దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ బ్యాంక్ ఎస్బీఐ తాజాగా లోన్ వడ్డీ రేట్లను సవరించింది. మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేట్లను ప్రకటించింది.
డిసెంబర్ 15 నుంచి ఇది అమల్లోకి వచ్చింది. 2025, జనవరి 15 వరకు ఇది అందుబాటులో ఉంటుందని బ్యాంకు స్పష్టం చేసింది. ఎంసీఎల్ఆర్ అంటే రుణ ఆధారిత వడ్డీ రేట్లు అని చెప్పొచ్చు. అన్ని రకాల లోన్లపై బ్యాంకులు వసూలు చేసే కనీస వడ్డీ రేటు అన్నమాట. ఇంతకంటే తక్కువ వడ్డీకి లోన్లు ఇచ్చేందుకు వీల్లేదు. ఎంసీఎల్ఆర్ మారితే.. లోన్ వడ్డీ రేట్లు కూడా దానికి అనుగుణంగా మారుతుంటాయి. ఎంసీఎల్ఆర్ పెరిగితే.. లోన్లపై వడ్డీ రేట్లు పెరుగుతాయి. అక్కడ తగ్గితే.. రుణాలపై వడ్డీ రేట్లు తగ్గుతాయని చెప్పొచ్చు.
ఎస్బీఐలో ఇప్పుడు ఓవర్‌నైట్ ఎంసీఎల్ఆర్ 8.20 శాతంగా ఉంది. 3 నెలలు, 6 నెలల ఎంసీఎల్ఆర్ వరుసగా 8.55 శాతం, 8.90 శాతంగా ఉన్నాయి. ఎక్కువగా కన్జూమర్ లోన్లకు లింక్ అయి ఉండే ఏడాది, రెండేళ్ల టెన్యూర్ ఎంసీఎల్ఆర్ రేట్లు వరుసగా 9 శాతం, 9.05 శాతంగా ఉన్నాయి. ఇక ఎస్బీఐలో పర్సనల్ లోన్ వడ్డీ రేట్లు.. రెండేళ్ల టెన్యూర్ ఎంసీఎల్ఆర్‌కు అనుగుణంగా ఉంటాయి. ఎస్బీఐ ఆటో లోన్ లేదా వెహికిల్ లోన్స్ అనేది ఏడాది టెన్యూర్ ఎంసీఎల్ఆర్‌పై ఆధారపడి ఉంటుంది.
ఎస్బీఐలో సాధారణంగా కార్ లోన్ వడ్డీ రేట్లు 9.20 శాతం నుంచి 10.15 శాతం వరకు ఉన్నాయి. సిబిల్ స్కోరును బట్టి బెస్ట్ వడ్డీ రేటు దక్కించుకోవచ్చు. ఇక లోయార్టీ కార్ లోన్ స్కీమ్ కింద వడ్డీ రేట్లు 9.15 శాతం నుంచే ప్రారంభం అవుతున్నాయి. గ్రీన్ కార్ లోన్ కింద అంటే ఎలక్ట్రిక్ కార్ల కోసం అయితే వడ్డీ రేట్లు 9.10 శాతం నుంచి 9.80 శాతం వరకు ఉన్నాయి. సిబిల్ స్కోరు 800 కంటే ఎక్కువగా ఉంటే అప్పుడు కనిష్ట వడ్డీ రేటుకే లోన్ దక్కించుకోవచ్చు. సిబిల్ స్కోరు 750 ఆపైన ఉంటే మెరుగ్గా ఉన్నట్లు చెబుతుంటారు.
ఇప్పుడు కనీస వడ్డీ రేటు 9.15 శాతంతో చూస్తే.. ఐదేళ్ల వ్యవధికి రూ. 10 లక్షల కార్ లోన్ తీసుకుంటే ప్రతి నెలా ఈఎంఐ ఎంత కట్టాలో తెలుసుకుందాం. ఇక్కడ ప్రతి నెలా ఈఎంఐ రూ. 20,831 పడుతుంది. అంటే రూ. 10 లక్షలపై వడ్డీ అదనంగా రూ. 2.49 లక్షలు పడుతుందన్నమాట. ఇదే విధంగా వేర్వేరు వడ్డీ రేట్లకు ఈఎంఐ ఎంత పడుతుందనేది లెక్కించుకోవచ్చు.