దేశంలోని ప్రముఖ బీమా కంపెనీ అయిన లైఫ్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఇటీవల పార్లమెంట్ కు నివేదిక సమర్పించింది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో తమ సంస్థలో పాలసీదారులు వదిలేసిన సొమ్ము అక్షరాలా 880.93 కోట్లు ఉందని తెలిపింది.
కాబట్టి పాత బాండ్లను ఉపయోగించి వారసులు, నామినీలు తమకు రావాల్సిన సొమ్ము కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి తెలిపిన వివరాల ప్రకారం.. ఎల్ఐసీకి చెందిన 3.72 లక్షల మంది పాలసీదారులు తమ మెచ్యూరిటీ ప్రయోజనాలను క్లెయిమ్ చేసుకోలేదు. ఇటువంటి వాటిలో డెత్ క్లెయిమ్ ల పరిష్కారానికి ఈ సంస్థ ప్రత్యేక చర్యలు తీసుకుంది. దీంతో 2019లో 89 కేసులు ఉండగా, అవి 2023 నాటికి పది కేసులకు తగ్గిపోయాయి. సంవత్సరాల వారీగా అన్ క్లెయిమ్ మెచ్యూరిటీ పాలసీల సొమ్ములు ఇలా ఉన్నాయి. 2021-22 ఆర్థిక సంవత్సరంలో రూ.6.52 కోట్లు, 2022-23లో రూ.897 కోట్లు, 2023-24లో 880.93 కోట్లు ఉన్నట్టు లెక్కలు చెబుతున్నాయి.
సాధారణంగా మూడు, అంతకంటే ఎక్కువ సంవత్సరాలు పాలసీ ద్వారా లావాదేవీలు జరగకపోతే దాన్ని అన్ క్లెయిమ్ పాలసీగా భావిస్తారు. పాలసీని కొన్నాళ్లు కట్టి తర్వాత వదిలేయడం, పాలసీ మెచ్యూర్ అయినా డబ్బులు తీసుకోకపోవడం, పెద్దలు మరణిస్తే వారి పాలసీలను వారసులు పట్టించుకోకపోవడం తదితర అంశాలు దీనికి కారణం. ఎల్ఐసీ పాలసీదారులు, వారి వారసులు, నామినీలు సరైన పత్రాలతో దరఖాస్తు చేసుకుంటే మెచ్యూరిటీ సొమ్ములను పొందే అవకాశం ఉంది. దానికోసం ఈ కింద తెలిపిన సులభ పద్దతులు పాటిస్తే చాలు.
పాలసీ చెకింగ్ ఇలా
ముందుగా ఎల్ఐసీఇండియా అధికారిక వెబ్ సైట్ లోకి వెళ్లండి.
హోమ్ పేజీలో కనిపించిన కస్టమర్ సర్వీస్ అనే విభాగంపై క్లిక్ చేయండి.
పాలసీ దారులు క్లెయిమ్ చేయని మొత్తాలు అనే దాన్ని ఎంచుకోండి.
మీ దగ్గర ఉన్న పాత బాండులోని వివరాలు అంటే పేరు, పాలసీ నంబర్, పుట్టిన తేదీలను నమోదు చేయాలి.
అనంతరం మీ పాలసీ వివరాలు ప్రత్యక్షమవుతాయి.
అప్లయ్ చేసుకోవడం ఇలా
సమీపంలోని ఎల్ఐసీ కార్యాలయం నుంచి క్లెయిమ్ ఫారం పొందవచ్చు. లేకపోతే అధికారిక వెబ్ సైట్ నుంచి డౌన్ లోడ్ చేసుకోండి.
పాలసీ డాక్యుమెంట్, ప్రీమియం రశీదులు, పెద్దల మరణ ధ్రువీకరణ పత్రాలు తదితర వాటిని సిద్ధంగా ఉంచుకోవాలి.
దరఖాస్తు ఫారంలో అన్ని వివరాలు నింపి, దానికి అవసరమైన డాక్యుమెంట్లు జతచేసి, ఎల్ఐసీ కార్యాలయంలో అందజేయాలి.
సంబంధిత అధికారులు వాటిని పరిశీలించి, నిబంధనల మేరకు మీకు సొమ్ములు అందజేస్తారు.
































