ప్రభుత్వం త్వరలో 6వేలమంది ఉపాధ్యాయుల భర్తీకి సన్నాహాలు చేస్తోందని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. గత పది సంవత్సరాల్లో ఒక్క డిఎస్సీ కూడా నిర్వహించకుండా నిరుద్యోగుల జీవితాలను గాలికి వదిలేస్తే ప్రజాప్రభుత్వం అధికారంలోకి రాగానే టీజీపీఎస్సీని ప్రక్షాళన చేసి 56వేలమందికి ఉద్యోగాలు ఇచ్చామని భట్టి విక్రమార్క వెల్లడించారు.
ప్రకటించిన జాబ్ క్యాలెండర్ ప్రకారం యుపిఎస్సీ మోడల్‌లో పకడ్బందీగా పరీక్షలు నిర్వహిస్తూ ముందుకు సాగుతున్నామని చెప్పారు. పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనలో ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితికి తెచ్చారని భట్టి విక్రమార్క ధ్వజమెత్తారు. ప్రతిరోజూ అడ్డగోలుగా మాట్లాడటమే బీఆర్‌ఎస్ నేతల పని అని విమర్శించారు. బీఆర్‌ఎస్ హయాంలో మొత్తం రూ.7 లక్షల కోట్లు అప్పు చేశారని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక రూ.52 వేల కోట్లు అప్పు చేశామని వెల్లడించారు. చేసిన అప్పులను తిరిగి బ్యాంకులకు కట్టే పరిస్థితికి తెచ్చారని వ్యాఖ్యానించారు.
అప్పులకు అదనపు ఆదాయం కలిపి బ్యాంకులకు కట్టే పరిస్థితి తెచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సచివాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. సంక్షేమ పథకాలకు రూ.61 వేల కోట్లు వెచ్చించామని, రైతుభరోసా, రుణమాఫీ, చేయూత, ఆరోగ్యశ్రీ పథకాలకు నిధులు కేటాయించామని తెలిపారు. ఎల్‌పీజీ, విద్యుత్ రాయితీ, రైతుబీమా పథకాలకు నిధులు, ఉపకార వేతనాలు, డైట్ ఛార్జీలు, కల్యాణలక్ష్మికి నిధులు కేటాయించామని భట్టి విక్రమార్క చెప్పారు. ఏటా క్యాలెండర్ ప్రకారం ఉద్యోగాలు భర్తీ చేస్తున్నామని వెల్లడించారు. దెబ్బతిన్న సబ్‌స్టేషన్ల మరమ్మతులను అతివేగంగా చేపట్టామని చెప్పారు. నూతన విద్యుత్ విధానం వచ్చాక మిగతా వివరాలు ప్రకటిస్తామని తెలిపారు. పెరుగుతున్న డిమాండ్‌కు అనుగుణంగా ఛార్జింగ్ స్టేషన్లు పెంచుతామని వెల్లడించారు. నాణ్యమైన విద్యుత్ అందిస్తామని ప్రజలకు హామీ ఇస్తున్నామని స్పష్టం చేశారు. తెలంగాణ మోడల్ ప్రాజెక్టులను మిగతా రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుపుతామని ఉద్ఘాటించారు.
త్వరలోనే కొత్త విద్యుత్ విధానం ప్రకటిస్తాం : త్వరలోనే కొత్త విద్యుత్ విధానం ప్రకటిస్తామని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. సోలార్, విండ్, హైడ్రోజన్ విద్యుదుత్పత్తికి ప్రయత్నిస్తున్నామని తెలిపారు. అందరూ వద్దంటున్నా బీఆర్‌ఎస్ ప్రభుత్వం భద్రాద్రి పవర్ ప్రాజెక్టు కట్టిందని మండిపడ్డారు. థర్మల్ ఎనర్జీ వల్ల కాలుష్యం విపరీతంగా పెరుగుతోందని పేర్కొన్నారు. గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తి దిశగా అనేక చర్యలు చేపట్టామని వెల్లడించారు. 2035 నాటికి 40 వేల మెగావాట్ల హరిత ఇంధనాన్ని అందుబాటులోకి తెస్తామని అన్నారు. తాము అధికారంలోకి రాగానే ఆర్థికరంగం గురించి శ్వేతపత్రం ఇచ్చామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క గుర్తుచేశారు. ఆర్థిక విషయాల గురించి తాము ఏమీ దాయలేదని, విద్యుత్ రంగం గురించి చాలా దుష్ప్రచారం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తప్పుడు ప్రచారాన్ని తాము సమర్థంగా తిప్పికొట్టామని పేర్కొన్నారు. విద్యుత్ విషయంలో సమగ్ర వివరాలను ప్రజలకు వివరించామని తెలిపారు. గతేడాది కంటే విద్యుత్ డిమాండ్ పెరిగినా నాణ్యమైన విద్యుత్ ఇస్తున్నామని వెల్లడించారు. తాము అధికారంలోకి వచ్చాక విద్యుత్ సరఫరాలో ఇబ్బందులు గుర్తించినట్లు చెప్పారు. విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల సమాచారం అంతా ప్రజలకు చెప్పామని పేర్కొన్నారు.
