డిమాండ్​లు నెరవేర్చాలంటూ.. 2 రోజులు బ్యాంకులు ‘బంద్​’!

www.mannamweb.com


బ్యాంకు పనుల కోసం వెళ్లే వారికి కీలక అలర్ట్​! రెండు రోజుల పాటు బ్యాంకులు మూతపడే అవకాశం ఉంది. తమ డిమాండ్​లను పరిష్కరించాలంటూ బ్యాంకులు బంద్​ పాటించే సూచనలు కనిపిస్తున్నాయి. పూర్తి వివరాలు..

బ్యాంకులు సమ్మె బాట పట్టే అవకాశం ఉంది! తమ డిమాండ్లను నెరవేర్చాలని, లేదా రెండు రోజుల పాటు బ్యాంకులు మూసివేస్తామని ఏఐబీఓసీ (ఆల్ ఇండియా బ్యాంక్ ఆఫీసర్స్ కాన్ఫెడరేషన్) తేల్చిచెప్పింది.

2025 ఫిబ్రవరి 24, 25 తేదీల్లో భారత దేశంలోని ప్రభుత్వ రంగ బ్యాంకులు బంద్​ పాటించే అవకాశం ఉందని పీటీఐ నివేదిక పేర్కొంది.

రెండు రోజులు బ్యాంకులు బంద్​..
వారానికి ఐదు రోజుల పనిదినాలు, అన్ని కేడర్లలో తగిన నియామకాలతో పాటు ఇతర డిమాండ్ల కోసం ఫిబ్రవరి 24, 25 తేదీల్లో రెండు రోజుల పాటు దేశవ్యాప్త సమ్మెకు పిలుపునిస్తామని ఆల్ ఇండియా బ్యాంక్ ఆఫీసర్స్ కాన్ఫెడరేషన్ (ఏఐబీఓసీ) హెచ్చరించింది.

డిమాండ్లు ఏమిటి?
బ్యాంకు ఉద్యోగులకు వారానికి ఐదు రోజుల పనిదినాలు కల్పించాలని యూనియన్ డిమాండ్ చేస్తోంది. వాస్తవానికి చాలా ఏళ్లుగా ఈ డిమాండ్​ వినిపిస్తోంది. కానీ ఇప్పటికీ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.
బ్యాంకులకు అన్ని కేడర్లలో తగిన నియామకాలు చేపట్టాలి.
ఉద్యోగ భద్రతకు ముప్పుగా పరిణమించి, ఉద్యోగుల్లో విభజనను సృష్టించే పనితీరు సమీక్ష, పీఎల్ఐలపై డిపార్ట్మెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ (డీఎఫ్ఎస్) ఇటీవల జారీ చేసిన ఆదేశాలను వెంటనే ఉపసంహరించుకోవాలి.
ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో వర్క్​మెన్/ఆఫీసర్ డైరెక్టర్ల పోస్టులను భర్తీ చేయాలి.
ఇండియన్ బ్యాంకింగ్ అసోసియేషన్ (ఐబీఏ)లో పెండింగ్​లో ఉన్న సమస్యలను పరిష్కరించాలని కోరింది.
బ్యాంకు సమ్మె ఎప్పుడు ప్లాన్ చేస్తారు?
విధానపరమైన విషయాల్లో ప్రభుత్వ రంగ బ్యాంకుల (పీఎస్​బీ)లను డీఎఫ్ఎస్ సూక్ష్మ నిర్వహణ చేయడం ఆయా బోర్డుల స్వయంప్రతిపత్తిని దెబ్బతీస్తుందని యూనియన్ ఆరోపించింది.

వచ్చే నెల 24,25 తేదీల్లో రెండు రోజుల పాటు, అంటే సోమ-మంగళవారాలు దేశవ్యాప్త సమ్మె నిర్వహించాలని తమ కార్యవర్గం ప్రతిపాదించిందని ఆల్ ఇండియా బ్యాంక్ ఆఫీసర్స్ కాన్ఫెడరేషన్ ఒక ప్రకటనలో తెలిపింది.

అవసరమైతే మరింత కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉందని తెలిపింది. ఈ నెలలో సమ్మె నోటీసు అందిన వెంటనే ఆందోళన కార్యక్రమాలు ప్రారంభమవుతాయని స్పష్టం చేసింది.

మరి ఈ వ్యవహారం ఎంత తీవ్రమవుతుందో చూడాలి! ఒకవేళ బ్యాంక్​లు నిజంగానే సమ్మెకు దిగితే ప్రైవేటు సంస్థలు కూడా పాల్గొంటాయా? లేదా? అన్నది చూడాలి. ఏదిఏమైనా బ్యాంకు సమ్మె అంటే ప్రజలకు తీవ్ర ఇబ్బందులు తప్పవు! పైగా ఫిబ్రవరి 22 (నాలుగో శనివారం), 23 (ఆధివారం) కూడా సెలవులే వచ్చాయి. అంటే ఒకవేళ 24, 25 తేదీల్లో సమ్మె జరిగితే.. బ్యాంకులు వరుసగా 4 రోజులు మూతపడి ఉంటాయి.