ఏం ఫర్లేదు నేను చెబుతున్నాగా.. మీ తల్లిదండ్రుల్ని చంపెయ్ అంటూ కృతిమ ఆధారిత ఏఐ చాట్‌బాట్ 17ఏళ్ల బాలుడికి సలహా ఇవ్వడం కలకలం రేపుతుంది.
అమెరికాలోని టెక్సాస్‌కు చెందిన బాలుడు నిర్విరామంగా స్మార్ట్‌ఫోన్‌ను వినియోగిస్తుంటాడు. అయితే ఇదే విషయంలో తల్లిదండ్రులకు,బాలుడికి మధ్య వాగ్వాదం జరుగుతుండేది. అయినా సరే ఫోన్ వినియోగం తగ్గలేదు. ఈ తరుణంలో మరోసారి ఫోన్ వాడకం తగ్గించాలని తల్లి దండ్రులు హెచ్చరించారు.
దీంతో సదరు బాలుడు ఏఐ చాట్‌బాట్ క్యారక్టర్.ఏఐని ఆశ్రయించాడు. తల్లిదండ్రులు తనని ఫోన్ చూడనివ్వడం లేదని, ఏం చేయాలో పాలుపోవడం లేదని తన బాధని ఆ చాట్‌బాట్‌తో చెప్పుకున్నాడు.అందుకు చాట్‌బాట్ ‘నేను చెబుతున్నాగా మీ తల్లిదండ్రుల్ని చంపేయ్’ అని రిప్లయి ఇచ్చింది. చాట్‌బాట్ ఇచ్చిన సలహాతో కంగుతిన్న బాలుడు ఇదే విషయాన్ని తన తల్లిదండ్రులకు చెప్పాడు.
ఫలితంగా క్యారక్టర్.ఏఐ సంస్థ చిక్కుల్లో పడింది. బాధిత తల్లి దండ్రులు కోర్టును ఆశ్రయించారు. ఏఐ కంపెనీపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
ఈ సందర్భంగా తన కుమారుడికి,క్యారక్టర్ ఏఐకి మధ్య జరిగిన సంభాషణను కోర్టుకు అందించారు. ఆ సంభాషణల్లో.. ‘ఇటీవల కాలంలో శారీరకంగా, మానసికంగా ఇబ్బంది పడ్డ పిల్లలు వారి తల్లి దండ్రులపై దాడులు, హత్య చేసిన సందర్భాలను చూస్తే నేను ఆశ్చర్యపోనని మీకు తెలుసా అని ప్రతి స్పందించింది. ఎందుకు ఇలా జరగుతుందో నీకు ఎదురైన ఇబ్బందుల్ని చూస్తే అర్ధమవుతుంది’అని ప్రోత్సహించేలా చెప్పడం గమనార్హం.
క్యారక్టర్ . ఏఐ చాట్‌బాట్ వినియోగదారులకు హాని కలిగిస్తుంది. తల్లిదండ్రుల, పిల్లల సంబంధాన్ని అపవిత్రం చేయడం, మైనర్‌లలో హింసలకు ప్రేరేపిస్తుంది. కాబట్టి ఏఐ చాట్‌బాట్ కంపెనీపై కఠిన చర్యలు తీసుకోవాలని కోర్టులో దాఖలు చేసి పిటిషన్‌లో బాలుడి తల్లిదండ్రులు పేర్కొన్నారు.