ప్రస్తుతం డాక్యుమెంట్‌లను స్కాన్ చేసేందుకు వివిధ రకాల యాప్‌లను వినియోగిస్తుంటాం. ఈ జాబితాలో ప్రీమియంతోపాటు ఉచితంగా వినియోగించుకొనే యాప్‌లు కూడా ఉన్నాయి.
అయితే మెటాకు (Meta) చెందిన ప్రముఖ మెసేజింగ్ ప్లాట్‌ఫాం వాట్సాప్ (Whatsapp).. డాక్యుమెంట్‌లను స్కాన్ చేసే ఫీచర్‌ను అభివృద్ధి చేసినట్లు తెలిసింది. ఈ ఫీచర్‌తో థర్డ్ పార్టీ యాప్‌ల అవసరం లేకుండా వాట్సాప్ నుంచే నేరుగా స్కాన్ చేయవచ్చు. ఈ వివరాలను వాట్సాప్ ఫీచర్ ట్రాకర్ WABetainfo వెల్లడించింది.
వాట్సాప్ ద్వారా నేరుగా డాక్యుమెంట్‌లను స్కాన్ చేసే ఫీచర్ (Whatsapp Document Scan Feature) కొంత మంది ఐఫోన్ (iOS) యూజర్లకు అందుబాటులోకి వచ్చినట్లు తెలుస్తోంది. డాక్యుమెంట్ షేరింగ్ మెనూ వద్ద ఈ ఫీచర్‌ను ఇంటిగ్రేట్ చేసినట్లు తెలుస్తోంది. ఫలితంగా సులభంగా డాక్యుమెంట్‌లను స్కాన్ చేయవచ్చని సమాచారం. త్వరలో అధిక శాతం మంది యూజర్లకు ఈ ఫీచర్ అందుబాటులోకి రానుంది.
ఒకే పని కోసం వివిధ రకాల యాప్‌ల వినియోగాన్ని వాట్సాప్ కొత్త ఫీచర్ తగ్గించనుంది. నేరుగా షేరింగ్ మెనూ ద్వారా కెమెరా సాయంతో సులభంగా స్కాన్ చేసి, షేర్ చేయవచ్చు. ప్రస్తుతం అనేక యాప్‌లు డాక్యుమెంట్‌ను స్కాన్ చేస్తున్న సమయంలో ఆటోమేటిక్‌గా మార్జిన్‌లను సూచిస్తాయి.
తొలుత ఎవరికి అందుబాటులోకి వస్తుంది? : వాట్సాప్ కొత్త ఫీచర్ కూడా అదే విధంగా పనిచేస్తుందని తెలుస్తోంది. ఈ ఫీచర్ iOS 24.25.80 అప్‌డేట్‌లో గుర్తించినట్లు వాట్సాప్ ఫీచర్ ట్రాకర్ తెలిపింది. ఆండ్రాయిడ్ యూజర్‌లకు ఎప్పటి నుంచి అందుబాటులోకి రానుందో వెల్లడి కాలేదు.
రెండు రోజుల క్రితం వాట్సాప్ కీలక ప్రకటన చేసింది. పాత ఆండ్రాయిడ్ ఫోన్‌లకు సపోర్టును నిలిపివేస్తున్నట్లు ప్రకటన చేసింది. ఇందుకు సంబంధించిన జాబితాను కూడా విడుదల అయింది. సుమారు గత పది సంవత్సరాల కంటే ముందు వచ్చిన ఆండ్రాయిడ్ కిట్‌క్యాట్ OS తో పనిచేస్తున్న స్మార్ట్‌ఫోన్‌లకు సపోర్టు నిలిపేస్తున్నట్లు పేర్కొంది. 2025 జనవరి 1 నుంచి ఈ కొత్త నిర్ణయం అమల్లోకి వస్తుందని వాట్సాప్ తెలిపింది.
శాంసంగ్ గెలాక్సీ S3, గెలాక్సీ S4 మిని, గెలాక్సీ నోట్ 2, గెలాక్సీ Ace 3 ఫోన్‌లతోపాటు మోటో G (1st జెన్), Razr HD, మోటో E 2014 లు ఉన్నాయి. మరియు LG ఆప్టిమస్ G, నెక్సాస్ 4, G2 మిని, L90, సోనీ ఎక్స్‌పీరియా Z, ఎక్స్‌పీరియా SP, ఎక్స్‌పీరియా T, ఎక్స్‌పీరియా V, HTC వన్ X, వన్ X ప్లస్, డిజైర్ 500, డిజైర్ 601 వంటి ఫోన్‌లు ఉన్నాయి.
2025 మే నుంచి పాత ఐఫోన్ మోడళ్లకు కూడా వాట్సాప్ తన సపోర్టును నిలిపివేయనుందని ఇప్పటికే వెల్లడించింది. iOS 15.1, అంతకంటే పాత వెర్షన్ OS వెర్షన్‌లకు ఈ నిర్ణయం వర్తిస్తుందని పేర్కొంది. ఐఫోన్ 5s, ఐఫోన్ 6, ఐఫోన్ 6 ప్లస్ ఫోన్‌లలో మరికొన్ని నెలల్లో వాట్సాప్ పనిచేయదు. ఈ మోడళ్లు ప్రస్తుతం గరిష్ఠంగా iOS 12.5.7 వెర్షన్ ను మాత్రమే సపోర్టు చేస్తాయి.