2024లో అత్యంత ప్రాణాంతకమైన వ్యాధులు ఇవే.. జాగ్రత్తగా ఉండకపోతే 2025లో కూడా

www.mannamweb.com


మనం 2024 ఏడాది చివర్లో ఉన్నాము. ఇంకో కొన్ని రోజుల్లో ఈ ఏడాది ముగుస్తుంది. కొత్త ఏడాదిలోకి అడుగుపెడతాము. ఇలాంటి సమయంలో కొత్త ఏడాది గురించి మాత్రమే కాకుండా గడిచిన ఏడాది గురించి కూడా ఆలోచించాలి.

ఈ ఏడాది ప్రపంచాన్ని ఎలాంటి వ్యాధులు అతలాకుతలం చేశాయి? ఎలాంటి ఆరోగ్య సమస్యలు ప్రజలు ఇబ్బందులకు గురిచేశాయి అనేది తెలుసుకోవాలి.

ఎందుకంటే ఈ సమస్యల గురించి తెలుసుకుంటేనే వచ్చే ఏడాది ఎలాంటి సమస్యలు వస్తాయి అనేది దాని గురించి ప్రిపేర్ అయ్యుండొచ్చు. ఎలాంటి సమస్యలు వచ్చినా వాటిని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండొచ్చు. ఇంతకీ 2024 సంవత్సరాన్ని ఎలాంటి వ్యాధులు అతలాకుతలం చేశాయి? ఏ విధమైన ఆరోగ్య సమస్యలు వచ్చాయి అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం.

1.నిపా వైరస్

2024లో కేరళలో నిపా వైరస్‌ వ్యాప్తి వేగంగా ప్రారంభమైంది. నిపా వైరస్, గబ్బిలాల ద్వారా సంక్రమిస్తుంది. ఇది కరోనా వైరస్ మాదిరిగానే అంటు వ్యాధి. ఇది వ్యక్తి నుండి మరొక వ్యక్తికి వేగంగా వ్యాపిస్తుంది.

లక్షణాలు

నిపా వైరస్ జ్వరం, తలనొప్పి, దగ్గు, గొంతు నొప్పి వంటి లక్షణాలను కలిగి ఉంటుంది. 3 నుండి 14 రోజుల వరకు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిని కలిగిస్తుంది. తీవ్రమైన సందర్భాల్లో, మెదడు వాపు లేదా ఎన్సెఫాలిటిస్ సంభవించవచ్చు.

ఎలా నిరోధించాలి?

నిపా వైరస్ నుండి మిమ్మల్ని మీరు రక్షించుకోవడానికి, ఇంటి పరిసరాలను శుభ్రంగా ఉంచుకోండి. గబ్బిలాలు ఉన్నట్లయితే, వాటిని అక్కడి నుంచి తరిమేయడానికి ప్రయత్నించండి. అలాగే వాటి నుంచి కొంత జాగ్రత్తగా ఉండండి.

2.డెంగ్యూ

ప్రతి ఏటా డెంగ్యూ జ్వరం విజృంభిస్తోంది. కానీ 2024 సంవత్సరంలో మునుపటి సంవత్సరాల కంటే ఎక్కువగా కేసులు నమోదయ్యాయి. ముఖ్యంగా ఆసియా, దక్షిణ అమెరికా, ఆఫ్రికా దేశాల్లో చాలా మంది డెంగ్యూ జ్వరం బారిన పడ్డారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం, 2024లో కేవలం డెంగ్యూ జ్వరంతో దాదాపు 3000 మంది మరణించారు.

లక్షణాలు:

అధిక జ్వరం, తీవ్రమైన తలనొప్పి, కండరాలు మరియు కీళ్ల నొప్పులు, ఆకలి లేకపోవడం, వికారం, వాంతులు, ముక్కు నుండి రక్తం కారడం, చిగుళ్ళు, చర్మంపై దద్దుర్లు, మొదలైనవి.

ఎలా నిరోధించాలి?

డెంగ్యూ రాకుండా ఇల్లు, పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలి. ఇంటి చుట్టూ నీరు పేరుకుపోకుండా చూసుకోవాలి. వాటర్ ట్యాంక్‌ను తరచుగా శుభ్రం చేయాలి. పడుకునేటప్పుడు దోమతెరలు కట్టాలి. దోమల మందులు వాడాలి.

