టెలికాం కంపెనీలకు టెలికాం నియంత్రణ సంస్థ (ట్రాయ్) కీలక ఆదేశాలు జారీ చేసింది. వాయిస్, ఎస్సెమ్మెస్‌ల కోసం ప్రత్యేకంగా రీఛార్జి ప్లాన్లు తీసుకురావాలని ఆయా సంస్థలను ఆదేశించింది.
ఇందుకోసం స్పెషల్ టారిఫ్ వోచర్లు తీసుకురావాలంటూ జియో, ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా, బీఎస్‌ఎన్‌ఎల్ సంస్థలకు సూచించింది. దీనివల్ల వాడుకున్న సేవలకు మాత్రమే చెల్లించే వెసులుబాటు యూజర్లకు లభిస్తుందని తెలిపింది. ముఖ్యంగా పల్లెల్లో నివసిస్తున్న ఫీచర్ ఫోన్ యూజర్లు, వృద్ధులకు ఉపయోగకరంగా ఉంటుందని ట్రాయ్ తెలిపింది.
ప్రస్తుతం దాదాపు అన్ని టెలికాం కంపెనీలు వాయిస్, ఎస్సెమ్మెస్‌తో పాటు డేటా కలగలిపిన ప్లాన్‌లు అందిస్తున్నాయి. దీంతో నెలకు దాదాపు రూ.200 చెల్లించాల్సి వస్తోంది. వాస్తవానికి ఫీచర్ ఫోన్ వినియోగదారులకు డేటా అవసరం లేకపోయినా తప్పనిసరి పరిస్థితుల్లో రీఛార్జి చేసుకోవాల్సిన పరిస్థితి. మరోవైపు స్మార్ట్‌ఫోన్‌లో రెండు సిమ్ కార్డులు వాడేవారిదీ ఇదే పరిస్థితి. రెండో సిమ్ కార్డును నిత్యం వాడకపోయినా.. నంబర్ వాడుకలో ఉంచేందుకు కొందరు రీఛార్జి చేస్తూ ఉంటారు. ఇలాంటి వారికి ఇబ్బందులు తప్పనున్నాయి. ట్రాయ్ తాజా ఆదేశాల నేపథ్యంలో తక్కువ ధరలో ప్యాక్స్ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.
దీంతో పాటు స్పెషల్ టారిఫ్ వోచర్లు, కాంబో వోచర్ల ప్రస్తుత కాలపరిమితిని 90 రోజుల నుంచి 365 రోజులకు ట్రాయ్ పెంచింది. దీనివల్ల పదే పదే రీఛార్జి చేసుకునే ఇబ్బంది తప్పుతుందని తెలిపింది. అలాగే తక్కువ కాలవ్యవధి కలిగిన ప్యాక్‌లను కూడా అందించాలని టెలికాం కంపెనీలకు సూచించింది. దీంతో పాటు ఏ డినామినేషనల్‌తోనైనా టాప్-అప్ రీఛార్జి వోచర్లు తెచ్చుకునే వెసులుబాటును కల్పించింది. ప్రస్తుతం రూ.10, 20.. ఇలా విలువలతో కూడిన టాప్-అప్ వోచర్లను మాత్రమే కంపెనీలు అందిస్తున్నాయి. అయితే, కనీస టాప్ అప్ వోచర్ రూ.10 ఉండాలని ట్రాయ్ సూచించింది.