తిరుపతిలో వైకుంఠ ద్వారా దర్శనం టోకెన్ల జారీ సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో భక్తులు మృతి చెందడంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
ఈ దుర్ఘటన తనను ఎంతో కలచి వేసిందన్నారు. అస్వస్థతకు గురైన బాధితులకు అందుతున్న వైద్య చికిత్సపై అధికారులతో సీఎం చంద్రబాబు మాట్లాడారు. జిల్లా కలెక్టర్, టీటీడీ అధికారులతో మాట్లాడి పరిస్థితిని సమీక్షించారు సీఎం చంద్రబాబు. ఉన్నతాధికారులు ఘటనా స్థలానికి వెళ్లి సహాయక చర్యలు పర్యవేక్షించాలని, క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందేలా చూడాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు.
అధికారులపై సీఎం చంద్రబాబు సీరియస్, తిరుపతికి..
తిరుపతిలో వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ల కోసం జరిగిన తొక్కిసలాటపై సిఎం చంద్రబాబు అధికారులతో సమీక్షించారు. ఏపీ డీజీపీ, టీటీడీ ఈవో, జిల్లా కలెక్టర్, ఎస్పీలతో రివ్యూ చేశారు. దేవుడి దర్శనం కోసం వచ్చిన భక్తులు ప్రాణాలు కోల్పోవడం తీవ్ర బాధాకరమన్నారు. విశాఖలో మంచి కార్యక్రమం పూర్తి చేసుకున్న సమయంలో తిరుపతిలో జరిగిన ఈ ఘటన తనకు తీవ్ర బాధను కలిగించిందన్నారు.
ముందు జాగ్రత్త చర్యలు విఫలం కావడంపై అధికారుల మీద తీవ్ర అసంతృప్తి, ఆగ్రహం వ్యక్తం చేశారు ముఖ్యమంత్రి చంద్రబాబు. భక్తులు అధికంగా వస్తారని తెలిసినప్పుడు…అందుకు అనుగుణంగా ఎందుకు ఏర్పాట్లు చేయలేకపోయారని ప్రశ్నించారు. ఇలాంటి చోట్ల విధుల్లో అత్యంత అప్రమత్తంగా, బాధ్యతగా ఉండాల్సిన అవసరం లేదా అని నిలదీశారు. మృతుల సంఖ్య పెరగడంపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రస్తుతం క్షతగాత్రులకు అందుతున్న వైద్యంపై వివరించారు జిల్లా అధికారులు. మృతుల సంఖ్య పెరగకుండా బాధితులకు మెరుగైన వైద్యం అందేలా చూడాలని అధికారులకు సీఎం ఆదేశించారు. టీటీడీ టోకెన్లు ఇచ్చే కౌంటర్ల నిర్వహణ, భద్రతను పున:సమీక్షించాలన్నారు. గురువారం ఉదయం తిరుపతికి వెళ్లి క్షతగాత్రులను పరామర్శించనున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు.
తిరుపతిలో ఘటన తీవ్ర ఆవేదన కలిగించింది: పవన్ కళ్యాణ్
వైకుంఠ ద్వార దర్శనం టిక్కెట్ల కోసం తిరుపతిలో ఏర్పాటు చేసిన కేంద్రాల వద్ద తొక్కిసలాటలు చోటు చేసుకున్న ఘటనలో ఆరుగురు మృతి చెందారని తెలిసి తీవ్ర ఆవేదనకు లోనయ్యానని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వెల్లడించారు. భగవంతుడి దర్శనం కోసం వచ్చిన భక్తులు దుర్మరణం పాలవడం దురదృష్టకరం. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నాను. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని వైద్యారోగ్య శాఖకు సూచిస్తున్నాను అని పవన్ పేర్కొన్నారు.
మృతులు, క్షతగాత్రుల్లో ఇతర ప్రాంతాల నుంచి వచ్చేవారు ఉన్నారని తెలిసింది. వారి కుటుంబీకులకు తగిన సమాచారం ఇవ్వడం, సహాయ సహకారాలు అందించడం కోసం సత్వరమే తగిన ఏర్పాట్లు చేయాలని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులకు సూచిస్తున్నాను. అదే విధంగా మృతుల కుటుంబాల దగ్గరకు వెళ్ళి పరామర్శించి మనో ధైర్యం ఇచ్చే బాధ్యతలు టీటీడీ పాలక మండలి తీసుకోవాలి. ఈ ఘటన నేపథ్యంలో తిరుపతి నగరంలోని టికెట్ కౌంటర్ల దగ్గర క్యూ లైన్ల నిర్వహణలో అధికారులకు, పోలీసు సిబ్బందికి జనసేన నాయకులు, జన సైనికులు తోడ్పాటు అందించాలని విజ్ఞప్తి చేస్తున్నాను అని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.
తిరుపతిలో భక్తుల మృతిపై జగన్ దిగ్భ్రాంతి
తాడేపల్లి: తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి వైకుంఠ ద్వార దర్శనంకోసం తిరుపతిలో టోకెన్లు జారీచేస్తున్న కేంద్రం వద్ద తొక్కిసలాటలో భక్తులు మరణించడంపై మాజీ ముఖ్యమంత్రి, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్‌రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలియజేశారు.
గాయపడ్డవారికి మెరుగైన వైద్య సేవలు అందించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తిచేశారు. వైకుంఠ ఏకాదశి దర్శనం కోసం వచ్చిన భక్తులు ఇలా ప్రాణాలు కోల్పోవడం అత్యంత విచారకరమన్నారు. తక్షణం అక్కడ పరిస్థితులను చక్కదిద్దడానికి యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నవారు కోలుకోవాలని ఆకాంక్షించారు.