Varun Hasija: రూ.కోటి జీతం.. ఆగిపోతే?

www.mannamweb.com


ఏడాదికి కోటి రూపాయల జీతం.. అంటే నెలకు రూ.ఎనిమిది లక్షలపైనే. ఇలాంటి ఉద్యోగాన్ని ఎవరైనా ఉన్నఫళంగా వదిలేస్తారా? ముంబయికర్‌ వరుణ్‌ హసీజా ఆ పని చేశాడు. ఉద్యోగ ఒత్తిళ్లు భరించలేక, కొన్నాళ్లు మానసికంగా ప్రశాంతంగా ఉండటం కోసం! మరి అతడి స్థానంలో మీరుంటే?? ఖర్చులు, ఈఎంఐలు.. ఊహించుకుంటేనే జీవితం భయంకరంగా ఉంది కదూ! కానీ అలాంటి పరిస్థితుల్లో ఎలా నిబ్బరంగా ఉన్నాడో సవివరంగా చెప్పాడు వరుణ్‌. మనం పట్టుకోవాల్సిన పాయింటు అదే.

ముప్ఫై ఏళ్ల వరుణ్‌ బెంగళూరులోని ఒక ఎమెన్సీ కంపెనీలో ఇంజినీర్‌. కోటి జీతంతో విలాసాల జీవితమే గడిపేవాడు. కానీ ఎప్పుడూ టార్గెట్ల వెనక పరుగు. ఏ సరదా లేదు. కొన్నేళ్లకే విసిగిపోయాడు. చేస్తున్న పనికి ఒక ఏడాది విరామం ప్రకటించాలి అనుకున్నాడు. గట్టిగా ప్రయత్నిస్తే అతడికున్న అనుభవం, ప్రతిభతో మెరుగైన జీతంతో వేరేచోట కొలువు దక్కేదే. కానీ తనకి కావాల్సింది మార్పు. భార్య మోక్షద మన్‌చందా ఆంగ్ల ప్రొఫెసర్‌. మనసులోని బాధంతా చెప్పేసి బ్రేక్‌ కావాలన్నాడు. ‘మనక్కావాల్సింది మానసిక ప్రశాంతతే. తర్వాతే డబ్బు’ అందామె.

అద్దె, ఇంటి ఖర్చులు, బీమా, టూర్లకెళ్తే అయ్యే వ్యయం.. అన్నీ వివరంగా రాసుకున్నాడు. మూడు నెలల ఎక్సెల్‌ షీట్‌ తయారు చేశాడు. అందులో అత్యవసరాలకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలనుకున్నారిద్దరూ. అంతకుముందులా ఫ్యాన్సీ ట్రిప్‌లు మానేశారు. వృథా ఖర్చులు తగ్గించారు. సేవింగ్స్‌లో మాత్రం కోత వేయలేదు. నెల గడిచేసరికి ఒకరి జీతం లేకుండానే ఎలా బతకగలరో ఒక అంచనాకు వచ్చేశారు. ఉద్యోగం వదిలేసినప్పుడు చేతికొచ్చిన మొత్తంతో ఆరునెలలు తేలికగా గడపొచ్చు అని ముందు అనుకుంటే.. ఏడాది వరకు ఏ ఢోకా లేదని తర్వాత అర్థమైంది. ఇంటి రుణం లేకపోవడం వాళ్లకి కలిసొచ్చింది. గతంలోని ఖర్చుల చిట్టా.. ప్రస్తుతం తగ్గించుకున్న వాటి వివరాలు.. ఎలాంటి వాటిని వదిలేయొచ్చు.. అన్నీ ఎక్సెల్‌ షీట్‌ రూపంలో సామాజిక మాధ్యమాల్లో సవివరంగా పెట్టేశాడు. ఇది వైరల్‌గా మారింది. ఉద్యోగం కోల్పోయినవాళ్లు, పింక్‌స్లిప్‌లు అందుకుంటున్నవాళ్లు, లేఆఫ్‌ల బారిన పడుతున్నవాళ్లు.. ‘మేం కష్టాల్లో ఉంటే ఎలా బయట పడవచ్చో మాకు ఓ దారి చూపించావ’ంటూ మెచ్చుకుంటున్నారు. ‘అంత పెద్ద జీతం వదిలేశావ్‌. ఇంతకీ నీకేం మిగిలింది?’ అని విమర్శించిన వాళ్లకు ‘మనశ్శాంతి, ప్రశాంతత, సంతోషం, కుటుంబంతో గడపడానికి నాణ్యమైన సమయం’ అన్నది వరుణ్‌ సమాధానం. ఏడాది ఫుల్‌ రీఛార్జ్‌ అయ్యాక ఏదైనా సృజనాత్మక వ్యాపారం వైపు అడుగులు వేస్తాడట.