తిరుపతి తొక్కిసలాట ఘటన మీద రాజకీయం మొదలు పెట్టిన వైసీపీ ఈ ఆరు ప్రాణాలు తీసిన పాపానికి పరిహారం ఎవరు చేస్తారు అంటూ కూటమి ప్రభుత్వం పై విరుచుకుపడుతుంది.
చాల కాలం తరువాత వైసీపీ నేతల నోటికి పని దొరకడంతో ఇక తమ పాత వాసన చూపించారు వైసీపీ నేతలు. రోజా, భూమన కరుణాకర్ రెడ్డి, గుడివాడ అమర్నాధ్, వైస్ జగన్ ఇలా వైసీపీ నేతలంతా ఒక్కసారిగా మీడియాలో ప్రత్యక్షమై ఈ ప్రమాదానికి బాధ్యత వహిస్తూ బాబు, పవన్ లు రాజీనామా చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు.
సనాతన ధర్మ పరిరక్షకుడిగా ప్రచారం చేసుకున్న సనాతన వాది పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఈ పాపానికి ఎవరిని భాద్యుడిగా చూపిస్తారు అంటూ ఒకరు, విజనరీ అంటే ప్రాణాలు తీయడమా అంటూ మరొకరు ఇలా కూటమి ప్రభుత్వ పెద్దల పై దొరికిందే సందు కింద విమర్శలు గుప్పిస్తున్నారు.
అయితే ఇందులో ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ప్రశ్నించడం, టీటీడీ పెద్దల పర్యవేక్షణ లోపాన్ని తప్పుపట్టటం వరకు సమంజసమే కానీ ముఖ్యమంత్రిగా బాబు రాజీనామా చెయ్యాలి, ఉప ముఖ్యమంత్రిగా పవన్ తప్పు ఒప్పుకోవాలి అంటూ చావుల మీద రాజకీయ లబ్ది కోసం పాకులాడడం ముమ్మాటికీ వైసీపీ తప్పిదమే అవుతుంది.
జరిగిన ప్రమాదం ఉహించనిదే అయినప్పటికీ ప్రమాద స్థాయిని కూడా అదుపు చేయలేకపోవడం పూర్తిగా అధికారుల నిర్లక్ష్యమే అవుతుంది. బాధ్యత ఎవరు వహించినా, ప్రభుత్వాలు ఎంత ఎక్స్ గ్రేషియాలు ప్రకటించినా, ప్రతిపక్షాలు ఎన్ని సానుభూతి రాజకీయాలు చేసినా ఆ బాధిత కుటుంబాల ఆవేదనకు అంతు ఉండదు.
అయితే ఈ ప్రమాదం పై విచారణకు ఆదేశించిన ముఖ్యమంత్రి చంద్రబాబు హుటాహుటిన తిరుపతి చేరుకొని జరిగిన ప్రమాద సంఘటన పై అటు టీటీడీ అధికారులు, ఇటు పోలీస్ యంత్రాగం పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసారు. అలాగే బాధిత కుటుంబాలకు ప్రభుత్వం తరుపున 25 లక్షల చొప్పున ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. ఇక ప్రభుత్వం తరుపున ముఖ్యమంత్రి బాబు, పలువురు మంత్రులు చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించారు.
ఇదిలా ఉంటే కూటమి ప్రభుత్వం తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాదం పై అసత్య ప్రచారాలు చేసిన నేపథ్యంలో ఏడూ కొండల వాడు ఆగ్రహించి ఇప్పుడు కళ్ళు తెరిచాడు, అందుకే ఈ ప్రమాదం అంటు భూమన చివరికి వేంకన్నను కూడా వైసీపీ రాజకీయంలోకి లాక్కోచ్చేసారు. ఇక ఇటువంటి రాజకీయాలలో ఆరి తేరిన మాజీ ముఖ్యమంత్రి వైస్ జగన్ తిరుపతి తొక్కిసలాట ఘటన బాధిత కుటుంబాలను పరామర్శించడానికి తిరుపతి వెళ్లనున్నారు.
అయితే కనీసం ఈసారైనా కుటుంబ సభ్యులు చనిపోయి పుట్టెడు దుఃఖం లో ఉన్న బాధిత కుటుంబాలను పరామర్శించేటప్పుడైనా జగన్ తన చిక్కటి చిరునవ్వుని అదుపులో పెట్టుకుంటే బాగుంటుంది. అలాకాకుండా బాధలో కంటికి కడివెడు నీళ్లు కారుస్తున్న ఆ బాధితుల వద్దకు వెళ్లి నవ్వుకుంటూ, అమ్మఒడి రాలేదు, నీకు 15 , నీకు 15 అంటు రాజకీయాలు చేయకుండా హుందాతనం ప్రదర్శిస్తే తన స్థాయికి తగ్గట్టుగా ఉంటుంది.
గతంలో కూడా జగన్ ఇదే మాదిరి చనిపోయిన వారి కుటుంబ సభ్యులను పరామర్శించడానికి వెళ్లి, వరద బాధితులను ఓదార్చడానికి వెళ్లి, పంట నష్టం రైతుల వద్దకు వెళ్లి, చివరికి వైసీపీ పార్టీ కార్యకరలు చనిపోయారని పరామర్శించడానికి వెళ్లి అక్కడ కూడా నవ్వులు చిందిస్తూ అసందర్భగా వైసీపీ నవరత్నాలలో రాజకీయం చేసారు.
దీనితో ఇలా చావుల వద్ద నవ్వులు చిందించి సోషల్ మీడియాలో జగన్ నవ్వుల పాలవ్వడం, లేకుంటే రాజకీయాలు చేసి ప్రజలలో పలుచనవ్వడం వైసీపీ పార్టీకి, ఆ పార్టీ నేతకు అలవాటే అనే నానుడిని నిజం చేసినట్టు అవుతుంది.