తన వియ్యంకుడు రా రైస్ ఎగుమతి చేయడం లేదని బుకాయించిన మంత్రి పయ్యావుల
ఇండోనేషియాకు పచ్చి బియ్యం ఎగుమతి
సాక్షి ప్రతినిధి, కాకినాడ: కాకినాడ పోర్టులో పర్యటన సందర్భంగా స్టెల్లా-ఎల్ నౌకను తనిఖీ చేసి రేషన్ బియ్యం అక్రమ రవాణా జరుగుతోందంటూ హడావుడి చేసిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అక్కడే సముద్ర జలాల్లో ఉన్న కెన్‌స్టార్ నౌకను కనీసం కన్నెత్తి కూడా చూడకపోవడం వెనుక అసలు నిజాలు బయటకు వస్తున్నాయి.
కెన్‌స్టార్ నౌకలో బియ్యాన్ని ఎగుమతి చేస్తున్న కంపెనీ స్వయంగా ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ వియ్యంకుడిది కావడమే దీనికి కారణం. పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన పట్టాభి ఆగ్రో ఫుడ్స్ అధినేత కేవీ కృష్ణారావు బియ్యాన్ని కాకినాడ పోర్టు ద్వారా విదేశాలకు ఎగుమతి చేస్తున్నారు.
అయితే ఆర్థిక మంత్రి పయ్యావుల తన వియ్యంకుడు కేవలం బాయిల్డ్ రైస్ మాత్రమే ఎగుమతి చేస్తున్నాడని, ముడి బియ్యం ఎగుమతి చేయడంలేదని మంగళవారం చెప్పారు. మూడు తరాలుగా ఈ వ్యాపారంలో ఉన్న తన వియ్యంకుడు అసలు ఇప్పుడు ఇక్కడ వ్యాపారం చేయడం లేదన్నారు.
తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో మాత్రమే వ్యాపారం చేస్తున్నారని చెప్పారు. అయితే తన వియ్యంకుడి సంస్థ గురించి ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ చెప్పిన మాటలన్నీ ‘పచి్చ’ అబద్ధాలని తాజాగా తేలిపోయింది.
పోర్టులో పట్టాభి బియ్యం లారీలు..
కాకినాడ యాంకరేజ్ పోర్టులో బియ్యం ఎగుమతి కార్యకలాపాలను బుధవారం పరిశీలించగా మంత్రి పయ్యావుల మాటలు పచ్చి బూటకమని తేలిపోయింది. పట్టాభి ఆగ్రోఫుడ్స్ లిమిటెడ్ పేరుతోనే ఆ లారీలు రా రైస్‌ను పోర్టులో దిగుమతి చేస్తున్నాయి. ఓమ్ సాయి-2 ఏపీ ఏవీ కే 0024 బార్జ్‌లో పట్టాభి ఆగ్రోఫుడ్స్ పచ్చి బియ్యాన్ని ‘బిరస్ బుల్లోగ్’ ప్యాకింగ్‌తో పోర్టులో ఉన్న ఎంవీడీడీఎస్ మెరీనా అనే నౌకకు తరలిస్తున్నారు.
12 వేల మెట్రిక్ టన్నుల పచ్చి బియ్యాన్ని ఇండోనేషియాకు ఎగుమతి చేసేందుకు పట్టాభి ఆగ్రోఫుడ్స్ ఒప్పందం చేసుకున్నట్లు సమాచారం. కాకినాడ పోర్టు నుంచి బియ్యం ఎగుమతుల్లో మంత్రి పయ్యావుల వియ్యంకుడి సంస్థ పట్టాభి ఆగ్రో ప్రైవేటు లిమిటెడ్ చురుగ్గా వ్యవహరిస్తోంది. వాస్తవాలు ఇలా ఉండగా మంత్రి పయ్యావుల తన వియ్యంకుడికి వత్తాసు పలుకుతూ పచ్చి అబద్ధాలు వల్లించడంపై విస్మయం వ్యక్తమవుతోంది.
పచ్చ మీడియాకే అనుమతి..
కాకినాడ యాంకరేజ్ పోర్టులో నిలిపివేసిన స్టెల్లా-ఎల్ నౌకలో పీడీఎస్ బియ్యం తనిఖీల కోసం నియమించిన అధికారుల కమిటీ బుధవారం నౌకను పరిశీలించింది. టీవీ-5, ఈటీవీ, ఈనాడు, ఏబీఎన్ ఆంధ్రజ్యోతిని మాత్రమే తనిఖీల సందర్భంగా కమిటీ తమ వెంట తీసుకెళ్లడం గమనార్హం. నౌకలో తనిఖీకి వెళుతున్నట్లు ఎల్లో మీడియాకు మాత్రమే సమాచారం ఇచ్చి గుట్టుగా వ్యవహరించారు.