తిరుమలలో 10 నుంచి శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనాలు.. టికెట్లు ఎప్పుడు విడుదల చేస్తారంటే.

www.mannamweb.com


ముక్కోటి ఏకాదశి సందర్భంగా వచ్చే ఏడాది జనవరి 10 నుంచి 19 వరకూ వైకుంఠ ద్వారం ద్వారా శ్రీవారి దర్శనానికి టికెట్ల జారీ షెడ్యూల్‌ను టీటీడీ విడుదల చేసింది.

టీటీడీ ఈఓ జే శ్యామలరావు, అదనపు ఈఓ సీహెచ్ వెంకయ్య, వివిధ విభాగాల అధిపతులతో మంగళవారం అన్నమయ్య భవన్‌లో సమీక్షించారు. ఈ సమీక్షలో పలు నిర్ణయాలు తీసుకున్నారు. వైకుంఠ ద్వారం ద్వారా శ్రీవారి దర్శనానికి పది రోజుల పాటు భక్తుల దర్శన టికెట్లను ఈ నెల 23 ఉదయం 11 గంటలకు టీటీడీ ఆన్ లైన్ లో విడుదల చేస్తుంది. 10 రోజుల ఎస్ఈడీ టోకెన్లను 24 ఉదయం 11 గంటలకు ఆన్ లైన్ లో విడుదల చేస్తారు.

తిరుపతిలో ఎనిమిది, తిరుమలలోని ఒక కేంద్రంలో పది రోజుల వైకుంఠ ద్వార దర్శనాలకు సర్వదర్శనం టోకెన్లు కేటాయిస్తారు. తిరుపతిలోని ఎంఆర్ పల్లి, జీవకోన, రామానాయుడు స్కూల్, రామచంద్ర పుష్కరిణి, ఇందిరా మైదానం, శ్రీనివాసం, విష్ణు నివాసం, భూదేవి కాంప్లెక్స్, తిరుమలలోని కౌస్తుభం విశ్రాంతి భవనంలో టోకెన్లు కేటాయిస్తారు. టోకెన్ల జారీ కేంద్రాల వద్ద భక్తులకు అవసరమైన సౌకర్యాలు కల్పించాలని అధికారులను టీటీడీ ఆదేశించింది.

టోకెన్లు, టికెట్లు ఉన్న భక్తులకు మాత్రమే వైకుంఠ ద్వార దర్శనానికి అనుమతి ఇస్తామని టీటీడీ తెలిపింది. వైకుంఠ ఏకాదశి ఉదయం 4.45 గంటలకు ప్రోటోకాల్ దర్శనం ప్రారంభం అవుతుంది. అధిక రద్దీ వల్ల ఆలయంలో వేదాశీర్వచనం రద్దు చేశారు. అదే రోజు ఉదయం తొమ్మిది గంటల నుంచి 11 గంటల వరకూ స్వర్ణరథంపై శ్రీవారిని ఊరేగిస్తారు. వైకుంఠ ద్వాదశి ఉదయం 5.30 గంటల నుంచి 6.30 గంటల వరకూ శ్రీవారి పుష్కరిణిలో చక్రస్నానం జరుగుతుంది. గోవిందమాల భక్తులకు ఎటువంటి ప్రత్యేక దర్శన వసతి ఉండదని టీటీడీ తెలిపింది.

వైకుంఠ ఏకాదశి నాడు టీటీడీ సెక్యూరిటీ సిబ్బందితో సమన్వయం చేసుకుని తిరుమలలో ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించేందుకు చర్యలు తీసుకోవాలని పోలీసులకు టీటీడీ సూచించింది. ఉదయం ఆరు గంటల నుంచి రాత్రి 12 గంటల వరకూ నిరంతరాయంగా భక్తులకు అన్నప్రసాదాలు పంపిణీ చేయాలని క్యాటరింగ్ అధికారులను ఆదేశించింది. భక్తులకు టీ, కాఫీ, పాలు, ఉప్మా, చక్కెర పొంగలి, పొంగలి పంపిణీ చేయాలని నిర్ణయించింది. లడ్డూ ప్రసాదం విషయంలో భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా ప్రతి రోజూ 3.50 లక్షల లడ్డూలు అందుబాటులో ఉంచుకోవాలని, అదనంగా 3.50 లక్షల లడ్డూలు బఫర్ స్టాక్ సిద్ధం చేసుకోవాలని ఆదేశించింది.