ప్రపంచ స్థాయిలో ఇతర దేశాలతో భారత్ పోటీ పడాలంటే యువతరం వారానికి 70 గంటలు పని చేయాలని ఇన్ఫోసిస్ ఫౌండర్ ఎన్ఆర్ నారాయణ మూర్తి చేసిన వ్యాఖ్యలు పెద్ద ఎత్తున చర్చకు దారి తీసిన విషయం తెలిసిందే.
ఆయన వ్యాఖ్యలను కొందరు సమర్థించగా.. చాలా మంది వ్యతిరేకించారు. తాజాగా ఎల్ అండ్ టీ చైర్మన్ (L&T chairman) ఎస్‌ఎన్ సుబ్రహ్మణ్యన్ (SN Subrahmanyan) సైతం ఇదే తరహా వ్యాఖ్యలే చేశారు. అయితే, నారాయణమూర్తి కంటే ఆయన ఓ అడుగు ముందుకేసి.. వారానికి 90 గంటలు పనిచేయాలని తన ఉద్యోగులకు (employees) సూచించారు.
తన ఉద్యోగులతో ఇంటరాక్షన్ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉద్యోగులు వారానికి 90 గంటలు పనిచేయాలని (90-hour work week) సూచించారు. అవసరమైతే ఆదివారాలు కూడా వదులుకోవాలన్నారు. ఎంతసేపు అలా భార్యను చూస్తూ ఉండిపోతారు..? అంటూ ప్రశ్నించారు. ఇంట్లో తక్కువ సమయం, ఆఫీసులో ఎక్కవ సమయం ఉంటామని భార్యలతో చెప్పాలని ఉద్యోగులతో అన్నారు. ‘ఆదివారాలు మీతో పనిచేయించలేకపోతున్నందుకు బాధపడుతున్నా. మీతో ఆదివారాలూ పనిచేయించగలిగితే నేను మరింత సంతోషంగా ఉంటాను. ఎందుకంటే నేను ఆదివారాలు కూడా పనిచేస్తున్నాను’ అని ఉద్యోగులతో అన్నారు. సుబ్రహ్మణ్యన్ వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
కాగా, ప్రపంచ స్థాయిలో ఇతర దేశాలతో భారత్ పోటీ పడాలంటే యువతరం వారానికి 70 గంటలు పని చేయయాలని ఇన్ఫోసిస్ ఫౌండర్ ఎన్ఆర్ నారాయణ మూర్తి వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. ‘ప్రపంచంలోకెల్లా భారత్‌లోనే ఉత్పాదకత అతి తక్కువ. ఉత్పత్తిలో మన పని మెరుగు పర్చుకోలేకపోయినా, ప్రభుత్వంలో కొంత స్థాయి వరకూ అవినీతి తగ్గించకపోయినా.. అద్భుతమైన ప్రగతి సాధించిన దేశాలతో మనం పోటీ పడలేం’ అని నారాయణ మూర్తి స్పష్టం చేశారు. ‘నా యువతరానికి నేను చేసే రిక్వెస్ట్ ఒకటే.. ‘ఇది నా దేశం. నా దేశం కోసం నేను వారానికి 70 గంటలు పని చేస్తాను’ అని తప్పనిసరిగా ప్రతిజ్ఞ చేయాలి` అని నారాయణ మూర్తి చెప్పారు.