అమెరికాకి వెళ్లే వారిలో ప్రపంచ వ్యాప్తంగా ఇండియన్స్ ముందజలో ఉన్న సంగతి తెలిసిందే. అందులోనూ రెండు తెలుగు రాష్ట్రాల నుంచి ప్రజలు ఎక్కువగా యూఎస్ వెళ్లి స్థిరపడటానికి ప్రయత్నిస్తుంటారు.
ఉద్యోగం, విద్య వంటి అవసరాలతో అక్కడికి వెళ్లి చిన్నగా గ్రీన్ కార్డు తెచ్చుకుని నాలుగు డాలర్లు వెనకేసుకుందాం అనేదే చాలా మంది ప్లాన్. పైగా చాలా మంది తమ పిల్లలు అమెరికాలో సెటిల్ అయ్యారంటూ గొప్పలు చెప్పుకోవటం సైతం మనం తరచుగా వింటూనే ఉంటాం.
అయితే ప్రస్తుతం పరిస్థితులు భారీగా మార్పులకు లోనవుతున్నాయని తెలుస్తోంది. అమెరికా కొత్త అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ వచ్చే నెల పదవీ బాధ్యతలు చేపట్టడానికి ఇంకా నెలరోజులు మాత్రమే సమయం ఉండగా.. యూఎస్ ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఇప్పటికే బహిష్కరించాల్సిన వ్యక్తుల జాబితాను రూపొందించింది. ఈ క్రమంలో సరైన పత్రాలు లేకుండా అమెరికాలో అక్రమంగా నివసిస్తున్న దాదాపు 18 వేల మంది భారతీయుల జాబితా ఇందులో ఉంది. వీరిని అమెరికా అధికారులు తిరిగి ఇండియా పంపేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.
నవంబరులో అమెరికా ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ విడుదల చేసిన జాబితాలో మెుత్తంగా 14.5 లక్షల మంది అక్రమ వలసదారులను అధికారులు గుర్తించారు. ఈ క్రమంలో వీరిలో 17,940 మంది భారతీయులు ఉన్నట్లు గుర్తించబడింది. వీరిలో చాలా మందిపై ఉన్న కేసుల విచారణ జరుగుతోందని, కొన్ని కేసుల్లో హియరింగ్ 2-3 ఏళ్ల పాటు భవిష్యత్తులో ఉన్నట్లు వెల్లడైంది. గడచిన 3 ఆర్థిక సంవత్సరాల్లో అమెరికా సరిహద్దులను అక్రమంగా దాటేందుకు ప్రయత్నించిన సమయంలో సగటున 90,000 మంది భారతీయులు పట్టుబడ్డటం ఆందోళనలు రేకెత్తిస్తోంది. అమెరికాలోని స్థానిక ఇమ్మిగ్రేషన్ నిపుణుల అంచనాల ప్రకారం పంజాబ్, గుజరాత్, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వారు యుఎస్‌లో నమోదుకాని భారతీయుల జాబితాలో ఉన్నట్లు తెలుస్తోంది. వీరు సరైన పత్రాలు లేకుండా యూఎస్ అధికారులకు చిక్కారు.
అయితే అమెరికాలో సరైన పత్రాలు లేకుండా నివసిస్తున్న వారిలో సెంట్రల్ అమెరికాకు చెందిన దేశం హోండురాస్ మెుదటి స్థానంలో ఉంది. ఈ దేశానికి చెందిన దాదాపు 2.61 లక్షల మంది అక్రమంగా యూఎస్ లో నివసిస్తున్నారు. దీని తర్వాత రెండవ స్థానంలో నిలిచిన మరో సెంట్రల్ అమెరికన్ దేశం గౌటుమాలా ప్రజలు 2.53 లక్షల మంది ఇమ్మిగ్రెంట్లు అనిధికారికంగా నివసిస్తున్నారు. ఇక అక్రమంగా వలసదరారులు ఉన్నదేశాల జాబితాలో చైనా ఇండియాను మంచిపోయింది. 37,908 మంది చైనీయులు అమెరికాలో సరైన ఇమ్మిగ్రేషన్ పత్రాలు లేకుండా ఉంటున్నట్లు తేలింది. అయితే అమెరికాకు చుట్టుపక్కల ఉన్న దేశాలకు చెందిన ప్రజలు అక్రమవలసదారుల్లో అత్యధిక సంఖ్యలో ఉన్నట్లు వెల్లడైంది.
అయితే ప్రస్తుతం వారి జాతీయుల వాపసును అంగీకరించడంలో కొన్ని దేశాలు సహకరించటం లేదని అమెరికా అధికార వర్గాలు చెబుతున్నాయి. ఈ దేశాల జాబితాలో భూటాన్, బర్మా, క్యూబా, డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో, ఎరిట్రియా, ఇథియోపియా, హాంకాంగ్, ఇండియా, ఇరాన్, లావోస్, పాకిస్తాన్, పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా, రష్యా, సోమాలియా, వెనిజులా ఉన్నాయని తెలుస్తోంది. డొనాల్డ్ ట్రంప్ కఠినమైన ఇమ్మిగ్రేషన్ విధానాలతో పాటు సరిహద్దు భద్రతకు ఆయన ఇచ్చే ప్రాధాన్యం నేపథ్యంలో అధికారులు అక్రమ వలసదారులను వెనక్కి పంపే క్రమంలో ఉన్నట్లు తెలుస్తోంది. ట్రంప్ వైట్ హౌస్ బాధ్యతలు చేపట్టడానికి ముందే క్లీనింగ్ పూర్తయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు.