అల్లు అర్జున్ (Allu Arjun) పైన పెట్టిన కేసు గురించి సీబీఐ మాజీ జెడి లక్ష్మీనారాయణ (Former JD Lakshmi Narayana) వివరించారు. సహజంగా యాక్సిడెంట్స్ కేసుల్లో 304ఎ అనే కేసులు పెడుతుంటారు.
కానీ అల్లు అర్జున్ పైన పోలీసులు పెట్టిన కేసు ఏమిటంటే… తను వస్తే భారీగా జనసందోహం రావచ్చుననీ, ఆ రద్దీలో ఒకవేళ ప్రమాదం జరిగితే ప్రాణాలు పోవచ్చునని తనకు తెలుసుననీ, అది తెలిసి కూడా అల్లు అర్జున్ సంధ్య థియేటర్‌కి వచ్చినట్లు వున్నదని లక్ష్మీనారాయణ చెప్పారు. ఈ ప్రకారంగా చట్టపరంగా చూస్తే అల్లు అర్జున్‌కి యావజ్జీవం లేదా పదేళ్ల జైలు శిక్ష పడే అవకాశం వుంటుందని అన్నారు.
ఐతే గతంలో ఇలాంటి తొక్కిసలాటలు జరిగినప్పుడు ఎందరో ప్రాణాలు కోల్పోయారని అన్నారు. అప్పుడు పోలీసులు ఇలాంటి కేసులు పెట్టలేదనీ, ప్రమాదవశాత్తూ జరిగినట్లు కేసులు నమోదు చేసారని గుర్తు చేసారు. గతంలో సల్మాన్ ఖాన్ కారు నడుపుతూ ఫుట్ పాత్ పైకి ఎక్కించి ఓ వ్యక్తి మరణానికి కొందరికి తీవ్ర గాయాలకు కారణమయ్యాడనీ, అప్పుడు కూడా ఇలాంటి కేసు పెట్టలేదని అన్నారు. అలాగే గతంలో గోదావరి పుష్కరాలు సమయంలో జరిగిన తొక్కిసలాటలో కూడా కొందరు మరణించారని, అప్పుడు కూడా ఇలాంటి కేసులు పెట్టలేదన్నారు.
ఓ సినిమా థియేటరుకి స్టార్ హీరో వస్తున్నాడని తెలిసినప్పుడు థియేటర్ యాజమాన్యం ప్రత్యేక చర్యలు తీసుకోవాల్సిందనీ, ముందుగా పోలీసులకు సమాచారం ఇచ్చి వుంటే తగు చర్యలు తీసుకునేవారని అన్నారు.