11న ఒప్పందం.. 6 నెలల్లో పనులు ప్రారంభం
విశాఖకు మొత్తం 4 లక్షల కోట్ల పెట్టుబడులు
అచ్యుతాపురంలో ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ ప్లాంటు
నక్కపల్లిలో మిట్టల్ స్టీల్ ప్లాంటు: చంద్రబాబు
విశాఖపట్నం, డిసెంబరు 5(ఆంధ్రజ్యోతి): విశాఖపట్నంలో క్లౌడ్ సెంటర్ ఏర్పాటుకు ఐటీ దిగ్గజం గూగుల్ ముందుకు వచ్చిందని ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడించారు. గూగుల్ సంస్థ సుమారు రూ.లక్ష కోట్లకుపైగా పెట్టుబడితో క్లౌడ్ సెంటర్ ఏర్పాటు చేయనుందని విశాఖలో తెలిపారు. గూగుల్‌తో ఈ నెల 11వ తేదీన ఒప్పందం కుదుర్చుకుంటున్నామని, ఆరు నెలల్లో విశాఖలో పనులు ప్రారంభిస్తుందని తెలిపారు. అలాగే అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సమీపాన సుమారు లక్ష కోట్ల రూపాయలతో ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ ప్లాంటు ఏర్పాటుకు దాదాపు అన్ని ప్రక్రియలు పూర్తయ్యాయని పేర్కొన్నారు.
అలాగే నక్కపల్లిలో మిట్టల్ సంస్థ దాదాపు రూ.80 వేల కోట్లతో ఉక్కు కర్మాగారం ఏర్పాటుకు ముందుకు వచ్చిందన్నారు. విశాఖకు మెట్రో వస్తోందని చెప్పారు. ఈ ప్రాజెక్టులన్నీ కలిపి రూ.నాలుగు లక్షల కోట్లు పెట్టుబడులు విశాఖకు వస్తున్నాయని వివరించారు.