షుగర్‌ పేషెంట్లు అరటి పండు తినొచ్చా..? ఈ విషయం తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!

www.mannamweb.com


హెల్తీ డైట్‌లో కచ్చితంగా అరటి పండు (Banana) ఉండాల్సిందే. దీంట్లో ఉండే పొటాషియం, విటమిన్‌-సి, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు ఆరోగ్యాన్ని కాపాడతాయి.
ప్రపంచవ్యాప్తంగా అన్ని సీజన్లలో, అందుబాటు ధరలోనే ఇవి లభిస్తాయి. కానీ కొంతమంది మాత్రం అరటి పండ్లు తినరు. ముఖ్యంగా డయాబెటిస్‌ పేషెంట్లు వీటికి దూరంగా ఉంటారు. అయితే షుగర్ పేషెంట్లు నిజంగానే అరటిపండు తినకూడదా? దీనికి నిపుణుల సమాధానం చూద్దాం.

అరటి పండ్లు (Banana) తియ్యగా ఉంటాయి. వీటిలో నేచురల్ షుగర్స్, కార్బోహైడ్రెట్లు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి షుగర్‌ లెవెల్స్‌ పెరుగుతాయని మధుమేహ బాధితులు వీటికి దూరంగా ఉంటారు. కానీ రక్తంలో ఉండే చక్కెర స్థాయులను ఒక్కసారిగా పెంచకుండా నియంత్రించే గుణాలు కూడా దీంట్లో ఉంటాయి. అందుకే వీటిని ఎవరైనా తినొచ్చు.

ఇక, అరటి పండ్లలో గ్లైసెమిక్‌ ఇండెక్స్‌ తక్కువగా ఉంటుంది. రక్తంలో చక్కెర స్థాయులను మనం తినే ఆహారం ఎంత వేగంగా పెంచుతుందో తెలియజేసేదే గ్లైసెమిక్‌ ఇండెక్స్‌. ఇది తక్కువగా ఉంటే షుగర్‌ లెవెల్స్‌ నెమ్మదిగా పెరుగుతాయి. అరటి పండ్ల గ్లైసెమిక్‌ ఇండెక్స్‌ 42 నుంచి 58 మధ్య ఉంటుంది. పండిన తీరును బట్టి ఇది మారుతుంది. అంటే అరటి పండ్లు షుగర్‌ లెవల్స్ వేగంగా పెంచవనే విషయం స్పష్టమవుతోంది.

పండిన తీరును బట్టి షుగర్‌
పండిన కొద్దీ అరటిలో షుగర్‌ లెవెల్స్‌ పెరుగుతాయి. పక్వం చెందని పండ్లలో పిండిపదార్థాలు ఎక్కువగా, చక్కెర స్థాయులు తక్కువగా ఉంటాయి. అది పండుతున్న కొద్దీ పండిపదార్థం చక్కెరగా మారుతుంది. వీటిని పరిమితంగా తింటే ఎలాంటి సమస్య ఉండదు. ఈ పండ్లలో ఫైబర్‌ అధికంగా ఉంటుంది. దీనివల్ల జీర్ణక్రియ నెమ్మదిస్తుంది. ఫలితంగా రక్తంలో చక్కెర మెల్లిగా కలుస్తుంది. ఇది ఒక్కసారిగా షుగర్‌ లెవెల్స్‌ పెరగడాన్ని నియంత్రిస్తుంది.

షుగర్ పేషెంట్లు తినొచ్చా?
డయాబెటిస్‌ బాధితులు సైతం అరటి పండ్లను (Banana) తినొచ్చు. కానీ, పరిమాణం విషయంలో జాగ్రత్త వహించాలి. ఏదైనా అతి అయితే మంచిది కాదు. షుగర్ పేషెంట్లు పరిమితంగా అరటిపండు తింటే ఎలాంటి సమస్య ఉండదు. పైగా పొటాషియం, విటమిన్లు సహా ఇతర పోషకాలు ఆరోగ్యాన్ని కాపాడతాయి. కావాలనుకుంటే దీన్ని ప్రోటీన్‌ లేదా మంచి కొవ్వులుండే ఆహార పదార్థాలతో కలిపి తినొచ్చు. ఉదాహరణకు నట్స్‌, యోగర్ట్‌తో మిక్స్‌ చేసుకోవచ్చు.

బరువు తగ్గాలనుకునేవారు?
బరువు తగ్గాలనుకునేవారు అరటిపండ్లు తినొద్దనే అపోహ చాలా మందిలో ఉంది. నిజానికి ఇది బరువు తగ్గడానికి కూడా సహాయం చేస్తుంది. అరటిలో ఉండే ఫైబర్‌, జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. ఫలితంగా కేలరీలు కరిగి బరువు తగ్గడానికి కారణమవుతుంది. మరోవైపు స్వీట్‌ తినాలనే కోరికను తగ్గిస్తుంది. దీని కేలరీలను పెంచే ఇతర తీపి పదార్థాలకు దూరంగా ఉండొచ్చు.

అరటి వర్సెస్‌ ఇతర పండ్లు
ఇతర పండ్లతో పోలిస్తే అరటిలో (Banana) చక్కెర తక్కువగా ఉంటుంది. బెర్రీలు, యాపిల్స్‌, నారింజలోనూ గ్లైసెమిక్‌ ఇండెక్స్‌ తక్కువగా ఉంటుంది. బ్లడ్‌ షుగర్‌ గురించి ఆలోచించే వారు వీటిని కూడా ట్రై చేయొచ్చు. వివిధ రకాల పండ్లు తినడం వల్ల అన్ని రకాల పోషకాలు శరీరానికి అందుతాయి.