కానిస్టేబుళ్ల నియామకాల్లో ప్రాధాన్యం
6 వారాల్లో ప్రత్యేక మెరిట్ లిస్ట్ సిద్ధం
పోలీసు రిక్రూట్‌మెంట్ బోర్డుకు హైకోర్టు ఆదేశం
రాష్ట్ర హోం శాఖ పరిధిలో పనిచేస్తున్న హోంగార్డులకు హైకోర్టులో భారీ ఊరట లభించింది.
పోలీస్ కానిస్టేబుళ్ల నియామకాల్లో సామాజిక రిజర్వేషన్లతో సంబంధం లేకుండా వారిని ప్రత్యేక కేటగిరీగా పరిగణించాలని ఏపీ పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డును హైకోర్టు ఆదేశించింది. ప్రాథమిక పరీక్షలో హోంగార్డులకు వచ్చిన మార్కులు ఆధారంగా ప్రత్యేక మెరిట్ లిస్ట్ తయారు చేయాలని స్పష్టం చేసింది. ఆరు వారాల్లో ప్రక్రియను పూర్తి చేయాలని తెలిపింది. మెరిట్ లిస్ట్ తయారీకి తాము ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులు అడ్డంకికాబోవని స్పష్టత ఇచ్చింది.
ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ సత్తి సుబ్బారెడ్డి బుధవారం తీర్పు ఇచ్చారు. కానిస్టేబుళ్ల నియామకాల్లో సామాజిక రిజర్వేషన్లతో సంబంధం లేకుండా తమను ప్రత్యేక కేటగిరీగా పరిగణించేలా ఆదేశించాలని కోరుతూ పలువురు హోంగార్డులు హైకోర్టును ఆశ్రయించారు. సామాజిక రిజర్వేషన్లను వర్తింపజేసి ప్రాథమిక పరీక్షలో తమకు క్వాలిఫైయింగ్ మార్కులు రాలేదంటూ తదుపరి ఫిజికల్, తుది రాతపరీక్షకు అనుమతించలేదని పేర్కొన్నారు. ఈ వ్యాజ్యాలపై గతంలో విచారణ జరిపిన న్యాయమూర్తి సామాజిక రిజర్వేషన్లతో సంబంధం లేకుండా పిటిషనర్లను ఫిజికల్, తుదిరాత పరీక్షకు అనుమతించాలని పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డును ఆదేశిస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చారు.
వ్యాజ్యాలపై ఇటీవల న్యాయమూర్తి తుది విచారణ జరిపారు. పిటిషనర్ల తరఫున న్యాయవాదులు శీనా కుమార్, శివరామ్, ఆంజనేయులు వాదనలు వినిపించారు. పోలీసు నియామక బోర్డు తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. ”కానిస్టేబుల్ పోస్టులు భర్తీకోసం ఇచ్చిన నోటిఫికేషన్‌ను కానీ, అందులో నిబంధనలను కానీ హోంగార్డులు సవాల్ చేయలేదు.
రాతపరీక్షలో కనీస మార్కులు సాధించి, తదుపరి ప్రక్రియకు ఎంపిక కానందుకే వ్యాజ్యాలు దాఖలు చేశారు. నోటిఫికేషన్ జారీ చేశాక, ఎంపిక ప్రక్రియ మధ్యలో నిబంధనలు మార్చడానికి వీల్లేదు. ఈ నేపథ్యంలో పిటిషన్లు చెల్లుబాటు కావు” అని వివరించారు. ఇరు పక్షాల వాదనలు ముగియడంతో ఇటీవల తీర్పును రిజర్వ్ చేసిన న్యాయమూర్తి బుధవారం నిర్ణయం వెల్లడించారు.