రాష్ట్రానికి మార్గదర్శిగా 2047 విజన్ డాక్యుమెంట్ : 2047 విజన్ డాక్యుమెంట్ విడుదల చేస్తామని భట్టి విక్రమార్క తెలిపారు. రాష్ట్రానికి దశ, దిశ నిర్దేశించే మార్గదర్శిగా విజన్ డాక్యుమెంట్ ఉంటుందని చెప్పారు. అన్ని రంగాల్లో రాష్ట్రం ఎలా ఉండాలనే దాన్ని వివరిస్తామని వ్యాఖ్యానించారు. రామగుండం ఫేజ్- 2పై సకాలంలో నిర్ణయం తీసుకుంటే మేలు జరిగేదని, గత ప్రభుత్వ తప్పుడు నిర్ణయాల వల్ల డిస్కంలపై దాదాపు రూ.10 వేల కోట్ల భారం పడిందని మండిపడ్డారు. అస్తవ్యస్తమైన విధానాలను సరిచేస్తూ ముందుకెళ్తున్నామని తెలిపారు. ప్రజాపాలన ద్వారా వారం రోజులుగా గ్రామాల్లో గ్రామసభలు పెట్టి తీసుకున్న ఒక కోటి 28 వేల దరఖాస్తులను డిజిటల్లైజేషన్ చేశామని చెప్పారు. ప్రభుత్వం అమలు చేస్తున్న గృహ జ్యోతి, సబ్సిడీ సిలిండర్ పథకాలకు లబ్ధిదారులను ఎంపిక చేయడానికి ప్రజాపాలన డిజిటలైజేషన్ నుంచి సమాచారాన్ని తీసుకున్నామన్నారు. ప్రజా భవన్ లో వారానికి రెండు రోజులపాటు నిర్వహిస్తున్న ప్రజావాణి దరఖాస్తులను వివిధ శాఖలకు పంపించి పర్యవేక్షణ చేస్తున్నామని తెలిపారు. సోషియో ఎకానమిక్ ఎడ్యుకేషనల్ పొలిటికల్ అండ్ క్యాస్ట్ సర్వే ప్రణాళిక శాఖ చేపడుతున్నదని, 94 వేల మంది ఎన్యూమరేటర్లు, 9 వేల మంది సూపర్‌వైజర్లు ఈ సర్వేలో పాల్గొన్నారన్నారు. ప్రజలందరికీ సమాన అవకాశాలను పంచడానికి కులగణన సర్వే సమాచారం ఉపయోగపడనుందని వెల్లడించారు.
వద్దంటున్నా బీఆర్‌ఎస్ హయాంలో ఆ పని చేశారు : పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనలో విద్యుత్ రంగం నిర్లక్ష్యానికి గురైందని భట్టి విక్రమార్క అన్నారు. మార్చి నుంచి రాష్ట్రంలో జీరో విద్యుత్ బిల్లు అమలు చేస్తున్నట్లు తెలిపారు. జీరో బిల్లు వల్ల సుమారు 50 లక్షల కుటుంబాలు లబ్ధి పొందాయన్నారు. రాష్ట్రంలోని అన్ని రకాల విద్యాసంస్థలకు ఉచిత విద్యుత్ ఇస్తున్నామని, 39 వేలకు పైగా విద్యాసంస్థలకు ఉచిత విద్యుత్ ఇస్తున్నామన్నారు. విద్యాసంస్థలకు ఉచిత కరెంట్ కింద రూ.199 కోట్లు ఖర్చు చేశామని, రూఫ్‌టాప్ సోలార్ విద్యుత్ దిశగా విద్యాసంస్థలను ప్రోత్సహిస్తున్నామని, రూ.10 వేల కోట్ల అంచనా వ్యయంతో సబ్‌స్టేషన్లు నిర్మిస్తున్నామని భట్టి విక్రమార్క వెల్లడించారు. మెరుగైన విద్యుత్ సరఫరా కోసం కొత్త ట్రాన్స్‌మిషన్ లైన్లు నిర్మిస్తున్నామని అన్నారు. ఇప్పటికే దెబ్బతిన్న సబ్‌స్టేషన్ల మరమ్మతులు సైతం ప్రారంభించామని తెలిపారు.
నూతన విద్యుత్ విధానం అమల్లోకి వచ్చాక మిగతా వివరాలు ప్రకటిస్తామన్నారు. కేంద్రం ఆమోదించేందుకు జాప్యం జరగడంతో రాష్ట్ర ప్రభుత్వంపై మరింత భారం పడిందన్నారు. కేంద్రం జాప్యం వల్ల భద్రాద్రి ప్రాజెక్టు పై 42 శాతం అదనపు భారం పెరిగిందని చెప్పారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే ఆర్థికరంగం గురించి శ్వేతపత్రం విడుదల చేశామన్నారు. ఆర్థికపరమైన విషయాలేవీ దాయలేదని, విద్యుత్ రంగం గురించి బీఆర్‌ఎస్ నేతలు చాలా తప్పుడు ప్రచారం చేశారన్నారు. విద్యుత్ విషయంలో సమగ్ర వివరాలను ప్రజలకు వివరించామని, గతేడాది కంటే విద్యుత్ డిమాండ్ పెరిగినా నాణ్యమైన విద్యుత్ ఇస్తున్నామన్నారు. గ్రీన్ ఎనర్జీ దిశగా అనేక చర్యలు చేపట్టామని, 2035 నాటికి 40 వేల మెగావాట్ల హరిత ఇంధనాన్ని అందుబాటులోకి తెస్తామని, త్వరలోనే కొత్త విద్యుత్ విధానం ప్రకటిస్తామన్నారు. సోలార్, విండ్, హైడ్రోజన్ విద్యుత్ ఉత్పత్తికి ప్రయత్నిస్తున్నామని చెప్పారు. అందరూ వద్దంటున్నా బీఆర్‌ఎస్ హయాంలో భద్రాద్రి పవర్ ప్రాజెక్టు కట్టారని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు.