ఆస్తమాకు కొత్త చికిత్స విధానాన్ని కనుగొన్నట్లు పరిశోధకులు తెలిపారు.
గత 50 ఏళ్లలో ఇలా కొత్త చికిత్స కనుగొనడం ఆస్తమా విషయంలో ఇదే తొలిసారి.
క్రానిక్ అబ్‌స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్ (సీవోపీడీ) పరిస్థితి తలెత్తినపుడు రోగనిరోధక వ్యవస్థలో కొంత భాగంపై ఈ ఇంజెక్షన్ పనిచేస్తుంది.
బెన్‌రాలిజుమాబ్‌గా పిలిచే ఈ ఔషధాన్ని ఇప్పటికే అత్యంత తీవ్రమైన ఆస్తమా కేసుల్లో వాడుతున్నారు.
ఈ విధానంతో ఏటా యూకేలో 20 లక్షల మంది ఆస్తమా బాధితులకు చికిత్స చేయవచ్చని కొత్త పరిశోధన చెబుతోంది.
ఈ ఔషధం ‘గేమ్-చేంజర్’ అని బ్రిటన్‌లోని కింగ్స్ కాలేజ్ లండన్‌కు చెందిన పరిశోధకులు చెప్పారు.
ఇది ఉబ్బసానికి ఇంతవరకు అందిస్తున్న చికిత్స పద్ధతులను ఇది మార్చగలదని ఆశాభావం వ్యక్తం చేశారు.
అన్ని ఆస్తమా లేదా సీవోపీడీ అటాక్స్ ఒకేలా ఉండవని ఈ పరిశోధనలో తేలింది.
కొందరు రోగులలో రోగనిరోధక వ్యవస్థకు సంబంధించిన వివిధ భాగాలు అతిగా ప్రతిస్పందిస్తాయి.
‘ఇన్‌ప్లమేటరీ ప్యాటర్న్స్ అన్నీ ఒకేలా ఉండవు. అందుకు తగ్గట్లుగా సరైన చికిత్స అందాలి’ అని కింగ్స్ కాలేజ్ లండన్‌కు చెందిన ప్రొఫెసర్ మోనా బఫాడెల్ పేర్కొన్నారు.
బెన్‌రాలిజుమాబ్ ఔషధం ఇసినోఫిల్ అనే ఒక రకమైన తెల్ల రక్త కణాన్ని లక్ష్యంగా చేసుకుని పనిచేస్తుంది. ఈ కణాలు ఊపిరితిత్తులలో ఇన్‌ఫ్లమేషన్‌కు కారణమవుతాయి.
ఇసినోఫిల్స్ ప్రభావం ఆస్తమా అటాక్స్‌లో సగం, సీవోపీడీలలో మూడింట ఒక వంతుగా ఉంటుంది.
ప్రస్తుతం ఒక వ్యక్తికి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలిగినా శ్వాసలో గురక, దగ్గు, ఛాతీ పట్టేయడం వంటి లక్షణాలతో బాధపడుతుంటే.. అలాంటి సమయంలో సాధారణ ఇన్‌హేలర్‌లూ పరిస్థితిని నియంత్రించలేకపోతే వైద్యులు స్టెరాయిడ్‌ల కోర్సును సూచిస్తుంటారు.
ఎలా నిర్ధరించారు?
ఈ పరిశోధన కోసం జరిగిన ట్రయల్స్‌లో 158 మంది పాల్గొన్నారు. ఆస్తమా చికిత్స పొందిన తర్వాత మూడు నెలల పాటు వారి ఆరోగ్యాన్ని పరిశోధకులు ట్రాక్ చేశారు. దీనికి సంబంధించిన ఫలితాలు ‘ది లాన్సెట్ రెస్పిరేటరీ మెడిసిన్’లో ప్రచురితమయ్యాయి.
ఆ రిపోర్టు ప్రకారం.. ట్రయల్స్‌లో స్టెరాయిడ్స్ తీసుకున్న వారిలో 74 శాతం మంది రోగులకు చికిత్స విఫలమైంది. కొత్త ఔషధంతో 45 శాతం మంది రోగులకు చికిత్స విఫలమైంది.
అయితే, కొత్త విధానంలో చికిత్స పొందిన వ్యక్తులు ఆసుపత్రిలో చేరాల్సిన అవసరం తగ్గింది. మరణించే ప్రమాదమూ తగ్గింది.
