నేను ఇప్పటివరకు బ్యాంక్‌ లోన్‌ తీసుకోలేదు’ – నా సిబిల్‌ స్కోర్‌ పెరుగుతుందా, తగ్గుతుందా?

www.mannamweb.com


మీరు ఇప్పటి వరకు బ్యాంక్‌ లేదా ఏదైనా ఆర్థిక సంస్థ నుంచి రుణం తీసుకోకపోతే, మీకు రుణ చరిత్ర ఉండదు. ఇది బ్యాంక్‌లను అయోమయంలోకి నెడుతుంది.

మీరు ఎలాంటి లోన్ తీసుకోవాలన్నా, మీ క్రెడిట్‌ హిస్టరీ (Credit History) బాగుండడం ముఖ్యం. క్రెడిట్‌ హిస్టరీని చెక్‌ చేయడానికి బ్యాంక్‌లు లేదా ఆర్థిక సంస్థలు సిబిల్‌ స్కోర్‌ను పరిగణనలోకి తీసుకుంటున్నాయి. క్రెడిట్‌ హిస్టరీ బాగుంటేనే, అంటే బ్యాంక్‌ లేదా ఏదైనా ఆర్థిక సంస్థ నుంచి ఏదైనా లోన్‌ తీసుకుని సక్రమంగా తిరిగి చెల్లిస్తుంటేనే మీ క్రెడిట్‌ స్కోర్‌ లేదా సిబిల్‌ స్కోర్‌ (Credit Score or CIBIL Score) మెరుగ్గా ఉంటుంది. కానీ, మీరు ఎప్పుడూ రుణం తీసుకోకపోతే ఏంటి పరిస్థితి?. దీనివల్ల సిబిల్‌ స్కోర్ మెరుగ్గా ఉంటుందా లేదా అధ్వాన్నంగా మారుతుందా?. ఈ ప్రశ్నకు సమాధానంతో పాటు బ్యాంక్‌ రుణం తీసుకోవడానికి ఎంత సిబిల్‌ స్కోర్‌ ఉండాలో కూడా తెలుసుకుందాం.

కొంతమంది ప్రజలు బ్యాంక్‌ లోన్‌ తీసుకోవడానికి భయపడతారు. మరికొంతమంది క్రెడిట్ కార్డును ఉపయోగించడానికి కూడా ఇష్టపడరు. బ్యాంక్‌ లోన్‌ లేదా క్రెడిట్‌ కార్డ్‌ వల్ల ఖర్చులు పెరుగుతాయని, అప్పుల్లో కూరుకుపోతామని, దీనివల్ల సిబిల్‌ స్కోర్‌ను మరింత తగ్గుతుందని భావిస్తారు. అది నిజం కాదు. బ్యాంక్‌ లోన్‌ లేదా క్రెడిట్‌ కార్డ్‌ను సక్రమంగా వినియోగిస్తే, మీ క్రెడిట్‌ స్కోర్‌ పెరుగుతుంది.

సిబిల్‌ స్కోర్ ప్రాముఖ్యత ఏంటి? (What is the importance of CIBIL score?)

సిబిల్‌ స్కోర్ అనేది ఒక వ్యక్తి రుణ చరిత్రను వెల్లడించే మూడు అంకెల సంఖ్య. ఒక వ్యక్తి రుణం తీసుకోవడానికి అర్హుడా, కాదా అనే విషయాన్ని ఈ స్కోర్‌ నిర్ణయిస్తుంది. మంచి క్రెడిట్ హిస్టరీ ఉండాలంటే రుణం తీసుకోకపోవడమే మంచిదని కొందరు భావిస్తారు, ఇది కూడా నిజం కాదు. ఎలాంటి క్రెడిట్ సౌకర్యాలను ఉపయోగించుకోకపోవడం మీ సిబిల్‌ స్కోర్‌కు మంచి చేయకపోవచ్చు.

మీరు ఇప్పటి వరకు ఏ బ్యాంక్‌ నుంచి గానీ, లేదా ఏ ఇతర ఆర్థిక సంస్థ నుంచి గానీ ఏ విధమైన లోన్‌ తీసుకోకపోతే మీకు ఎలాంటి క్రెడిట్ హిస్టరీ ఉండదు. ఈ పరిస్థితి క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీలను గందరగోళంలోకి నెట్టే అవకాశం ఉంది. అప్పుడు మీ క్రెడిట్‌ స్కోర్ ‘సున్నా’ (0)గా మారవచ్చు. దీనిని బ్యాడ్‌ స్కోర్‌గా బ్యాంక్‌లు పరిగణిస్తాయి. సున్నా సిబిల్‌ స్కోర్‌ ఉన్న వ్యక్తి గురించి బ్యాంక్‌లు/ ఆర్థిక సంస్థలకు ఖచ్చితమైన వివరాలు తెలియవు. జారీ చేసిన లోన్‌ను అతను సక్రమంగా తిరిగి చెల్లించగలడా లేదా అని అర్థం చేసుకోవడంలో బ్యాంక్‌లు/ ఆర్థిక సంస్థలకు సమస్యలు ఎదురవుతాయి. సున్నా సిబిల్‌ స్కోర్‌ ఉన్న వ్యక్తి బ్యాంక్‌ లోన్‌ పొందలేడు అని దీని అర్థం కాదు. అయితే, ఈ పరిస్థితి వడ్డీ రేటును & రుణ మొత్తాన్ని ప్రభావితం చేయవచ్చు.

సిబిల్‌ స్కోర్‌ ఎలా పెంచుకోవాలి? (How to increase CIBIL score?)

మీరు మీ సిబిల్‌ స్కోర్‌ను పెంచుకోవడానికి, క్రెడిట్‌ హిస్టరీని మెరుగ్గా మార్చుకోవడానికి చాలా మార్గాలు ఉన్నాయి. చిన్న EMI మొత్తాలపై వస్తువులను కొనుగోలు చేయడం ఒక సులభమైన మార్గం. మొబైల్ ఫోన్, వాషింగ్ మెషీన్ వంటిని EMI విధానంలో కొంటే, పెద్ద ఆర్థిక భారం లేకుండానే రుణాన్ని తిరిగి తీర్చవచ్చు & మంచి రుణ చరిత్రను నిర్మించుకోవచ్చు. క్రెడిట్ కార్డ్‌ను సక్రమంగా ఉపయోగించి కూడా మీ క్రెడిట్ చరిత్రను సృష్టించవచ్చు & మెరుగు పరుచుకోవచ్చు.

సరైన సిబిల్‌ స్కోర్ ఎంత?

ప్రతి వ్యక్తి సిబిల్‌ స్కోర్‌ 300 నుంచి 900 మధ్య ఉంటుంది. 750 లేదా అంతకంటే ఎక్కువ స్కోర్‌ను ఉత్తమంగా పరిగణిస్తారు. ఇలాంటి వ్యక్తులకు బ్యాంక్‌ లోన్‌ త్వరగా & తక్కువ వడ్డీకి మంజూరవుతుంది. సిబిల్‌ స్కోర్‌ 650 కంటే తక్కువ ఉంటే బ్యాంక్‌ లోన్‌ దొరుకుతుంది గానీ, వడ్డీ రేటు పెరుగుతుంది & లోన్‌ అమౌంట్‌ తగ్గుతుంది. సిబిల్‌ స్కోర్‌ 550 కంటే తక్కువగా ఉంటే లోన్‌ లభించడం దాదాపు కష్టం.