బంగాళాఖాతంలో మరో అల్పపీడనం… ఏపీకి తీవ్ర హెచ్చరిక

www.mannamweb.com


ఆంధ్రప్రదేశ్ ను వర్షాలు వీడనంటున్నాయి. బంగాళాఖాతంలో ఒకదాని తర్వాత మరొకటి అల్పపీడనాలు ఏర్పడుతుండటంతో అన్నదాతల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి.

ఇప్పటికే ఫెంగల్ తుఫాను ప్రభావంతో అందినకాడిని పంటలను రైతులు అమ్ముకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. భారీ వర్షాలున్నాయనే హెచ్చరికతో ప్రభుత్వం కూడా రాష్ట్రవ్యాప్తంగా ధాన్యం కొనుగోళ్లను రికార్డు స్థాయిలో పూర్తిచేసింది. రేపు బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడనున్నట్లు వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈనెల ఆరు, ఏడు తేదీల్లో ఏర్పడే ఆవర్తనం దక్షిణ దిశగా పయనించే అవకాశం ఉన్నట్లు అంచనా వేస్తున్నారు.

బలహీనపడిన ఫెంగల్

ఆవర్తనంపై శుక్రవారం ఒక స్పష్టత వస్తుంది. ఫెంగల్ తుఫాను బలహీనపడి అల్పపడీనంగా మారి అరేబియా సముద్రంలోకి ప్రవేశించింది. గురు, శుక్రవారాల్లో దక్షిణ కోస్తాలో తేలికపాటి వర్షాలు కురవనున్నాయి. రెండు మూడు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో వానలు కురవనున్నాయి. శుక్రవారం బంగాళాఖాతంలో ఏర్పడే అల్పపీడనం శ్రీలంక దిశగా పయనిస్తుంది. ఇప్పటికే కోస్తా జిల్లాల్లో సాధారణం కంటే అధికంగా వర్షపాతం నమోదైంది. రాయలసీమ జిల్లాల్లో మాత్రం నమోదవలేదు.

హోం మంత్రి అనిత సమీక్ష

రాష్ట్రంలోని మరికొన్ని జిల్లాల్లో చలి తీవ్రత పెరిగింది. ఈ తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణశాఖ అంచనా వేస్తోంది. గురువారం అన్నమయ్య, కడప, అనంతపురం, నంద్యాల, కర్నూలు, తిరుపతి, ప్రకాశం, బాపట్ల, గుంటూరు, అల్లూరి జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురవనున్నాయి. అలాగే తిరుపతి, చిత్తూరు, నంద్యాల, కర్నూలు, పల్నాడు, బాపట్ల, గుంటూరు, ఎన్టీఆర్, కృష్ణా, పశ్చిమ గోదావరి, కోనసీమ, కాకినాడ, అనకాపల్లి, విశాఖపట్నం, విజయనగరం జిల్లాల్లో సాధారణ వర్షపాతం నమోదవుతుందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. ఏపీలోని అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, ప్రభుత్వ శాఖ ల విభాగాధిపతులతో హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షా సమావేశం నిర్వహించి తీసుకోవల్సిన చర్యలపై వారికి సూచనలు జారీచేశారు. సైరన్ అలారం సిస్టం పునరుద్ధరణకు వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.