మన దేశంలో సామాన్య, మధ్య తరగతి కుటుంబాలే ఎక్కువగా ఉంటాయి. సాధారణంగా వీరందరూ మోటారు సైకిళ్లనే వినియోగిస్తారు. కారు కొనుగోలు చేసే స్థాయికి వీరికి ఉండదు. ఈ నేపథ్యంలో బస్సులు, రైళ్లు తదితర ప్రయాణ సాధనలపై ఆధారపడతారు. ఇక అత్యవసర సమయంలో ప్రయాణానికి ఇబ్బందులు ఎదురవుతాయి. ఇలాంటి వారందరి కోసం తక్కువ ధరలో ఎలక్ట్రిక్ కారు అందుబాటులోకి వచ్చింది. స్ట్రోమ్ ఆర్3 పేరుతో విడుదలైన ఈ కారును ఒక్కసారి రీచార్జి చేస్తే సుమారు 200 కిలోమీటర్లు ప్రయాణం చేయవచ్చు.
ప్రస్తుతం మన దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం బాగా పెరుగుతోంది. ఈ విభాగంలో అనేక ద్విచక్ర వాహనాలు, కార్లు విడుదల అవుతున్నాయి. అయితే ఎలక్ట్రిక్ కార్ల ధరలు కొంచె అధికంగా ఉండడంతో సామాన్య, మధ్య తరగతి ప్రజలు వాటిని కొనుగోలు చేయడానికి భయపడుతున్నారు. ఈ నేపథ్యంలో ముంబైకి చెందిన స్ట్రోమ్ మోటార్స్ అనే స్టార్టప్ కంపెనీ అత్యంత తక్కువ ధరలో ఎలక్ట్రిక్ కారును విడుదల చేసింది. స్ట్రోమ్ ఆర్3 పేరుతో విడుదల చేసిన ఈ కారుకు మూడు చక్రాలు ఉంటాయి. స్ట్రోమ్ ఆర్3 ఎలక్ట్రిక్ కారు ధర రూ.4.5 లక్షలు మాత్రమే. దీన్ని ఒక్కసారి రీచార్జి చేస్తే సుమారు 200 కిలోమీటర్ల రేంజ్ వస్తుంది. దీనిలో శక్తివంతమైన ఎలక్ట్రిక్ బ్యాటరీ, అధిక సామర్థ్యం కలిగిన మోటార్లను ఏర్పాటు చేశారు. ఈ కారుకు రెండు డోర్లు ఏర్పాటు చేశారు. మూడు చక్రాలు అమర్చారు. ఆకర్షణీయమైన డిజైన్, చిన్న బానెట్, విశాలమైన ఎయిర్ డ్యామ్, ఎల్ ఈడీ లైట్లు, డ్యూయల్ టోన్, సన్ రూఫ్ ఎంతో ఆకట్టుకుంటున్నాయి.
ఎలక్ట్రిక్ కారు కొలతల విషయానికి వస్తే పొడవు 2907, వెడల్పు 1405, ఎత్తు 1572, గ్రౌండ్ క్లియరెన్స్ 185 మి.మీలుగా ఉన్నాయి. కారు మొత్తం బరువు 550 కిలోలు ఉంటుంది. దీనికి 13 అంగుళాల స్టీల్ వీల్స్ అమర్చారు. స్ట్రోమ్ ఆర్ 3 కారు ఇంకా మార్కెట్ లోకి విడుదల కాలేదు. దీనికి తుదిమెరుగులు దిద్దడంలో కంపెనీ బిజీగా ఉంది. అవన్నీ పూర్తయ్యాక, పరీక్షలు జరిపి, ఎలాంటి లోటుపాట్లు లేవని నిర్ధారణ అయిన తర్వాత కారును మార్కెట్ లోకి విడుదల చేయనున్నారు.
ఈ సరికొత్త ఎలక్ట్రిక్ కారుకు ప్రజల ఆదరణ బాగుంటుందని భావిస్తున్నారు. సామాన్యులకు కూడా అందుబాటు ధరలో లభించడం, మెరుగైన రేంజ్ కారణంగా అందరికీ దీనిపై ఆసక్తి నెలకొంది. అలాగే డిజైన్ కూడా చాలా అద్బుతంగా ఉంది. మూడు చక్రాలలో చాలా అందంగా తీర్చిదిద్దారు.