చలికాలం వచ్చిందంటే రకరకాల సమస్యలు వెంటాడతాయి. వాటినుంచి తప్పించుకోవడం కష్టమవుతుంది. జలుబు, దగ్గు, గుండెలో నిమ్ము చేరడం, తలనొప్పి… ఇలా అనేకరకాల అనారోగ్య సమస్యలు వెంటాడతాయి.
వీటన్నింటికంటే ప్రధానంగా కాళ్లు పగులుతాయి. బాగా ఎక్కువగా పగుళ్లు ఉన్నప్పుడు నడవాలన్నా చాలా కష్టమవుతుంది. కొన్ని కొన్ని సందర్భాల్లో చాలా లోతుగా పగుళ్లు ఏర్పడతాయి. వాటిని తగ్గించాలంటే కొన్ని చిట్కాలు పాటించాలి. సహజసిద్ధమైన వాటి వివరాలను తెలుసుకుందాం.
మంచినీరు ఎక్కువగా తాగండి
శరీరానికి తగినంత నీరు అందేలా చూసుకోవడం చాలా ముఖ్యం. నీరు తాగడం వల్ల చర్మం తేమగా ఉంటుంది.
మాయిశ్చరైజర్‌ను రోజూ వాడండి
స్నానం చేసిన తర్వాత వెంటనే మాయిశ్చరైజర్‌ను కాళ్లకు అప్లై చేయండి. ముఖ్యంగా పగుళ్లు ఉన్న ప్రదేశాల దగ్గర బాగా రాయండి.
గోరువెచ్చని నీటిలో ఉప్పు వేసి నానబెట్టండి
ఒక బకెట్ గోరువెచ్చని నీటిలో ఒక చెంచా ఉప్పు కలిపి కాళ్లను 15-20 నిమిషాలు నానబెట్టండి. ఇది చనిపోయిన చర్మాన్ని తొలగించి, ఉన్న చర్మాన్ని మృదువుగా మారుస్తుంది.
కొబ్బరి నూనె మర్దన
రాత్రి పడుకునే ముందు కాళ్లకు కొబ్బరి నూనెతో మర్దన చేయండి. కొబ్బరి నూనెలో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఉండటం వల్ల పగుళ్లు మానిపోతాయి.
వేపాకులతో స్నానం
వేపాకులను నీటిలో మరిగించి ఆ నీటితో కాళ్లు కడిగితే పగుళ్లు తగ్గుతాయి
బియ్యం పిండితో స్క్రబ్ చేయడం
బియ్యం పిండిని నీటితో కలిపి పేస్ట్ చేసి కాళ్లకు స్క్రబ్ చేయండి. ఇది చనిపోయిన చర్మాన్ని తొలగించి, చర్మాన్ని మృదువుగా చేస్తుంది.
అలోవెరా జెల్: అలోవెరా జెల్‌ను కాళ్ల పగుళ్లపై రాయడం వల్ల చర్మం తేమగా ఉంటుంది.
నిమ్మరసం: నిమ్మరసంలో యాంటీసెప్టిక్ గుణాలు ఉండటం వల్ల పగుళ్లను మాన్పిస్తుంది. కానీ, నిమ్మరసాన్ని నేరుగా కాళ్లపై రాకుండా, కొద్దిగా నీరు కలిపి రాయాలి.
కొన్ని ప్రధానమైన విషయాలు
కాళ్లను ఎప్పుడూ పొడిగా ఉంచాలి. బిగుతుగా ఉండే చెప్పులు వేసుకోవద్దు. డయాబెటిస్, థైరాయిడ్ వంటి వ్యాధులు ఉన్నవారు వైద్యుల్ని సంప్రదించాలి. వైద్యుల్ని ఎప్పుడు సంప్రదించాలంటే కాలి పగుళ్లు బాగా లోతుగా ఉన్నప్పుడు, పగుళ్ల నుంచి రక్తం రావడంతోపాటు వాపు, నొప్పి, దురదలాంటివి ఉంటే వైద్యుల్ని సంప్రదించి తగు చర్యలు తీసుకోవాలి.