గోవింద నామ స్మరణతో మారుమోగిపోతున్న తిరుమల

www.mannamweb.com


నేడు వైకుంఠ ఏకాదశి (Vaikunta Ekadasi 2025) సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని ప్రసిద్ధ వైష్ణవ క్షేత్రాల్లో ఉత్తర ద్వారాలు తెరుచుకున్నాయి. తిరుపతి, యాదాద్రి, భద్రాద్రి ఆలయాలతో పాటు వివిధ నగరాలు, పట్టణాల్లోని వైష్ణవ క్షేత్రాలు కిటకిటలాడుతున్నాయి.

స్వామి వారిని దర్శించుకునేందుకు వేకువ జాము నుంచే భక్తులు ఆలయాల వద్ద క్యూ కట్టారు. ఇక తిరుమల(Tirumala)లో అర్ధరాత్రి వైకుంఠ ద్వారాలు తెరుచుకున్నాయి. ఈ సందర్భంగా అర్చకులు స్వామికి పూజలు, హారతి, పుష్ప సమర్పణ చేశారు. తె.4.30 నుంచి ప్రొటోకాల్ దర్శనాలు ప్రారంభమయ్యాయి. ఈరోజు నుంచి 10రోజులు శ్రీవారు ఉత్తర ద్వారం నుంచి దర్శనం ఇవ్వనున్నారు.

అలాగే ఉదయం 8 గంటల నుంచి టోకెన్ పొందిన భక్తులను దర్శనానికి అనుమతించారు. రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రముఖులు శ్రీవారిని దర్శించుకున్నారు. కేంద్ర మంత్రి రామ్మెహన్, రాందేవ్ బాబా, స్పీకర్ అయ్యన్న పాత్రుడు, డిప్యూటీ స్పీకర్ రఘురామ రాజు, తెలంగాణ సీఎం , డిప్యూటీ సీఎం భట్టి, ఏపీ – తెలంగాణ మంత్రులు.. నందమూరి కుటుంబ సభ్యులు, అధికారులు స్వామి వారిని దర్శించుకున్నారు. వీవీఐపీలకు మాత్రం ప్రోటోకాల్ ప్రకారం దర్శనం ఉంటుంది. వైకుంఠ ద్వార దర్శనం సందర్భంగా జనవరి 19 వరకూ ఆర్జిత సేవల్ని రద్దు చేశారు. వైకుంఠ ఏకాదశి కావడంతో.. ఇవాళ శ్రీవారు ప్రత్యేకంగా స్వర్ణ రథంపై మాడవీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిస్తారు. ద్వాదశి పర్వదినాన వేకువజామున స్వామి వారి పుష్కరిణిలో చక్ర స్నానం చేయిస్తారు. ఈ అరుదైన ఘట్టం ప్రత్యక్షంగా వీక్షించేందుకు భక్తులు తిరుమలకు భారీగా చేరుకుంటున్నారు.

ఈరోజు ఈ పనులు చేయొద్దు

పరమ పవిత్రమైన వైకుంఠ ఏకాదశి రోజు బియ్యంతో చేసిన పదార్థాలు తీసుకోకూడదు. ఉపవాసం ఆచరించి, పాలు, పండ్లు, నీరు మాత్రమే తీసుకోవాలి. మాంసాహారం, మద్యపానాన్ని ముట్టరాదు. శారీరక సంబంధాలకు దూరంగా ఉంటూ బ్రహ్మచర్యం పాటించాలి. పగలు నిద్ర పోరాదు. రాత్రి జాగరణ చేస్తూ విష్ణు నామస్మరణ చేయాలి. తులసి అంటే విష్ణువుకు మహాప్రీతి. ఇవాళ తులసి ఆకులను కోయొద్దు. ఇతరులను బాధపెట్టేలా విమర్శలు, కఠిన మాటలు మాట్లాడొద్దు.