రోజులు మారుతున్న కొద్దీ మనుషుల్లో కూడా మార్పులు సహజమయ్యాయి. మోడ్రన్ డ్రెస్సులు వేసుకోవడంతోపాటు, మోడ్రన్ గా కనిపించాలని బొట్టు పెట్టుకోవడం కూడా పూర్తిగా మానేశారు. కొంతమంది పెళ్లయిన, పెళ్లి కాకపోయినా బొట్టు అందంగా ఉండదని పెట్టుకోవడం మానేస్తున్నారు. కానీ, హిందూ సనాతన ధర్మంలో బొట్టుకు ఒక ప్రత్యేకమైన ప్రాధాన్యత ఉంది. బొట్టు పెట్టుకోవడం వెనుక ఎన్నో శాస్త్రీయ కారణాలు ఉన్నాయి. అయితే, బొట్టు ఎందుకు పెట్టుకోవాలి? బొట్టు యొక్క ప్రాధాన్యత ఏంటి? అనే విషయాలను ఈ కథనంలో తెలుసుకుందాం..
ఆజ్ఞా చక్రం..
బొట్టును రెండు కనుల బొమ్మల మధ్యలో పెట్టుకోవాలి. ఈ రెండు కన్నుల మధ్య స్థాలాన్ని ఆజ్ఞా చక్రం అని అంటారు. ఇది మానవ శరీరంలో ఆరవ, అత్యంత శక్తివంతమైన చక్రం అని చెబుతారు. ఇది తల, మెదడు, కళ్ళు, పీనియల్ గ్రంధి, పిట్యూటరీ గ్రంధిని కలిగి ఉంటుంది.
గౌరవాన్ని పొందుతారు..
బొట్టు పెట్టుకోవడం వల్ల మనిషిలో భక్తి, ముక్తి పొందేందుకు సహాయపడుతుంది. బొట్టు పెట్టుకున్న వారిని ఎదుటివారు చూసినప్పుడు వారు పవిత్రంగా కనిపిస్తారు. అలాగే ఎదుటి వారి నుంచి గౌరవాన్ని కూడా పొందుతారు. అంతేకాదు బొట్టు పెట్టుకోవడం వల్ల శరీరం కూడా చల్లగా ఉంటుంది. బొట్టు మనలోని ఏకాగ్రతను పెంచి మెదడుని చురుగా పనిచేసేందుకు దోహదపడుతుంది.
సంతానం..
బొట్టు మహిళలే కాదు పురుషులు కూడా ధరించాలి. ఆడవారు బొట్టు పెట్టుకోవడం వల్ల సంతానం కూడా వెంటనే కలిగే అవకాశం ఎక్కువగా ఉంటుందని శాస్త్రాలు చెబుతున్నాయి. తలనొప్పిని కూడా తగ్గించే సామర్థ్యం బొట్టులో ఉంది. అంతేకాకుండా, బొట్టు జ్ఞాపక శక్తిని పెంచి, ఆలోచన శక్తి విధానంను కూడా పెంపొందేలా చేస్తోంది.
ప్లాస్టిక్ బొట్టు హానికరం..
హానికరమైన ప్లాస్టిక్ బొట్టులు పెట్టుకోవడం మంచిది కాదు. ప్లాస్టిక్ బొట్టు చర్మానికి హానికరమే కాకుండా దానివల్ల కలిగే ఎలాంటి ప్రయోజనాలు ఉండవు. బొట్టు పెట్టుకోవడం చాలా ప్రధానమైన అంశం అని.. దీనికంటూ ఒక ప్రత్యేకత బొట్టు వలన అనేక ప్రయోజనాలు ఉన్నాయని శాస్త్రాల్లో చెప్పబడుతోంది.