ఏపీ కేబినెట్‌లోకి నాగబాబు: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు ప్రమోషన్.

www.mannamweb.com


ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపముఖ్యమంత్రిగా పవన్ కల్యాణ్ జెట్ స్పీడుతో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడు నెలల పాలనలో తన మార్క్ కోసం పరితపిస్తున్నారు.

అంతేకాదు డిప్యూటీ సీఎం హోదాలో కీలకమైన నిర్ణయాలు సైతం తీసుకుంటున్నారు. ముుఖ్యంగా కాకినాడ పోర్టు తరహా విషయాలలో దూకుడుగా వ్యవహరిస్తున్నారు. దీంతో ఏపీ ప్రభుత్వంలో పవన్ కల్యాణ్ ముద్ర అనేది స్పష్టంగా కనిపిస్తోంది. ఒకవైపు రాష్ట్ర రాజకీయాల్లో దూకుడు వ్యవహరిస్తూనే బీజేపీకి స్టార్ కాంపైనర్‌గా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తూ ఆ పార్టీ గెలుపులో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఇలాంటి సమయంలో అనూహ్యంగా పవన్ కల్యాణ్ సోదరుడు, జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబును కేబినెట్‌లోకి తీసుకుంటామని సీఎం చంద్రబాబు నాయుడు ప్రకటన విడుదల చేయడంపై సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఒక పార్టీ అధినేతగా…పానలో ఉప ముఖ్యమంత్రిగా దూసుకుపోతున్న పవన్ కల్యాణ్‌ అకస్మాత్తుగా కేబినెట్‌లోకి తన సోదరుడిని తీసుకురావడంపై పొలిటికల్‌గా ఆసక్తికర చర్చ జరుగుతుంది. పవన్ కల్యాణ్ రాజకీయంగా ఇకపై జాతీయస్థాయిలో ఉంటుందనే ప్రచారం జరుగుతుంది. ఇందులో భాగంగానే తెరపైకి నాగబాబు వచ్చారనే టాక్ వినిపిస్తోంది.

బీజేపీ స్టార్ కాంపైనర్‌గా డిప్యూటీ సీఎం
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఇకపై జాతీయ రాజకీయాల్లో బిజీకానున్నారనే ప్రచారం సోషల్ మీడియాలో విపరీతంగా జరుగుతుంది. జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ను జాతీయ స్థాయిలో ఉపయోగించుకోవాలనే యోచనలో బీజేపీ ఉందని తెలుస్తోంది. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు బీజేపీ జాతీయ నాయకత్వంతో సత్సంబంధాలు ఉన్నాయి. టీడీపీతో పొత్తుకు పవన్ కల్యాణ్‌ బీజేపీ హైకమాండ్‌ను ఒప్పించారు అంటే పరిచయాలు ఎంతలా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. అలాగే జాతీయ స్థాయి నాయకులతోనూ పవన్ కల్యాణ్‌కు సత్సంబంధాలు ఉన్నాయి. మరోవైపు పవన్ కల్యాణ్‌కు ఇతర రాష్ట్రాల్లో సైతం ప్రజాదరణ ఉంది. అందుకు నిదర్శనమే మహారాష్ట్ర, కర్ణాటక ఎన్నికల ఫలితాలు. ఈ క్రమంలో పవన్ కల్యాణ్‌ను వేగు చుక్కగా బీజేపీ నాయకత్వం భావిస్తోందని తెలుస్తోంది.

హస్తినకు జనసేనాని
ఇదిలా ఉంటే పవన్ కల్యాణ్‌కు రాష్ట్ర రాజకీయాలతో పాటు జాతీయస్థాయి రాజకీయాలపైనా మక్కువ ఎక్కువ. అంతేకాదు అంతర్జాతీయ రాజకీయాలపైనా మంచి పట్టుంది. ముఖ్యంగా బంగ్లాదేశ్‌లో హిందువులపై దాడి ఘటనపై గళమెత్తిన నాయకుడు పవన్ కల్యాణ్ మాత్రమే. మరోవైపు ఏపీలో ఉంటూనే భారతీయ సనాతన ధర్మం కోసం వెలుగెత్తి చాటుతున్నారు. దీంతో ఒక్కసారిగా పవన్ కల్యాణ్ ఇమేజ్ దేశవ్యాప్తంగా పెరిగిపోయింది. ఈ క్రమంలో పవన్ కల్యాణ్ మంగళగిరిలో ఉంటే కన్నా ఢిల్లీలోనే ఉంటే బెటర్ అనే యోచనలో బీజేపీ వ్యూవహరచన చేస్తున్నట్లు తెలుస్తోంది.

