ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్‌వో)లో మదుపు ఓ చక్కని అవకాశం. ఉద్యోగులకు మాత్రమే ఉండే సౌలభ్యం. అటు ఉద్యోగి నుంచి, ఇటు పనిచేసే సంస్థ నుంచి కూడా సమాన మొత్తాల్లో ఈపీఎఫ్‌లో జమవుతాయి.
పైగా ఇందులో మన నగదు నిల్వలకు అత్యధిక వడ్డీరేట్లు వర్తిస్తాయి. ప్రస్తుతం అది 8.25 శాతంగా ఉండటం గమనార్హం. ఈ వడ్డీ చెల్లింపులు ఏడాదికోసారి ఉంటాయి. ఉద్యోగి ఈపీఎఫ్ ఖాతాలోనే నేరుగా ఈ వడ్డీ సొమ్ము డిపాజిట్ అవుతుంది. అప్పుడప్పుడు ఖాతాలోని బ్యాలెన్స్‌ను చెక్ చేసుకుంటుంటే ఇది తెలుస్తుంది. అయితే మీ ఖాతాలోని బ్యాలెన్స్‌ను క్షణాల్లో తెలుసుకొనేందుకు కొన్ని మార్గాలున్నాయి. వాటిని పరిశీలిస్తే..
ఉమాంగ్ యాప్
స్మార్ట్‌ఫోన్లలో ఉద్యోగులు ఉమాంగ్ యాప్‌ను డౌన్‌లోడ్ చేయాలి.
యూజర్ ఐడీ, పాస్‌వర్డ్‌లను క్రియేట్ చేసుకొని, లాగిన్ అవ్వాలి.
ఆ తర్వాత ‘వ్యూ పాస్‌బుక్’ ఆప్షన్‌ను ఎంచుకోవాలి.
ఆపై మీ మొబైల్ స్క్రీన్‌పై పీఎఫ్ ఖాతా బ్యాలెన్స్‌ను చూసుకోవచ్చు.
ఇందులో డిపాజిట్ అయిన మొత్తాలు, తదితర వివరాలూ ఉంటాయి.
ఈపీఎఫ్‌వో మెంబర్ పోర్టల్
తొలుత ఈపీఎఫ్‌వో అధికారిక వెబ్‌సైట్ https://www.epfindia.gov.inకు వెళ్లాలి.
ఆ తర్వాత సర్వీసెస్‌పై క్లిక్ చేయాలి.
అక్కడ ఫర్ ఎంప్లాయీస్ ఆప్షన్‌ను ఎంచుకోవాలి.
అందులో సర్వీసెస్‌లో కనిపించే మెంబర్ పాస్‌బుక్‌ను ఎంచుకోవాలి.
ఆ తర్వాత తెరుచుకునే పేజీలో మీ యూఏఎన్ నెంబర్, పాస్‌వర్డ్‌లను ఎంటర్ చేసి, క్యాప్చా కొట్టాలి.
మీ రిజిస్టర్ మొబైల్ నెంబర్‌కు ఓటీపీ వస్తుంది. స్క్రీన్‌పై కనిపిస్తున్న దగ్గర ఓటీపీ ఎంటర్ చేయాలి.
వెంటనే మీ ఖాతాలోని బ్యాలెన్స్ వివరాలు కనిపిస్తాయి. మీ సంస్థ ద్వారా ఎంత?, మీ ద్వారా ఎంత? వచ్చింది కూడా ఉంటుంది.
ఉద్యోగిగా ఈపీఎఫ్‌వోలో మీ అనుభవం కూడా తెలుసుకోవచ్చు. అన్ని వివరాలు తెలుసుకున్నాక లాగౌట్ అవ్వడం మరిచిపోవద్దు.
మిస్డ్ కాల్/ఎస్‌ఎంఎస్
మీ యూఏఎన్ రిజిస్టర్డ్ మొబైల్ ఫోన్ నుంచి 9966044425కి మిస్డ్ కాల్ ఇచ్చినా మీ పీఎఫ్ ఖాతాలోని బ్యాలెన్స్ వివరాలు ఎస్‌ఎంఎస్ రూపంలో మీకు వస్తాయి. లేదా మీ యూఏఎన్ నమోదిత మొబైల్ ఫోన్ నుంచే 7738299899కు EPFOHO UAN ENG అని టైప్ చేసి ఎస్‌ఎంఎస్ చేసినా వివరాలు లభిస్తాయి. ప్రాంతీయ భాషల్లోనూ సమాచారం తెలుసుకోవచ్చు. అందుకు పైన పేర్కొన్న దానిలో ENGకి బదులు TEL అని టైప్ చేస్తే తెలుగులో, HIN అని టైప్ చేస్తే హిందీలో సమాచారం అందుతుంది.
ఇలా తమిళం, కన్నడ, మలయాళం, పంజాబీ, గుజరాతీ మరికొన్ని భాషలవారూ తమ భాష ఆంగ్ల పేరులోని మొదటి మూడు అక్షరాలను ఆంగ్ల క్యాపిటల్ అక్షరాల్లో టైప్ చేసి వివరాలను పొందవచ్చు. కాగా, EPFOHO UAN అని టైప్ చేసి పైన పేర్కొన్న మొబైల్ నెంబర్‌కు ఎస్‌ఎంఎస్ చేసినా ఆంగ్లంలో వివరాలు వస్తాయి. ఆంగ్లం అనేది డీఫాల్ట్‌గా ఉంటుంది. మీ మాతృ భాషలో సమాచారం కావాలంటేనే చివర్లో దాని ఆంగ్ల క్యాపిటల్ అక్షరాలను పేర్కొనాలి.