ఈ చికిత్స పెద్ద సంఖ్యలో ప్రజలకు సహాయపడుతుందని ప్రొఫెసర్ బఫాదేల్ అభిప్రాయపడ్డారు.
‘గత 50 సంవత్సరాలలో ఆస్తమాకు ఇలాంటి కొత్త చికిత్స రాలేదు” అని బఫాదేల్ అన్నారు. కొత్త డ్రగ్ వాడిన వలంటీర్లకు తక్కువ లక్షణాలు ఉన్నాయని, వారు మెరుగైన జీవితం గడుపుతున్నారని ఆమె చెప్పారు.
ఆక్స్‌ఫర్డ్‌షైర్‌కు చెందిన 55 ఏళ్ల అలిసన్ స్పూనర్ ఈ ట్రయల్స్‌లో పాల్గొన్నారు. ఆమెకు చిన్నప్పటి నుంచి ఉబ్బసం ఉంది. గత ఐదేళ్లలో ఇది మరింత తీవ్రమైంది.
‘ఆస్తమా అటాక్స్ తీవ్రమయ్యాయి. శ్వాస తీసుకోవడం కష్టంగా ఉండేది’ అని ఆమె గుర్తుచేసుకున్నారు.
ఇంజెక్షన్ తీసుకున్న తర్వాత మార్పు కనిపించిందని అలిసన్ అన్నారు. కాకపోతే, వైద్యుల సూచనతో ఇన్‌హేలర్‌లను ఇంకా ఉపయోగిస్తున్నట్లు ఆమె చెప్పారు.
“దురదృష్టవశాత్తు ఏ మందు ఆస్తమాను పూర్తిగా నయం చేయదు. కానీ ఇదొక అద్భుతంలా అనిపిస్తుంది” అని అలిసన్ అన్నారు.
మెడిసిన్ సిద్ధంగా ఉందా?
విస్తృతంగా ఉపయోగించడానికి బెన్‌రాలిజుమాబ్ ఔషధాన్ని ఇంకా సిద్ధం చేయలేదు. దాని ప్రయోజనాలను నిర్ధరించాలంటే రెండేళ్ల పాటు పెద్ద ఎత్తున ట్రయల్ జరగాల్సి ఉంది.
ఎవరైనా ఇప్పటికే ఈ మందులను తీసుకుంటే వారు డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ప్రకారం కొనసాగించాలి.
ఈ అధ్యయన ఫలితాలు ఆశావహంగా ఉన్నాయని ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయానికి చెందిన డాక్టర్ సంజయ్ రామకృష్ణన్ అభిప్రాయపడ్డారు.
ప్రపంచవ్యాప్తంగా సంభవిస్తున్న మరణాలకు ప్రధాన కారణాలలో సీవోపీడీ ఒకటని.. అయితే, దీనికి సంబంధించిన చికిత్సలు ఎక్కువగా లేవని ఆయన అన్నారు.
స్టెరాయిడ్స్‌ను దీర్ఘకాలం ఉపయోగించడం వల్ల బరువు పెరగడం, మధుమేహం, ఎముకలు బలహీనపడటం వంటి దుష్ప్రభావాలు కలగొచ్చు.
“స్టెరాయిడ్ టాబ్లెట్లు వాడినపుడు నాకు కలిగిన దుష్ప్రభావాలు ఇప్పుడు లేవు” అని ఈ ట్రయల్స్‌లో పాల్గొన్న ఆక్స్‌ఫర్డ్‌షైర్‌కు చెందిన 77 ఏళ్ల జాఫ్రీ పాయింటింగ్ అన్నారు.
“నేను అప్పట్లో స్టెరాయిడ్స్ తీసుకున్నపుడు రాత్రి నిద్రపోవడానికి ఇబ్బంది పడ్డాను. కానీ ఈ ట్రయల్స్ మొదటి రోజు నేను బాగా నిద్రపోయాను. ఇబ్బందులు రాలేదు” అని అన్నారు.
ఇది చాలా గొప్ప వార్త అని ఆస్తమా, లంగ్ యూకే స్వచ్ఛంద సంస్థకు చెందిన డాక్టర్ సమంతా వాకర్ పేర్కొన్నారు.