తిరుమల తిరుపతి దేవస్థానం లో నిన్న తొక్కిసలాట ఘటన జరిగి పది మంది ప్రాణాలు కోల్పోయిన ఘటన యావత్తు ప్రజానికాన్ని శోకసంద్రంలోకి నెట్టేసిన సంగతి తెలిసిందే.
గడిచిన రెండు దశాబ్దాలలో ఇలాంటి ఘటన తిరుమలలో చోటు చేసుకోలేదు.పోలీసు అధికారుల ఎడబాటు కారణంగా ఇంతమంది ప్రాణాలు కోల్పోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే ఈ ఘటనపై ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చాలా సీరియస్ గా ఉన్నారు. నేడు వీళ్లిద్దరు వివిధ సమయాల్లో తిరుపతికి చేరుకొని, తొక్కిసలాట ఘటన జరిగిన ప్రాంతాన్ని సందర్శించారు. ఎందుకు ఇలాంటి ఘటన జరిగింది అనే దానిపై అధికారులను అడిగి ఆరా తీశారు. బాద్యులైన వారిని క్షమించబోమని హెచ్చరించారు.
అనంతరం కిమ్స్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించి అన్ని విధాలుగా సహాయ సహకారాలు ప్రభుత్వం తరుపున అందిస్తామని హామీ ఇచ్చారు. చనిపోయిన ప్రతీ కుటుంబానికి పాతిక లక్షల ఆర్ధికసాయం కూడా అందించారు. ఇదంతా పక్కన పడితే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈ ఘటనపై చాలా తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేసాడు. ఈ ఘటనపై ప్రభుత్వం తరుపున బాధ్యత వహిస్తూ ఆయన మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి. ఆయన మాట్లాడుతూ ‘ఈ దుర్ఘటన కి ప్రభుత్వం తరుపున బాధ్యత వహిస్తూ, మీ అందరికీ చేతులెత్తి నమస్కారం పెడుతూ క్షమించమని కోరుతున్నాను. ఈ దురదృష్టకరమైన సంఘటన చోటు చేసుకోవడం నా హృదయాన్ని కలిచివేసింది. ఎంతో ఆనందంతో కొత్త సంవత్సరంలో శ్రీవారి దర్శనం చేసుకోవడానికి వచ్చారు. ఇలాంటి సమయంలో ఇలాంటి సంఘటన చోటు చేసుకోవడం అత్యంత శోచనీయం. ఈ ఘటన పై ఆరా తీసి అందుకు కారణమైన ప్రభుత్వ అధికారులపై చర్యలు తీసుకుంటాము. భవిష్యత్తులో ఇలాంటివి చోటు చేసుకోకుండా జాగ్రత్తలు తీసుకుంటాము’ అంటూ చెప్పుకొచ్చాడు పవన్ కళ్యాణ్.
అయితే ఆయన ప్రసంగిస్తున్న సమయంలో ఒక ఆసక్తి కరమైన సంఘటన చోటు చేసుకుంది. మాజీ సీఎం జగన్ కూడా అదే సమయం లో కిమ్స్ హాస్పిటల్ కి విచ్చేశాడు. దీంతో జనాలు కేకలు వేయడం మొదలు పెట్టారు. అకస్మాత్తుగా ఎందుకు అరుస్తున్నారు, ఏమైంది అని పవన్ కళ్యాణ్ తన పక్కనే ఉన్న అధికారి ని అడగగా, జగన్ మోహన్ రెడ్డి వచ్చాడు సార్ అని బదులిస్తాడు. పవన్ కళ్యాణ్ పట్టించుకోకుండా తన ప్రసంగం ఇచ్చి తిరిగి వెళ్ళిపోయాడు. అసెంబ్లీ సమావేశాలు తర్వాత పవన్ కళ్యాణ్ ,జగన్ ఒకే సమయంలో ఒకే చోటున ఉండడం ఇది రెండవసారి అని చెప్పొచ్చు. కానీ వీళ్లిద్దరు నేరుగా ఎప్పుడూ కలుసుకోలేదు. సీఎం చంద్రబాబు తో జగన్ కలిసిన సందర్భాలు చాలానే ఉన్నాయి కానీ, పవన్ కళ్యాణ్ ని కలిసిన సందర్భాలు మాత్రం చాలా తక్కువ. నేడు ఒకరికొకరు ఎదురు కూడా పడి ఉండొచ్చని అంచనా వేస్తున్నారు విశ్లేషకులు.