ఈ రోజుల్లో పాన్ కార్డ్ అనేది అందరికీ మస్ట్ అయింది. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ ఆదాయపు శాఖ ఇస్తున్న పాన్ కార్డ్స్ పొందుతున్నారు.
బ్యాంకు సేవలు మొదలుకొని షాపింగ్, ప్రభుత్వ పథకాల కోసం పాన్ కార్డ్స్ ఉపయోగపడుతున్నాయి. పాన్ కార్డ్ ఆన్‌లైన్ అప్లికేషన్ కోసం భారత ప్రభుత్వం రెండు ప్రధాన ఏజెన్సీలకు అధికారం ఇచ్చింది. అవి నేషనల్ సెక్యూరిటీస్ డిపాజిటరీ లిమిటెడ్ (NSDL), UTI ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ టెక్నాలజీ అండ్ సర్వీసెస్ లిమిటెడ్ (UTIITSL). వీటి అధికారిక వెబ్‌సైట్‌కి వెళ్లి కొత్త పాన్ కార్డు అప్లై చేసుకోవచ్చు.
అయితే ఇదే అదునుగా కొందరు పాన్ కార్డులను దుర్వినియోగం చేస్తున్నారు. మోసపూరిత కార్యకలాపాలు చేసేందుకు తప్పుడు వివరాలు సమర్పించి ఒకటికి మించి పాన్ కార్డులు పొందుతున్నారు. ఇది పూర్తిగా చట్ట విరుద్ధం. ఇలాంటి సందర్భాల్లో ఫైన్ తో పాటు జైలు శిక్ష పడే ప్రమాదం ఉంది.
నిబంధనలు ఉల్లంఘించినందుకు గాను ఆదాయపు పన్ను చట్టం 1961లోని సెక్షన్ 272బీ ప్రకారం రూ. 10 వేల జరిమానా వసూలు చేస్తారు. కొన్నిసార్లు జైలు శిక్ష కూడా పడుతుంది. కాబట్టి మీ వద్ద రెండు పాన్ కార్డులు ఉంటే అదనపు పాన్ కార్డు వెంటనే సరెండర్ చేయాలి. సంబంధిత అధికారులకు తెలియజేసి రద్దు చేసుకోవాలి. లేదంటే చిక్కులు తప్పవు.
కాగా, పాన్ కార్డ్‌లో వినూత్న మార్పు తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వం పాన్ 2.0 పథకాన్ని అమలు చేస్తోంది. ఇక నుంచి ప్రతి పాన్ కార్డుకు క్యూఆర్ కోడ్ ఉంటుంది. పాన్ 2.0 సిస్టమ్ కింద పాన్ కార్డులోని అడ్రస్‌ను ఉచితంగా అప్‌డేట్ చేయవచ్చు. అడ్రస్ అప్‌డేట్ అయిన తర్వాత, ఒక కొత్త E-పాన్ రిజిస్టర్డ్ ఈ-మెయిల్‌కు వస్తుంది. ఈ సర్వీస్‌కు రూపాయి కూడా ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. ఫిజికల్ కార్డు కావాలంటే, కేవలం రూ.50 చెల్లించి పొందవచ్చు.