రి స్పష్టం చేసారు. అసలు అమల్లోనే లేని వాలంటీర్ల వ్యవస్థకు జీతాలు ఎలా చెల్లిస్తామని ప్రశ్నించారు. అమల్లోనే లేని వాలంటీర్లు ఎలా రాజీనామాలు చేస్తారని మంత్రి వ్యాఖ్యానించారు. వాలంటీర్ల రెన్యువల్ పైన నిర్ణయం తీసుకోని వైసీపీ ప్రభుత్వం నాడు వాలంటీర్లను.. ప్రజలను మోసం చేసిందని మంత్రి ఆరోపించారు.

తాజా నిర్ణయంతో

ప్రభుత్వం వాలంటీర్లను కొనసాగించాలంటే ఈ మేరకే రెన్యువల్ జీవో ఇవ్వవచ్చని వైసీపీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. అదే విధంగా అంతకు ముందు డిప్యూటీ సీఎం పవన్ సైతం వాలంటీర్ల పైన కీలక వ్యాఖ్యలు చేసారు. వాలంటీర్లను రద్దు చేయాలని పంచాయితీ ఛాంబర్ నేతలు పవన్ ను కోరగా.. వాలంటీర్లు ఉద్యోగంలో ఉంటే రద్దు చేయొచ్చు.. కానీ వాళ్లు అసలు వ్యవస్థలోనే లేరు.. ఇదో సాంకేతిక సమస్య అంటూ తేల్చి చెప్పారు. వాలంటీర్లకు మేలు చేయాలనే ఆలోచలతోనే కూటమి ప్రభుత్వం ఉందని చెప్పారు. దీంతో, ప్రభుత్వం కొత్తగా వాలంటీర్ల వ్యవస్థ పైన కొత్తగా నిర్ణయం తీసుకోవాల్సి ఉందనే అంశం స్పష్టం అవుతోంది. కానీ, సంకేతాలు భిన్నంగా ఉన్నాయి. దీంతో, ప్రభుత్వం వైపు వాలంటీర్లు ఆశగా ఎదురు చూస్తున్నారు.