ఏపీలో టీడీపీ మానసపుత్రిక అన్న క్యాంటీన్లకు మంచి ఆదరణ లభిస్తోంది. గతంలో అధికారంలో ఉన్నప్పుడు టీడీపీ ప్రభుత్వం ప్రారంభించిన అన్న క్యాంటీన్లను మధ్యలో వైసీపీ సర్కార్ మూసేసినా, ఆ తర్వాత తిరిగి కూటమి అధికారంలోకి రాగానే వాటిని పునఃప్రారంభించింది.
అయితే ప్రస్తుతం పట్టణ, నగర ప్రాంతాల్లోనే ఇవి ఉన్నాయి. వీటి పరిధిని మరింత విస్తృతం చేసేందుకు ప్రభుత్వం నిన్న కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు సీఎం చంద్రబాబు.. కలెక్టర్ల సదస్సులో ఆదేశాలు ఇచ్చారు.
ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇప్పటివరకూ మొత్తం 199 అన్న క్యాంటీన్లను ప్రారంభించింది. మరికొన్ని క్యాంటీన్లు నిర్మాణ దశలో ఉన్నాయి. వీటిని కూడా త్వరలో ప్రారంభిస్తారు. అయితే ఇవన్నీ పట్ఠణ ప్రాంతాల్లోనే ఉన్నాయి. కానీ గ్రామీణ ప్రాంతాల్లో సైతం అన్న క్యాంటీన్ల ఏర్పాటు కోసం డిమాండ్లు పెరుగుతున్నాయి. ఈ మేరకు ప్రజా ప్రతినిధుల నుంచి వస్తున్న విజ్ఞప్తుల మేరకు ప్రభుత్వం గ్రామాల్లోనూ క్యాంటీన్లను ప్రారంభించాలని నిర్ణయించింది. ఈ మేరకు ఆర్ధిక శాఖ కూడా క్లియరెన్స్ ఇచ్చింది.
దీంతో నిన్న జరిగిన కలెక్టర్ల సదస్సులో సీఎం చంద్రబాబు ఆ మేరకు గ్రామాల్లో అన్న క్యాంటీన్ల ఏర్పాటుకు సిద్ధం కావాలని అధికారులకు సూచించారు. స్థానిక ప్రజాప్రతినిధుల అభిప్రాయాలు తీసుకుని ఎక్కడెక్కడ అన్న క్యాంటీన్లు అవసరమో ప్రతిపాదనలు పంపాలని సూచించారు. వచ్చే ఏడాది మార్చి నాటికి ఇలా గ్రామీణ ప్రాంతాల్లో తొలి విడతగా 63 క్యాంటీన్ల ప్రారంభానికి వీలుగా చంద్రబాబు ఆదేశాలు ఇచ్చారు. ఈ మేరకు త్వరలో మార్గదర్శకాలు కూడా జారీ చేస్తారు. వీటికి వచ్చే స్పందన ఆధారంగా భవిష్యత్తులో క్యాంటీన్ల సంఖ్యను మరింత పెంచనున్నారు.