వచ్చే ఎన్నికల్లో ఉపయోగించుకోవాలనే బీజేపీ ప్లాన్
ఇదిలా ఉంటే జాతీయ రాజకీయాల్లో ఇండి కూటమి బలంగా తయారవుతుంది. పార్లమెంట్ సమావేశాల్లో గట్టిగానే ప్రొటెస్ట్ చేస్తోంది. అంతేకాదు పలు రాష్ట్రాల ఎన్నికల్లో ఇండి కూటమి గట్టిగానే పోటీ ఇస్తుంది. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ మరింత బలపడే అవకాశాలు లేకపోలేదు అనే ప్రచారం కూడా ఉంది. అలాగే రాబోయే రోజుల్లో తమిళనాడు, ఢిల్లీలలో కూడా ఎన్నికలు ఉన్నాయి. ఈ రెండు కూడా బీజేపీకి అత్యంత ప్రతిష్టాత్మకం. సినీ గ్లామర్‌తోపాటు ప్రజాదరణ కలిగిన పవన్ కల్యాణ్‌ను ఢిల్లీ, తమినాడు రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారంలో వినియోగించుకుంటే పార్టీకి తిరిగి ఉండదనే భావన బీజేపీ హైకమాండ్‌లో ఉందని తెలుస్తోంది.

గతంలోనే ఎంపీగా పోటీ చేయాలని బీజేపీ హైకమాండ్ సూచన
వాస్తవానికి బీజేపీ గత ఎన్నికల్లో ఎంపీగానే పవన్ కల్యాణ్‌ను పోటీ చేయాలని సూచించింది. ముఖ్యంగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఇదే విషయాన్ని పవన్ కల్యాణ్‌కు స్పష్టం చేశారు. ఇదే విషయాన్ని పవన్ కల్యాణ్ బహిర్గతం చేశారు. ఎన్నికల సమయంలో టిక్కెట్లు, సీట్ల సర్దుబాటు సమయంలో తనను బీజేపీ పెద్దలు ఎంపీగా పోటీ చేయాలని సూచించారని పవన్ కల్యాణ్ బహిరంగంగానే వెల్లడించారు. అయితే ఇంట గెలిచి రచ్చగెలవాలనే ఉద్దేశంతో పవన్ కల్యాణ్ పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలుపొంది డిప్యూటీ సీఎం అయిపోయారు. అయితే ఇటీవల కాలంలో పవన్ కల్యాణ్‌కు ఉన్న క్రేజ్..దేశ రాజకీయాల్లో ఆయనకు ఉన్న ఇమేజ్‌ను పార్టీ కోసం వినియోగించుకుంటే బెటర్ అనే భావనలో బీజేపీ ఉన్నట్లు తెలుస్తోంది.

కేంద్రమంత్రిగా పవన్‌కు ప్రమోషన్
బీజేపీ హైకమాండ్ పవన్ కల్యాణ్‌ను జాతీయ స్థాయిలోకి తీసుకెళ్తే ఏపీలో జనసేన పార్టీ ప్రభావంపై నీలిమబ్బులు కమ్ముకుంటాయి. అలాంటి పరిస్థితి తలెత్తకూడదనే ఉద్దేశంతోనే నాగబాబును ఏపీ కేబినెట్‌లోకి తీసుకుంటున్నారనే ప్రచారం ఉంది. బీజేపీ హైకమాండ్ ఒత్తిడి వల్లే నాగబాబును ఏపీ కేబినెట్‌లోకి తీసుకుంటున్నారని తెలుస్తోంది. నాగబాబు పర్యవేక్షణలో జనసేన పార్టీ ముందుకువెళ్తుందని భావిస్తోంది. అంతేకాదు పవన్ కల్యాణ్‌ను కేవలం అవసమైనప్పుడు మాత్రమే ఒక స్టార్ కాంపైనర్‌గా వాడుకోవాలనే యోచనలో బీజేపీ ఉంది. ఈ క్రమంలో డిప్యూటీ సీఎం పదవి నుంచి ఒకవేళ పవన్ కల్యాణ్ తప్పుకుంటే కేంద్రమంత్రిగా ప్రమోట్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

ఏపీలో ఉంటేనే పవన్‌కు పవర్
ఇదిలా ఉంటే సోషల్ మీడియాలో మరో చర్చ జరుగుతుంది. పవన్ కల్యాణ్ బీజేపీ కోసం ఆలోచించి ఢిల్లీ వెళ్తే ఏపీలో జనసేన పరిస్థితి అగమ్యగోచరంగా తయారయ్యే అవకాశం లేదు అని తెలుస్తోంది. ఖచ్చితంగా పవన్ కల్యాణ్ ఏపీ రాజకీయాల్లోనే ఉంటూ అవసరం వచ్చినప్పుడు ట్రబుల్ షూటర్ మాదిరిగా బీజేపీకి అండగా నిలబడితే బెటర్ అని కొందరు సూచిస్తున్నారు. అంతేకాదు పవన్ కల్యాణ్ రాష్ట్రాన్ని వదిలి జాతీయ రాజకీయాల్లోకి వెళ్తే కాపు నాయకుడిని ముఖ్యమంత్రిగా చూడాలనే తమ కోరిక కలగానే మిగిలిపోతుందని కాపు నాయకులు భావిస్తున్నారు. కాబట్టి పవన్ కల్యాణ్ జాతీయ రాజకీయాల్లోకి వెళ్లే కన్నా ఒక ట్రబుల్ షూటర్ గా లేదా స్టార్ కాంపైనర్‌గా వ్యవహరిస్తేనే మంచిదని పలువురు రాజకీయ విశ్లేషకులు స్పష్టంచేస్తున్నారు.