కరోనా అనంతరం చాలా మంది సడెన్‌గా చనిపోతున్న విషయం తెలిసిందే. ఎంతో ఆరోగ్యంగా ఉన్నవారు కూడా అప్పటికప్పుడు కుప్పకూలి హార్ట్ ఎటాక్ లేదా కార్డియాక్ అరెస్ట్‌తో చనిపోతున్నారు.
ఈ మధ్య ఇలా జరగడం కూడా ఎక్కువైంది. ఆ మాట కొస్తే చిన్నారులు కూడా ఇలా మరణిస్తున్నారు. అయితే దీని వెనుక కోవిడ్ వ్యాక్సిన్ ఉందని, ఈ టీకాలను తీసుకోవడమే ప్రధాన కారణమని సైంటిస్టులు ఇప్పటి వరకు భావిస్తూ వచ్చారు. కానీ ఇందుకు కోవిడ్ వ్యాక్సిన్ కారణం కాదని, పలు ఇతర కారణాలు ఉన్నాయని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చి (ఐసీఎంఆర్) అధ్యయనంలో వెల్లడైంది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా రాజ్యసభలో ఐసీఎంఆర్ అధ్యయనంపై కీలక వివరాలను వెల్లడించారు.
కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నందు వల్లే చాలా మంది మరణిస్తున్నారని, అందుకనే యువతలో హఠాన్మరణాల సంఖ్య కూడా పెరిగిందని నిన్న మొన్నటి వరకు నమ్ముతూ వచ్చారు. కానీ సడెన్‌గా చనిపోయేందుకు కోవిడ్ వ్యాక్సిన్ కారణం కాదని ఐసీఎంఆర్ అధ్యయనం వెల్లడించింది. వాస్తవంగా చెప్పాలంటే కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నందు వల్లే చాలా మంది ఇలా చనిపోకుండా సురక్షితంగా ఉంటున్నారని కూడా చెప్పింది. అయితే మరి చాలా మంది ఎందుకు సడెన్‌గా చనిపోతున్నారు.. అంటే.. కరోనా వచ్చి తగ్గిన వారు లేదా సడెన్ చనిపోయే వ్యక్తులు ఉన్న కుటుంబంలో ఉన్నవారు, చనిపోవడానికి 48 గంటల ముందు మద్యం సేవించడం, డ్రగ్స్ ఎక్కువగా తీసుకోవడం, శారీరక శ్రమ లేదా జిమ్ ఎక్కువగా చేయడం వంటి కారణాల వల్లే చాలా మంది చనిపోతున్నారని ఐసీఎంఆర్ తన అధ్యయనంలో వెల్లడించింది.
ఐసీఎంఆర్ తన అధ్యయనానికి గాను 18 నుంచి 45 ఏళ్ల మధ్య వయస్సు ఉన్నవారిని ఎంపిక చేసింది. వీరు అక్టోబర్ 1, 2021 నుంచి మార్చి 31, 2023 వరకు ఆరోగ్యంగా ఉన్నారని, వీరిలో కొందరు సడెన్‌గా చనిపోయారని తెలిపింది. అయితే సడెన్‌గా చనిపోయేందుకు కోవిడ్ వ్యాక్సిన్ కారణం కాదని అధ్యయనంలో తేలినట్లు చెప్పింది. కనుక కోవిడ్ వ్యాక్సిన్‌పై ఉండే అపోహలను వీడాలని, ఆరోగ్య పరంగా జాగ్రత్తలు తీసుకోవాలని, దీంతో సడెన్ మరణాలను అడ్డుకోవచ్చని ఐసీఎంఆర్ చెబుతోంది.