సంధ్య థియేటర్‌లో తొక్కిసలాట ఘటన జరిగిన తీరుపై హైదరాబాద్ పోలీసులు వీడియో విడుదల చేశారు. ఈ ఘటనకు సంబంధించి దర్యాప్తు కొనసాగుతోందని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ తెలిపారు. డిసెంబరు 4న పుష్ప-2 చిత్రం సందర్భంగా సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనపై హైదరాబాద్ పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్ వద్ద మీడియా సమావేశంలో వీడియో విడుదల చేశారు పోలీసులు. మినిట్ టు మినిట్ వీడియో రిలీజ్ చేసిన హైదరాబాద్ పోలీసులు మొత్తం వ్యవహారాన్ని వివరించారు.
సంధ్య థియేటర్ ఘటనపై దర్యాప్తు కొన సాగుతోందని, న్యాయ పరమైన సలహాలు తీసుకుని ముందుకెళ్తామని హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ తెలిపారు. ఘటనకు సంబంధించిన సీసీ ఫుటేజ్‌ను సీపీ సీవీ ఆనంద్ విడుదల చేశారు. బౌన్సర్లు ఇకపై పోలీసులను ముట్టుకున్నా, తప్పుగా ప్రవర్తించినావదిలిపెట్టే ప్రసక్తే లేదని సీపీ హెచ్చరించారు. పబ్లిక్‌ను ఎక్కడైనా తోసివేస్తే తాటతీస్తామన్నారు. బౌన్సర్ల తీరుకు సెలబ్రిటీలదే బాధ్యత అన్నారు. ఏజెన్సీలు సైతం కొంత జాగ్రత్తలు వహించాలని సీపీ సూచించారు.
అనంతరం సంధ్య థియేటర్ వద్ద డిసెంబరు 4న రాత్రి అసలు ఏం జరిగిందో చిక్కడపల్లి ఏసీపీ రమేశ్ కుమార్ మీడియాకు వివరించారు. అల్లు అర్జున్ మేనేజర్ సంతోష్‌ను కలిసి తొక్కిసలాట జరిగి ఒక మహిళ చనిపోయారని సమాచారం ఇచ్చామని ఏసీపీ తెలిపారు. ఈ ఘటనలో ఒక బాలుడు కూడా అపస్మారక స్థితిలో ఉన్నాడని,పరిస్థితి అదుపుతప్పింది. ఇక్కడి నుంచి వెళ్లిపోవాలని సూచించామని ఏసీపీ రమేష్ వివరించారు. అయినా.. మేనేజర్ సంతోష్, పోలీసులను అల్లు అర్జున్ వద్దకు వెళ్లనీయకుండా అడ్డుకున్నారని తెలిపారు.
అతి కష్టం మీద వెళ్లి జరిగిన విషయం అల్లు అర్జున్‌కు చెప్పానని ఏసీపీ పేర్కొన్నారు. అయితే, సినిమా చూసిన తర్వాతే వెళ్తానని చెప్పారన్నారు. డీసీపీ జోక్యం చేసుకుని 15 నిమిషాలు సమయం ఇచ్చి, అల్లు అర్జున్‌ను బయటకు తీసుకొచ్చామన్నారు. మేం లోపలికి వెళ్లే వీడియోలు ఉన్నాయి. అల్లు అర్జున్‌తో మాట్లాడే ఫుటేజ్ కోసం ప్రయత్నిస్తున్నామని చిక్కడపల్లి ఏసీపీ మీడియాకు వివరించారు.