అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయంగా గత ప్రభుత్వ హయాంలో గాడితప్పిన పాలనను పరుగులు పెట్టిస్తోంది కూటమి ప్రభుత్వం. అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోనే కోల్పోయిన పరిశ్రమలు తిరిగి రప్పించడంతో పాటు ఎన్నికల హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ వస్తోంది.
తొలినెలలోనే సామాజిక పింఛన్లు వెయ్యికి పెంచడం, గత ప్రభుత్వం మూసేసిన అన్నాక్యాంటీన్లు పునరుద్ధరించింది. ఇప్పటికే ఏడాదికి 3 ఉచిత గ్యాస్ సిలిండర్ల హామీని నెరవేర్చి మహిళల్లో ఆనందోత్సాహాలు నింపిన కూటమి ప్రభుత్వం.. తాజాగా వారికి మరో బంపర్ ఆఫర్ ఇవ్వనుంది. ఆర్థికంగా బాసటగా నిలిచేందుకు కొత్త పథకం అందుబాటులోకి తెచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది. ఇక సీఎం చంద్రబాబు ఆమోదం పొందిన వెంటనే ఈ కింది పథకాలు మహిళలకు అందుబాటులోకి రానున్నాయి..
గత వైసీపీ పాలనలో సంక్షేమ పథకాలు, ప్రత్యేక రాయితీలు లభించక డీలా పడిన బీసీ వర్గాలకు ఊరట కలిగించేందుకు కొత్త పథకాలు తీసుకురాబోతోంది కూటమి ప్రభుత్వం. ప్రధానంగా మహిళలకు ఆర్థిక భరోసా కల్పించేందుకు పెద్ద ఎత్తున సంక్షేమ పథకాల అమలుకు శ్రీకారం చుట్టింది. ఇప్పటికే ఆయా పథకాలకు సంబంధించిన ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపించారు బీసీ సంక్షేమ శాఖ అధికారులు. సీఎం చంద్రబాబు ఆమోదం ముద్ర పొందిన వెంటనే పథకాలు అమలు చేయాలని భావిస్తున్నారు. ఇప్పటికే మహిళలకు ఉచిత టైలరింగ్ శిక్షణ, యువతకు జనరిక్ మందుల షాపుల ఏర్పాటు సన్నాహాలు మొదలయ్యాయి. దీని ద్వారా బీసీ వర్గాలకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించబోతున్నాయి.
ఉచిత స్వయంఉపాధి శిక్షణ..
2014-19 మధ్య టీడీపీ ప్రభుత్వం బీసీలకు అందించిన పథకాలను తిరిగి తీసుకురావాలని సంకల్పించింది కూటమి ప్రభుత్వం. మహిళలకు స్వయం ఉపాధి శిక్షణ అందించేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని బీసీ సంక్షేమ శాఖను ఆదేశించింది. మహిళలకు స్వయం ఉపాధి శిక్షణలో భాగంగా టైలరింగ్‌లో శిక్షణ ఇచ్చేందుకు పలు సంస్థల నుంచి టెండర్లను ఆహ్వానించింది. నైపుణ్యాభివృద్ధితోనూ ఒప్పందాలు పూర్తయినట్లు సమాచారం. ఈ పథకం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 80 వేల మంది బీసీ మహిళలకు లబ్ధి చేకూరనుంది. 90 రోజుల టైలరింగ్ శిక్షణ పూర్తి చేసిన మహిళలకు ఒక్కొక్కరికి రూ.24 వేలు విలువగల కుట్టుమిషన్ ఉచితంగా అందించనుంది ప్రభుత్వం. ఇప్పటికే ఓబీఎంఎస్ సైట్ ద్వారా దరఖాస్తులు ఆహ్వానించేందుకు సన్నాహాలు ప్రారంభించింది.
యువతకు జనరిక్ షాపులు..
ఉన్న ఊళ్లో ఉద్యోగం దొరక్క, సిటీలకు వెళ్లే తాహతు లేక నిరుద్యోగులుగా మిగిలిపోయిన యువతకు శుభవార్త అందించనుంది ఏపీ సర్కారు. నేరుగా ప్రభుత్వ సాయంతో స్వయం ఉపాధి పొందేందుకు ఏర్పాటు చేస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న నగరాలు, పట్టణాలు, మండలాల్లో నివసించే నిరుద్యోగ బీసీ యువతకు జనరిక్ షాపులు ఏర్పాటు చేసుకునే అవకాశం కల్పించనుంది. జనరిక్ మందుల వాడకం పెరిగేలా చేస్తూనే బీఫార్మసీ, ఎంఫార్మసీ చదివి ఖాళీగా ఉన్న వారికి బీసీ సంక్షేమశాఖ తరపున రూ.8 లక్షల రుణం అందించనుంది. ఇందులో రూ.4 లక్షలు సబ్సిడీగా ఇస్తారని తెలుస్తోంది. సీఎం అనుమతి పొందిన వెంటనే బీసీ కార్పొరేషన్ ద్వారా ఈ పథకాలు అమలులోకి రానున్నాయి.
































