Christmas 2024: ప్రపంచ వ్యాప్తంగా క్రిస్‌మస్ సంబరాలు మొదలయ్యాయి. తూర్పు, పశ్చిమ దేశాల్లో క్రిస్‌మస్ సందడి జోరుగా సాగుతోంది. జీసస్ క్రీస్తు అవరతణాన్ని పురస్కరించుకుని క్రైస్తవులు క్రిస్‌మస్ పండుగను జరుపుకుంటారన్న విషయం తెలిసిందే.
ఈ రోజున పవిత్రగ్రంథమైన బైబిల్‌లోని జీసస్ బోధనలను మరోసారి గుర్తు చేసుకుంటూ ఎంతో వేడుకగా ప్రార్థనలు చేస్తారు. తమను రక్షించడానికే జీసస్ క్రీస్తు అవతారం భూమిపైకి వచ్చిందని భావిస్తారు. క్రీస్తుతో పాటు మేరీ మాతను సైతం ఆరాధిస్తారు.
అయితే, క్రీస్తు, మేరీ మాత ప్రస్తావన బైబిల్‌లోనే కాదు.. ముస్లింల పవిత్ర గ్రంథమైన ఖురాన్‌లోనూ ఉందన్న విషయం మీకు తెలుసా? అరబిక్ ఇస్లామిక్ సాహిత్య సంప్రదాయంలో జీసస్, మేరీ మాతల పేర్లు ప్రచురించి ఉన్నాయని చరిత్రకారులు, రీసెర్చ్ స్కాలర్లు చెబుతున్నారు.
* ప్రొఫెట్‌కు 5 రెట్లు!
ఇస్లాం పవిత్ర గ్రంథమైన ఖురాన్‌లో జీసస్, మేరీ, ఏంజెల్ గాబ్రియోల్, అబ్రహం, మోసెస్, అడమ్ వంటి బైబిల్ పాత్రలు ఉన్నాయని రీసెర్చ్ స్కాలర్ మహమ్మద్ ఖలీద్ సయ్యద్ తన 2023 నాటి ఆర్టికల్‌లో వెల్లడించారు. ఖురాన్‌లో ప్రొఫెట్ మహమ్మద్ పేరు కన్నా 5 రెట్లు ఎక్కువగా జీసస్ పేరు ప్రస్తావించి ఉందని అందులో తెలిపారు. దీంతో పాటు పవిత్ర ఖురాన్ మొత్తంలో ఒకే ఒక్క స్త్రీ పేరు ప్రస్తావించి ఉందని.. అది కూడా జీసస్ తల్లి మేరీ మాత పేరేనన్నారు. ఖురాన్‌లోనే కాకుండా మిగతా అరబిక్ ఇస్లామిక్ లిటరరీ ట్రెడిషన్‌లోనూ బైబిల్ క్యారెక్టర్ల ప్రస్తావన ఉంది. దీనిని బట్టి ఈ రెండు మతాల్లోనూ కొన్ని కామన్ ట్రెడిషన్లు ఉన్నాయన్న విషయం అర్థమవుతోంది.
* ప్రత్యేక చాప్టర్
‘ఖురాన్‌లో జీసస్ పేరును ఇసా(Isa)గా మెన్షన్ చేశారు. జీసస్ తల్లి మేరీని అరబిక్ భాషలో మరియమ్‌గా పేర్కొన్నారు. ఖురాన్‌లో జీసస్‌ను.. ఇసా ఇబిన్ మరియమ్.. అంటే, మేరీ మాత కుమారుడు జీసస్ అని సంబోధించేవారు. అంతేగాకుండా, ఖురాన్‌లో మేరీ మాత, జీసస్‌ల గురించి ఒక చాప్టర్(సురాహ్) ప్రత్యేకంగా ఉంది. 19వ సురాహ్ అయిన సురాత్ మరియమ్‌ని పూర్తిగా వీరికే డెడికేట్ చేశారు. ఆశ్చర్యకరంగా, ప్రవక్త పేరు 4 సార్లు ఉంటే జీసస్ పేరు 25 సార్లు మెన్షన్ అయి ఉంది. ఇక, జీసస్ తల్లి మరియమ్ పేరును 34 సార్లు ప్రస్తావించారు’ అని ఖలీద్ సయ్యద్ రాసుకొచ్చారు.
* ఖురాన్‌లోకి జీసస్ పేరు ఎలా?
ఖురాన్‌లో జీసస్ పేరు ప్రస్తావన వెనుక చరిత్రను ప్రముఖ పాలస్తీనా చరిత్రకారులు తారిఫ్ ఖలిది తన ‘ద ముస్లిం జీసస్'(2001) అనే పుస్తకంలో వివరించారు. జీసస్ పేరు ఎక్కువగా వ్యాప్తి, ప్రచారం అవుతున్న సమయం, ప్రాంతంలో ఇస్లాం మతం పుట్టడమే ఇందుకు కారణమన్నారు.
‘4 నుంచి 8 శతాబ్దాల మధ్యలో ఇస్లాం ప్రవేశించింది. ప్రీ ఇస్లామిక్ అరబిక్ కవిత్వం, అధునాతన ఇస్లామిక్ కవిత్వం సైతం ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. అరేబియా, దాని సమీప ప్రాంతాల్లో క్రిస్టియన్ కమ్యూనిటీలు ఉండేవి, అవి క్రైస్తవ మతాన్ని, జీసస్ మహిమను బలంగా ప్రచారం చేసేవి. దీంతో అటు ఇస్లాం, ఇటు క్రైస్తవం కలిసి వ్యాప్తి చెందాయి. అలా కొన్ని సంప్రదాయలు, పేర్లు, రచనలు రెండింట్లో కామన్‌గా నిలిచాయి. మేరీ తల్లి అన్నా ప్రెగ్నెన్సీ, మేరి మాత జననం, జాన్, జీసస్‌ల జననంతో పాటు జీసస్ మహిమలు ఖురాన్‌లో ఉన్నాయి. గుడ్డివారికి చూపునివ్వడం, మట్టి పావురాలకు ప్రాణం పోయడం, శవాన్ని తిరిగి కూర్చోబెట్టడం వంటి వాటి ప్రస్తావన సైతం ఉంది. దీంతో పాటు బైబిల్‌లో ఉన్న నేటివిటీ సీన్ కూడా మరియమ్ చాప్టర్‌లో వివరించి ఉంది’ అని ఖలిది రాసుకొచ్చారు.