భారత్‌లో ఎలక్ట్రిక్ వెహికిల్స్ వినియోగం పెరుగుతోంది. అందుకు తగినట్లుగా ఛార్జింగ్ స్టేషన్లు, ఇతర ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ వేగంగా విస్తరిస్తోంది. దీంతో రానున్న రోజుల్లో మొత్తం ఇక ఎలక్ట్రిక్ వెహికిల్స్ హవా కొనసాగనుంది.
సాంప్రదాయ వెహికిల్స్ కోసం పెట్రోల్ స్టేషన్ల వలే ఎలక్ట్రిక్ ఛార్జింగ్ స్టేషన్లు కూడా అందుబాటులోకి రానున్నాయి. కావున మీరు కూడా హైవేలు, కీలక ప్రాంతాల్లో ఈవీ ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయడం ద్వారా ఆదాయం సంపాదించుకోవచ్చు. ఈ కథనంలో ఛార్జింగ్ స్టేషన్ల రకాలు, వాటి ఏర్పాటుకు అయ్యే ఖర్చు, ఇతర వివరాలపై ఓ లుక్కేయండి.
ఎలక్ట్రిక్ వెహికిల్స్ వినియోగం పెరుగుతున్న కొద్దీ ఛార్జింగ్ స్టేషన్ల అనివార్యం ఏర్పడుతుంది. అయితే ఛార్జింగ్ స్టేషన్లు పెట్రోల్ స్టేషన్ల వలె నిమిషాల్లో ఇంధనం నింపేలా కాకుండా ఎలక్ట్రిక్ వాహనాల బ్యాటరీ కెపాసిటి ఆధారంగా సమయం పడుతుంది. అంటే బ్యాటరీ కెపాసిటీ తక్కువ ఉంటే త్వరగా ఛార్జ్ అవుతుంది. ఈ సమయంలో డ్రైవర్లు లేదా ప్రయాణికుల కోసం వెయిటింగ్ హాల్ లేదా కేఫేటేరియా ఏర్పాటు చేయాల్సి ఉంటుంది.
ముందుగా మీరు ఛార్జింగ్ స్టేషన్ పెట్టాలంటే ఇది మనసులో పెట్టుకుని నిర్మాణం చేయాలి. ఇక ఛార్జింగ్ స్టేషనల్లో అనేక రకాల ఛార్జింగ్ ఆప్షన్స్ ఉంటాయి. ప్రతీ పాయింట్ కెపాసిటీ భిన్నంగా ఉంటుంది. దీనిని మనసులో పెట్టుకుని టూవీలర్, ఆటో, నాలుగు చక్రాల వాహనాలతో సహా అన్ని రకాల ఎలక్ట్రిక్ వాహనాలకు అనువైన లెవల్-1 (ఏసీ) ఛార్జర్లను ఏర్పాటు చేయాలి.
ఇందుకోసం ఒక్కో పాయింట్ ఏర్పాటుకి రూ. 15 వేల నుంచి రూ. 30,000 వరకు ఖర్చు అవుతుంది. ఈ ఛార్జర్స్ 240-వోల్ట్స్ పవర్‌తో పనిచేస్తాయి. ఇది ఛార్జింగ్ స్టేషన్ల ఏర్పాటులో అత్యంత కీలకం. ఇక లెవల్ -2 (ఏసీ) ఛార్జర్స్ 300 నుంచి 400 వోల్ట్ పవర్‌తో పనిచేస్తాయి. ఇది 22 కిలోవాట్ల వరకు శక్తి ఉన్న వాహనాలను సపోర్ట్ చేస్తాయి.
వీటి ఇన్‌స్టాలేషన్‌కి రూ. 50 వేల నుంచి రూ. 1,00,000 వరకు అవుతుంది. ఇక లెవల్ -3 (DC) ఛార్జింగ్ పాయింట్స్ ప్రత్యేకంగా ఫోర్ వీలర్స్ కోసం రూపొందించారు. వీటికోసం 200 నుంచి 1000 వోల్ట్స్ ఎలక్ట్రిసిటీ అవసరం పడుతుంది. వీటి నుంచి వచ్చే పవర్ 50 నుంచి 150 కిలోవాట్ల వరకు సరిపోతుంది. సాధారణంగా హైవేలపై ఈ ఛార్జర్లను ఏర్పాటు చేయాల్సి ఉంటుంది.
ఈ డీసీ ఛార్జింగ్ పాయింట్ కోసం రూ. 5 లక్షల నుంచి రూ. 50 లక్షల వరకు ఖర్చవుతుంది. ఛార్జింగ్ స్టేషన్ కెపాసిటీని ముందే నిర్ణయించుకుని ఏర్పాటు చేయడం లాభదాయకరంగా ఉంటుంది. బ్యాటరీ కిలోవాట్‌ని కెపాసిటీని బట్టి యూనిట్‌కి రూ. 10 నుంచి రూ. 20 వరకు ఛార్జ్ చేస్తారు. అంటే 30 కిలోవాట్ల బ్యాటరీ కెపాసిటీ కలిగిన వాహనాన్ని ఛార్జింగ్ చేయడానికి రూ. 300 అవుతుంది.
వీటితో పాటు ఛార్జింగ్ స్టేషన్ యజమానులు ప్రకకటనల ద్వారా, స్థలాన్ని కేఫేటేరియా కోసం లీజుకి ఇవ్వడం ద్వారా ఆదాయాన్ని పొందవచ్చు. మీకు ఒకవేళ ఆసక్తి ఉంటే ప్రభుత్వం దగ్గరుండి అనుమతులు అందిస్తుంది. మెట్రో సిటీల్లో వీటిని నెలకొల్పాలని భావిస్తే కేవలం 7 రోజుల్లోనే ఆన్ పేపర్ ప్రక్రియ పూర్తవుతుంది. పెట్రోల్ స్టేషన్లలోనూ వీటిని నెలకొల్పడం ద్వారా పర్సంటేజ్ ప్రకారం ఆదాయాన్ని పొందవచ్చు.
డ్రైవ్‌స్పార్క్ ఒపీనియన్: ఈవీ ఛార్జింగ్ స్టేషన్లు భవిష్యత్తులో అతి పెద్ద వ్యాపార అవకాశంగా మారనుంది. ఎందుకంటే మీ ప్రాంతంలో ఇప్పుడు చాలా మంది పెట్రోల్ పంప్స్ ఏర్పాటు చేయడం ద్వారా బాగా సంపాదిస్తున్నారు. అయితే ఇక్కడ పెట్రోల్ బంకుల కంటే ఛార్జింగ్ స్టేషన్‌లోనే ఎక్కువ సమయం గడపాల్సి వస్తోంది. లీజు ఇతర ప్రక్రియల ద్వారా నెలకు లక్షల రూపాయలు సంపాదించే అవకాశం ఉంటుంది.