3.మంకీ ఫాక్స్

మంకీ ఫాక్స్ 2024లో వ్యాపించిన మరో ప్రాణాంతక వ్యాధి. ఆఫ్రికాలో మొదలైన ఇది కాంగో, పాకిస్థాన్ వంటి దేశాలకు విస్తరించి భారీ నష్టాన్ని కలిగించింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం, జూన్ 2024 నాటికి, ప్రపంచవ్యాప్తంగా 97,281 మంకీ ఫాక్స్ కేసులు నమోదయ్యాయి. అలాగే సుమారు 208 మంది ఈ వ్యాధి కారణంగా మృతి చెందినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొంది. మంకీ ఫాక్స్ కేసులు జంతువుల నుంచి మనుషులకు వ్యాపిస్తుంది.

లక్షణాలు

మంకీపాక్స్ సాధారణ లక్షణాలు 2-4 వారాల పాటు తీవ్రమైన దురద ఉంటుంది. జ్వరం, తలనొప్పి, కండరాల నొప్పి, వెన్నునొప్పి, బలహీనత, శోషరస గ్రంథులు వాపు వంటి లక్షణాలు కూడా కనిపిస్తాయి.

4.జికా వైరస్

2024లో జికా వైరస్ సంక్రమణ భారతదేశంలోనే కాకుండా ప్రపంచంలోని అనేక ప్రాంతాలలో గమనించబడింది. జికా వైరస్ ఏడిస్ దోమల ద్వారా కూడా వ్యాపిస్తుంది. చాలా మంది ఈ జికా వైరస్ బారిన పడి ఆసుపత్రి పాలయ్యారు.

లక్షణాలు

జికా వైరస్ లక్షణాలు డెంగ్యూ మరియు చికున్‌గున్యా మాదిరిగానే ఉంటాయి. వీటిలో జ్వరం, తలనొప్పి, కీళ్ల నొప్పులు, కళ్లు ఎర్రబడటం, చర్మంపై తీవ్రమైన దురద మొదలైనవి ఉన్నాయి.

ఎలా నిరోధించాలంటే?

జికా వైరస్ దోమల ద్వారా వ్యాపించే అవకాశం ఉన్నందున, దోమలు కుట్టకుండా ఉండేందుకు ప్రజలు పూర్తిగా చేయి మరియు కాళ్లకు కవర్లు ధరించాలి మరియు ఇంట్లో దోమల వికర్షకం వాడాలి. ఇంటి చుట్టూ నీరు పేరుకుపోకుండా చూసుకోవాలి.

5.కోవిడ్-19 XBB వేరియంట్

కరోనా వైరస్‌ని అరికట్టేందుకు ఎలాంటి ప్రయత్నాలు చేసినా, నిర్ణీత కాలం తర్వాత ఆ వైరస్ రూపాంతరం చెంది ప్రజల్లో విస్తరిస్తూనే ఉంటుంది. 2024 నాటికి కోవిడ్-19 XBB వేరియంట్ మొత్తం ప్రపంచాన్ని ప్రభావితం చేసింది. ఈ కరోనా వైరస్‌ను నియంత్రించడానికి మొదట్లో కనిపెట్టిన వ్యాక్సిన్‌ల ప్రభావాన్ని తగ్గించడమే కాకుండా అనేక మంది ప్రాణాలను బలిగొంది. ప్రధానంగా ఇది పిల్లలు మరియు వృద్ధులలో ఎక్కువగా కనిపిస్తుంది.

లక్షణాలు:

కోవిడ్-19 XBB వేరియంట్ లక్షణాలు దగ్గు, విరేచనాలు, అలసట, తలనొప్పి, జ్వరం చలి, రుచి మరియు వాసన కోల్పోవడం, కండరాల నొప్పులు.

ఎలా నిరోధించాలి?

కోవిడ్-19ను నిరోధించాలంటే వేరియంట్‌తో సంబంధం లేకుండా, మాస్క్ ధరించడం, మీ చేతులను శుభ్రంగా ఉంచుకోవడం, రద్దీగా ఉండే ప్రాంతాలను నివారించడం మరియు సామాజిక దూరాన్ని పాటించడం వంటివి చేయాలి.